Share News

Hyderabad Rainwater Solution: రోడ్డు కింద చెరువులు

ABN , Publish Date - Aug 12 , 2025 | 04:56 AM

కాస్త వానపడితే చాలు హైదరాబాద్‌ మహానగరంలో రహదారులపై వరద చేరుతోంది. నీళ్లు నిలిచిపోయిన చోట

Hyderabad Rainwater Solution: రోడ్డు కింద చెరువులు

  • రహదారులపై వరద నిలవకుండా హైదరాబాద్‌లో భారీ భూగర్భ సంపులు

  • అటు ట్రాఫిక్‌ సమస్యకు చెక్‌

  • ఇటు భూగర్భ జలాల పెంపునకు దోహదం

  • 2.6 లక్షల నుంచి 10.4 లక్షల లీటర్ల వరకు సామర్థ్యం

  • ఇప్పటికే 10 చోట్ల ఏర్పాటు పూర్తి.. మరో ప్రాంతంలో తుదిదశలో నిర్మాణం

  • నగరవ్యాప్తంగా మరిన్ని ప్రాంతాల్లో నిర్మించేందుకు జీహెచ్‌ఎంసీ కసరత్తు

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): కాస్త వానపడితే చాలు హైదరాబాద్‌ మహానగరంలో రహదారులపై వరద చేరుతోంది. నీళ్లు నిలిచిపోయిన చోట వాహనాలు ముందుకు కదలలేక ట్రాఫిక్‌ స్తంభించిపోతోంది. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం భారీ భూగర్భ నీటి సంపుల (రెయిన్‌ వాటర్‌ హోల్డింగ్‌ స్ట్రక్చర్స్‌) మార్గం పట్టింది. ఓ రకంగా రోడ్డు కింద చిన్నపాటి చెరువులు నిర్మిస్తోంది. వాన నీరు వాటిలోకి చేరి రోడ్లపై ట్రాఫిక్‌ ఇబ్బంది తప్పడమే కాకుండా.. సంపుల నుంచి నీళ్లు భూమిలోకి ఇంకే ఏర్పాట్లతో భూగర్భ జలాలు పెరిగేలా చర్యలు చేపడుతోంది. తరచూ నీళ్లు నిలుస్తున్న ప్రాంతాలను గుర్తించిన అధికారులు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు.. భూగర్భ సంపుల నిర్మాణం చేపట్టారు. హైదరాబాద్‌ నగరంలో భారీగా వరద నిలిచే ప్రాంతాలు 144 ఉన్నాయి. అందులో 50చోట్ల సమస్య ఎక్కువగా ఉంది. సమీపంలో నాలాలు, డ్రెయిన్లు ఉన్నచోట నీటిని మళ్లించే చర్యలు చేపడుతున్నారు. నాలాలు, చెరువులు లేనిచోట భూగర్భంలోకి వరద చేరేలా సంపులు నిర్మిస్తున్నారు. మొదటి విడతగా 23 ప్రాంతాల్లో సంపుల నిర్మాణం చేపట్టాలని భావించారు. రూ.13.99 కోట్లతో 11 చోట్ల పనులు ప్రారంభించారు. 10 చోట్ల నిర్మాణం పూర్తికాగా.. మరోచోట తుది దశలో ఉన్నాయి. మిగతా 12 ప్రాంతాల్లో స్థలం అనువుగా లేకపోవడం, భూగర్భంలో తాగునీరు, డ్రైనేజీ పైపులైన్లు, కేబుళ్లు ఉండటంతో సంపుల నిర్మాణం సాధ్యం కాదని తేల్చారు. రోడ్లపై వరద నీరు నిలవకుండా భూగర్భ సంపుల నిర్మాణానికి అనువుగా ఉన్న ప్రాంతాలను గుర్తించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ తాజాగా ఆదేశాలు జారీ చేశారు.


ఒక్క దెబ్బకు రెండు పరిష్కారాలు..!

భూగర్భ సంపుల నిర్మాణం బహుళ ప్రయోజనకరంగా నిలుస్తోంది. రోడ్లపై నీరు సంపుల్లోకి వెళ్లిపోవడం వల్ల ట్రాఫిక్‌ సమస్య ఉండదు. మరోవైపు సంపుల్లో నిలిచేనీరు ఇంకిపోయి భూగర్భ జలాలు పెరిగేందుకు దోహదపడుతుంది. కనీసం 2.65 లక్షల లీటర్ల నుంచి 10.4 లక్షల లీటర్ల నీళ్లు పట్టేలా ఈ సంపులు నిర్మిస్తున్నారు. 15 నుంచి 20 అడుగుల లోతుతో అందుబాటులో ఉన్న స్థలాన్ని బట్టి విస్తీర్ణం ఉంటోంది. సంపులో రెండు నుంచి ఆరు వరకు ఇంజక్షన్‌ బోర్లు వేస్తున్నారు. 60 నుంచి 120 అడుగుల లోతు ఉండే ఈ ఇంజక్షన్‌ బోర్లతో నీరంతా భూగర్భంలోకి ఇంకిపోతుంది. ఈ సంపులకు నలువైపులా కాంక్రీట్‌ గోడలు, పైనా వాహనాల రాకపోకలకు అనుగుణంగా బలమైన శ్లాబ్‌ నిర్మిస్తున్నారు. నీరు సంపులోకి వెళ్లేందుకు వీలుగా శ్లాబ్‌ మధ్య ఇనుప గ్రిల్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. వీలైన చోట సంపుల నుంచి సమీపంలోని చెరువులు, నాలాల్లోకి నీరు చేరేలా భూగర్భం నుంచి ఔట్‌లెట్‌లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. సంపులో నీళ్లు నిర్ణీత స్థాయిలో నిండగానే అందులోని మోటార్లు ఆటోమేటిక్‌గా ఆన్‌ అయి నీటిని చెరువులు, నాలాల్లోకి పంప్‌ చేస్తాయి.

వాన పడినా హాయిగా ప్రయాణం..

వానపడినప్పుడల్లా సచివాలయం ఎదురుగా ఉన్న బస్టాప్‌ వద్ద నీరు నిలిచి ట్రాఫిక్‌ జామ్‌కు కారణమయ్యేది. భూగర్భ సంపు నిర్మించాక సమస్య చాలా వరకు తగ్గింది. సోమాజిగూడ కేసీపీ జంక్షన్‌ వద్ద, రాజ్‌భవన్‌ సమీపంలోని లేక్‌ వ్యూ గెస్ట్‌హౌజ్‌ వద్ద, పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే పిల్లర్‌ నంబర్‌ 264 ప్రాంతంలో రెండు, మూడు అడుగుల మేర వరద నిలిచి తీవ్ర ఇబ్బంది ఎదురయ్యేది. ఇప్పుడు సమస్య దాదాపుగా పరిష్కారమైందని స్థానికులు చెబుతున్నారు.

Updated Date - Aug 12 , 2025 | 04:56 AM