Bandi Sanjay: ట్యాపింగ్‌పై సంజయ్ చేతిలో కీలక ఆధారాలు!
ABN , Publish Date - Aug 08 , 2025 | 04:16 AM
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేతికి కీలక ఆధారాలు అందినట్లు తెలిసింది.
నేడు సిట్ ఎదుట హాజరై అందించనున్న కేంద్ర మంత్రి
హైదరాబాద్, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేతికి కీలక ఆధారాలు అందినట్లు తెలిసింది. శుక్రవారం సిట్ ఎదుట హాజరై సదరు ఆధారాలను ఆయన అందించనున్నట్లు సమాచారం. కాగా, ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేసీఆర్, కేటీఆర్ పాత్రపై కేంద్ర నిఘా వర్గాలు ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించినట్లు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు ఢిల్లీ నుంచి ముగ్గురు హోంశాఖ అధికారులు హైదరాబాద్ చేరుకోగా, వారితోపాటు ఎస్‌ఐబీ, కౌంటర్ ఇంటలిజెన్స్ విభాగాల్లో పనిచేసిన కొంతమంది సీనియర్ అధికారులతో సంజయ్ భేటీ అయ్యారు.
నాటి ప్రభుత్వం.. సంజయ్ ఫోన్‌ను అత్యధికంగా ట్యాప్ చేసినట్లు గుర్తించడమే కాకుండా, సంబంధిత ఆధారాలను సంజయ్‌కు అందించినట్లు తెలిసింది. కాగా, కేంద్ర మంత్రి బండి సంజయ్ శుక్రవారం ఉదయం 11 గంటలకు ఖైరతాబాద్‌లోని హనుమాన్ ఆలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం, రాజ్‌భవన్ సమీపంలోని దిల్‌కుషా గెస్ట్‌హౌజ్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు సిట్ విచారణకు హాజరవుతారు.