Hyderabad: గ్యాస్ స్టవ్ పరికరాల్లో హెరాయిన్.. బైక్ ట్యాక్సీల ద్వారా డోర్ డెలివరీ
ABN , Publish Date - Jan 18 , 2025 | 05:19 AM
గ్యాస్‌స్టవ్ పరికరాల్లో హెరాయిన్ దాచిపెట్టి బైక్ ట్యాక్సీల ద్వారా వినియోగదారులకు డ్రగ్స్ డోర్ డెలివరీ చేస్తున్న ముఠాకు చెందిన ఇద్దరిని ఎల్‌బీనగర్ ఎస్‌ఓటీ, నేరేడ్‌మెట్ పోలీసులు అరెస్టు చేశారు.

హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు
190 గ్రాముల హెరాయిన్ స్వాధీనం, ఇద్దరి అరెస్టు
హైదరాబాద్ సిటీ/నేరేడ్‌మెట్, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): గ్యాస్‌స్టవ్ పరికరాల్లో హెరాయిన్ దాచిపెట్టి బైక్ ట్యాక్సీల ద్వారా వినియోగదారులకు డ్రగ్స్ డోర్ డెలివరీ చేస్తున్న ముఠాకు చెందిన ఇద్దరిని ఎల్‌బీనగర్ ఎస్‌ఓటీ, నేరేడ్‌మెట్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.23లక్షల విలువైన 190 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను రాచకొండ సీపీ సుధీర్‌బాబు, ఎస్‌ఓటీ డీసీపీ మురళీధర్ శుక్రవారం విలేకరులకు వెల్లడించారు. రాజస్థాన్ జోధ్‌పూర్‌కు చెందిన మహేష్ సరెమ్ (28), మహిపాల్ (19) నేరేడ్‌మెట్‌లో వేర్వేరుగా నివాసముంటున్నారు. గ్యాస్ స్టవ్‌ల మరమ్మతు పనులు చేస్తూ ఉపాధి పొందే వీరు డ్రగ్స్ వ్యాపారంలోకి దిగారు.
ఇందులో భాగంగా రాజస్థాన్‌లోని లౌహాటీ గ్రామానికి చెందిన షంషుద్దీన్‌కు వద్ద మహేష్ రూ.లక్షతో 200 గ్రాముల హెరాయిన్ కొని రైలు మార్గంలో హైదరాబాద్ తెచ్చి మహిపాల్ ఇంట్లో ఉంచాడు. వీరిద్దరూ కలిసి నగరంలోని వినియోగదారులకు హెరాయిన్ సరఫరా చేసేవారు. అయితే, వినియోగదారులను నేరుగా కలవకుండా మరికొందరితో పని చేసేవారు. వీరంతా కలిసి గ్యాస్‌స్టవ్ పరికాల మధ్య హెరాయిన్‌ను పెట్టి.. ర్యాపిడో, ఓలా, ఉబెర్ యాప్‌ల్లో బైక్‌లు బుక్ చేసి వాటిని వినియోగదారులకు పంపేవారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు మహేష్, మహిపాల్‌ను అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.