LB Nagar: హైటెన్షన్ విద్యుత్తు తీగ తెగిపడి.. ఇద్దరి సజీవ దహనం
ABN , Publish Date - Jun 16 , 2025 | 05:07 AM
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి ఘోరం జరిగింది.
హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్‌లో ఘటన
మృతులు ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న యాచకులుగా గుర్తింపు?
కొత్తపేట, జూన్ 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి ఘోరం జరిగింది. తలదాచుకునేందుకు ఇంత చోటు లేక రహదారి పక్కన ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఇద్దరిని హైటెన్షన్ విద్యుత్తు తీగ రూపంలో మృత్యువు కబళించింది. 11కేవీ విద్యుత్తు తీగ తెగి మీదపడడంతో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు(పురుషుడు, మహిళ) సజీవ దహనమయ్యారు. మృతులు యాచకులు అని భావిస్తున్నారు. ఈ ఘటనలో ఓ శునకం కూడా విద్యుదాఘాతానికి గురై చనిపోయింది. పోలీసులు, విద్యుత్ శాఖ డీఈ రాజేంద్ర నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్‌బీ నగర్ సాగర్ రింగ్ రోడ్డులోని ఓ విద్యుత్ స్తంభాన్ని శనివారం అర్ధరాత్రి గంటల మధ్య గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లింది. దీంతో ఆ స్తంభంపై ఉన్న 11కేవీ విద్యుత్ తీగ తెగి.. సమీపంలోని రేణుకా ఎల్లమ్మ గుడి ఎదుట ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఇద్దరు వ్యక్తులు, వీధి శునకంపై పడింది.
తీగ మీద పడడంతో మంటలు అంటుకుని ఆ యాచకులు దహనమయ్యారు. అదే తీగ గొంతుకు చుట్టుకోవడంతో శునకం కూడా మృత్యువాత పడింది. స్థానికుల సమాచారంతో పోలీసులు, విద్యుత్ శాఖ సిబ్బంది... విద్యుత్ సరఫరాను నిలిపివేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుల గుర్తింపు వివరాలు తెలియాల్సి ఉంది. విద్యుత్ శాఖ అధికారులు ప్రమాదం ఎలా జరిగింది ? అనే దానిపై పరిశీలన చేస్తున్నారు. 11కేవీ విద్యుత్ తీగ పాలిమర్ పిన్ ఇన్సులేటర్‌లోని రాడ్ ఊడిపోవడంతో తీగ తెగిపడి ఉంటుందని భావిస్తున్నారు. కాగా, ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆదివారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్టుగా ఉందని అభిప్రాయపడ్డారు.