ACB Arrests: ఏసీబీకి చిక్కిన డీటీవో
ABN , Publish Date - Aug 07 , 2025 | 05:12 AM
ఒకే రోజు ఏసీబీ వలకు ఇద్దరు అధికారులు చిక్కారు. ఈ నెలాఖరున పదవీ విరమణ చేయబోతున్న జగిత్యాల జిల్లా రవాణాశాఖ అధికారి (డీటీవో) భద్రునాయక్ బుధవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
రూ.22 వేలు లంచం తీసుకుంటుండగా జగిత్యాల డీటీవో పట్టివేత
మరో మూడు వారాల్లో పదవీ విరమణ
రూ.3వేలు తీసుకుంటూ పట్టుబడిన మహబూబ్‌నగర్ జిల్లా ఏఈఈ
హైదరాబాద్, జగిత్యాలరూరల్, మహబూబ్‌నగర్, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): ఒకే రోజు ఏసీబీ వలకు ఇద్దరు అధికారులు చిక్కారు. ఈ నెలాఖరున పదవీ విరమణ చేయబోతున్న జగిత్యాల జిల్లా రవాణాశాఖ అధికారి (డీటీవో) భద్రునాయక్ బుధవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈనెల 4న కోరుట్ల శివారులో ఓ ఎక్స్‌కవేటర్‌ను కాలుష్య, బీమా పత్రాలు లేకపోవడంతో రవాణాశాఖాధికారులు పట్టుకున్నారు. దాన్ని సీజ్ చేయకుండా ఉండేందుకు రూ.35 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఆ మొత్తం డీటీవోకు ఇచ్చేందుకు యజమాని ఒప్పుకున్నాడు. అదే రోజు రూ.13 వేలు ఆయనకు ఇవ్వడంతో వాహనాన్ని వదిలిపెట్టారు. మిగతా రూ.22 వేలు ఇచ్చి ఫోన్లు తీసుకెళ్లాలని వాహన యజమానికి డీటీవో చెప్పారు. మిగతా డబ్బుల కోసం వాహన యజమానిని వేధించడంతో ఆయన ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనలతో బాధితుడు జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లిలోని రవాణాశాఖ కార్యాలయంలో డీటీవో వ్యక్తిగత డ్రైవర్ అరవింద్ ద్వారా రూ.22 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కాగా, మహబూబ్‌నగర్‌లోని ఇరిగేషన్ సబ్ డివిజన్ కార్యాలయంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ)గా పనిచేస్తున్న మహ్మద్ ఫయాజ్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. నగరానికి చెందిన ఓ వ్యక్తికి చెందిన 150గజాల స్థలానికి ఎన్‌వోసీ ఇచ్చేం దుకు నివేదిక కోసం ఫయాజ్ బుధవారం రూ.3 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు అరెస్టు చేశారు.
మళ్లీ చిక్కిన భద్రునాయక్..
భద్రునాయక్ ఇంతకు ముందూ ఏసీబీకి పట్టుబడ్డారు. 2008లో హైదరాబాద్ ఏసీబీ సీఐయూ విభాగంలోనూ ఆయనపై కేసు నమోదైంది. సొంత అన్నను సుపారీ గ్యాంగ్ తో హత్య చేయించేందుకు కుట్ర చేసిన కేసులోనూ ఆయన కీలక నిందితుడు. హత్యకు కుట్ర విషయం చెబుతాడనే ఉద్దేశంతో ఓ వ్యక్తిని హత్య చేయించిన కేసులోనూ భద్రు నాయక్‌ను పోలీసులు నిందితుడిగా చేర్చారు. సోదరుడి హత్యకు కుట్ర, హత్య కేసు 2022 లో నమోదుకాగా.. 2008లో నమోదైన ట్రాప్ కేసు ప్రస్తుతం ఏసీబీ ప్రత్యేక కోర్టులో విచారణలో ఉంది. తాజాగా మళ్లీ ఆయన ఏసీబీకి చిక్కారు. భద్రునాయక్ పెద్ద మొత్తం లో ఆస్తులు కూడబెట్టాడు. సోదరుడు వీరు నాయక్‌తో కలిసి వ్యాపారాలు చేశారు. నాలుగు గ్రానైట్ క్వారీలు, 120 ఎకరాల భూమి కొన్నా రు. 70 ఎకరాలు భద్రునాయక్ పేరుతో ఉండగా మిగతాది సోదరుడి పేరుతో ఉంది. నాలుగు క్వారీ లు భద్రునాయక్ పేరుతోనే నిర్వహించారు. హైదరాబాద్‌లో 3 ఇళ్లు, 7 వరకు ప్లాట్లు ఉన్నట్లు వీరు నాయక్ హత్యకు కుట్ర కేసు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. కలిసి వ్యాపారం చేయడంతో ఆస్తుల్లో సగం కావాలని డిమాండ్ చేయడంతో సుపారీ గ్యాంగ్‌తో వీరు నాయక్‌కు హత్యకు కుట్ర చేసినట్లు భద్రునాయక్‌పై కేసు నమోదైంది. భద్రు నాయక్ ఆస్తులను గుర్తించడంలో ఏసీబీ నిమగ్నమైంది. ఆయన నివాసం, కార్యాలయంతోపాటు ఇతర ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.