Tummala Nageswara Rao: క్యాబినెట్ ఆమోదం లేదు
ABN , Publish Date - Jun 08 , 2025 | 04:49 AM
అసలు కాళేశ్వరం ప్రాజెక్టు విషయం అప్పటి క్యాబినెట్ ముందుకు రానేలేదని, కేవలం నిర్వహణ అనుమతులతోనే ఆ ప్రాజెక్టు మొదలైందని చెప్పారు.
కాళేశ్వరం విషయం క్యాబినెట్ ముందుకు రానేలేదు
మూడేళ్ల తర్వాత అంచనాల మార్పు ఫైలు వచ్చింది
ఈ విషయాన్ని నిరూపించేందుకు నేను సిద్ధం
విచారణ కమిషన్ ముందు ఈటల రాజేందర్..
లేని విషయాలను ఎందుకు చెప్పారో స్పష్టతనివ్వాలి
అసత్యాలు మాట్లాడితే.. అబద్ధాల హరీశ్ అవుతారు
అన్ని వివరాలు విచారణ కమిషన్‌కు ఇస్త్తా: తుమ్మల
హైదరాబాద్, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు క్యాబినెట్ ఆమోదం లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు విషయం అప్పటి క్యాబినెట్ ముందుకు రానేలేదని, కేవలం నిర్వహణ అనుమతులతోనే ఆ ప్రాజెక్టు మొదలైందని చెప్పారు. అయితే ప్రాజెక్టు ప్రారంభమైన మూడేళ్ల తరువాత.. నిర్మాణ వ్యయం, అంచనాల మార్పునకు సంబంధించిన ఫైలు మాత్రమే క్యాబినెట్‌కు వచ్చిందని తెలిపారు. అంతేకాకుండా బీఆర్‌ఎస్ హయాంలో ప్రాణహిత, దేవాదుల, కంతానపల్లి, వరద కాలువ ప్రాజెక్టుల నిర్మాణం, ఇతర అంశాల కోసం ఏర్పాటుచేసిన క్యాబినెట్ సబ్‌కమిటీకి, కాళేశ్వరానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. కాళేశ్వరం నిర్మాణం, అనుమతులు, వ్యయ అంచనాల మార్పులతోపాటు, నాలుగు ప్రాజెక్టుల కోసం ఏర్పాటుచేసిన సబ్‌కమిటీకి సంబంధించిన వివరాలన్నీ తెలుపుతూ కాళేశ్వరం విచారణ కమిషన్‌కు తాను సుమోటోగా లేఖ రాస్తానన్నారు. అంతేకాకుండా.. కాళేశ్వరం నిర్మాణ సమయంలో చోటుచేసుకున్న మరికొన్ని పరిణామాలు, అప్పటి ఫైనాన్స్ సెక్రటరీ రాసిన విషయాలు, ప్రాజెక్టు తొలిదశలోనే నేషనల్ డ్యామ్ సేప్టీ అథారిటీ చెప్పిన వివరాలన్నింటినీ కమిషన్‌కు అందజేస్తానని తెలిపారు. ఎంపీ ఈటల రాజేందర్.. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరై ఇచ్చిన వాంగ్మూలంలో, బయటకు వచ్చిన తరువాత చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదన్నారు. మరోవైపు కాళేశ్వరం, సబ్‌కమిటీ ఏర్పాటు విషయంలో మాజీ మంత్రి హరీశ్‌రావు ఇంకా అసత్యాలు మాట్లాడితే.. ఆయన అబద్ధాల హరీశ్ అవుతారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు మంత్రి తుమ్మల శనివారం సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఈటల అలా ఎందుకు మాట్లాడారో?
