Share News

Tummla: విమర్శలు కాదు.. ఎరువులు తెప్పించండి

ABN , Publish Date - Feb 24 , 2025 | 04:52 AM

రాష్ట్రంలో ఎరువుల లభ్యతపై విమర్శలు చేయకుండా కేంద్రం నుంచి ఎరువులను తెప్పించాలని రాష్ట్ర బీజేపీ నేతలకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.

Tummla: విమర్శలు కాదు.. ఎరువులు తెప్పించండి

  • రాష్ట్ర బీజేపీ నేతలకు మంత్రి తుమ్మల సూచన

హైదరాబాద్‌, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎరువుల లభ్యతపై విమర్శలు చేయకుండా కేంద్రం నుంచి ఎరువులను తెప్పించాలని రాష్ట్ర బీజేపీ నేతలకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రాష్ట్రంలో రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని బీజేపీ పెద్దలు ఎరువుల సరఫరా విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు మద్దతిస్తే మంచిదన్నారు. ఇప్పటికే ఎరువుల సరఫరాకు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు ఢిల్లీకి వెళ్లి కేంద్రాన్ని కోరినట్టు తెలిపారు. ఆదివారం వ్యవసాయ అధికారులతో మంత్రి టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.


ఈ సందర్భంగా రాష్ట్రంలో యూరియా కొరత లేదని, రైతులు ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరంలేదన్నారు. ఈ వారంలో మరో 81,800 మెట్రిక్‌ టన్నుల యూరియా రాష్ట్రానికి రానుందని తెలిపారు. గత యాసంగికంటే ఈసారి 2.59 లక్షల మెట్రిక్‌ టన్నులు అదనంగా కొనుగోలు చేసినట్టు వెల్లడించారు. కేంద్రం నుంచి 8.54 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా రావాల్సి ఉండగా.. ఇప్పటివరకు రాష్ట్రానికి 6.81 లక్షల మెట్రిక్‌ టన్నులే వచ్చిందన్నారు. ఎరువుల విషయంలో కేంద్రంతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నామని, ఎరువులు పంపాలంటూ కేంద్రానికి తాను లేఖలు కూడా రాస్తున్నట్టు చెప్పారు.

Updated Date - Feb 24 , 2025 | 04:52 AM