కాళేశ్వరం కమిషన్ ఎదుట ఈటల రాజేందర్ ఇచ్చిన వాంగ్మూలం అసత్యాలతో కూడి ఉందని మంత్రి తుమ్మల అన్నారు. అయితే ఆయన అనాలోచితంగా ఆ ప్రకటన చేశారా? లేక అలా మాట్లాడాల్సిన పరిస్థితులేవైనా ఆయనకు దాపురించాయోనన్న అనుమానం ఉందన్నారు. కమిషన్ అడిగిన ప్రశ్నలకు ఈటల పొంతనలేని సమాధానాలు ఇచ్చారని, అవన్నీ వాస్తవాలకు దూరంగా ఉన్నాయని చెప్పారు. ఈటల ప్రస్తావించిన మంత్రివర్గ ఉపసంఘం.. కాళేశ్వరం నిర్మాణం కోసం ఏర్పాటుచేసింది కాదని, మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం కోసం ఉత్తర్వులు ఇచ్చిన 15 రోజుల తరువాత ఉపసంఘం ఏర్పాటైందని తెలిపారు. రాష్ట్రంలో అప్పటికే ఉన్న ప్రాణహిత, దేవాదుల, కంతానపల్లి, వరద కాలువ పనులు కొనసాగించాలంటే.. అప్పటికే ఉన్న అంచనా ధరలు, అవే ధరలకు కాంట్రాక్టర్లు పనిచేస్తారా, వాళ్లు చేయబోమంటే ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవాలనే దానికోసమే సబ్ కమిటీని ఏర్పాటు చేశారని వివరించారు. అందులో కాళేశ్వరం ప్రస్తావనే లేదన్నారు. ఆ సబ్‌కమిటీ రెండు మూడుసార్లు సమావేశమై.. అధికారులతో చర్చించి నివేదికలను ప్యాకేజీల వారీగా అప్పటి ప్రభుత్వానికి, క్యాబినెట్‌కు సమర్పించిందని చెప్పారు. ఆ నివేదికల్లోనూ కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణాలు సహా ఏ రకమైన సూచనలూ చేయలేదన్నారు. కాళేశ్వరం నిర్మాణానికి సబ్‌కమిటీ అనుమతులు ఇచ్చిందని ఈటల ఎందుకు అన్నారో ఆయనే ఆలోచించుకోవాలని సూచించారు. మరోవైపు కాళేశ్వరాన్ని క్యాబినెట్ ఆమోదించిందనడం కూడా అవాస్తవమని పేర్కొన్నారు. అయితే ఆ సబ్‌కమిటీలో, నాటి క్యాబినెట్‌లోనూ తాను ఉన్నందున.. తనను కూడా బాధ్యుడిని చేయాలనే ఉద్దేశంతోనే ఈటల చెప్పి ఉంటారని భావిస్తూ స్పష్టతనిస్తున్నట్లు తెలిపారు. విచారణ కమిషన్ కాళేశ్వరంపై ప్రశ్నిస్తే.. ఈటల మాత్రం నాలుగు ప్రాజెక్టుల కోసం ఏర్పాటైన సబ్‌కమిటీ గురించి ప్రస్తావించడమేంటని నిలదీశారు. క్యాబినెట్‌లో లేని విషయాన్ని ఉన్నట్లు ఎందుకు చెప్పారో ఈటల స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు.
కమిషన్‌కు అన్ని వివరాలు సమర్పిస్తా..
43 ఏళ్లగా.. నిజాయితీ, నిబద్ధతతో రాజకీయాలు చేస్తున్నానని తుమ్మల అన్నారు. తన రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడూ తెలిసి తప్పుచేయలేదన్నారు. వాస్తవానికి తానేంటో, తన వ్యక్తిత్వమేంటో ఈటల రాజేందర్‌కు తెలుసునని, అయినా ఆయన చేసిన ప్రకటన చూసి బాధ కలిగిందని పేర్కొన్నారు. అదే సమయంలో అనుమానం కూడా కలిగిందన్నారు. ఈ సందర్భంగా.. క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుచేసిన ఉత్తర్వులు, మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం కోసం ఇచ్చిన జీవోలు కూడా ఉన్నాయంటూ చూపించారు. నాలుగు ప్రాజెక్టులపై సబ్‌కమిటీ ఇచ్చిన నివేదికలు కూడా ఉన్నాయని, సమయం వచ్చినప్పుడు వాటిని బహిర్గతం చేస్తానని అన్నారు. అప్పట్లో ఫైనాన్స్ సెక్రటరీ రాసిన విషయాలన్నింటినీ తేదీలతో సహా ఉత్తర్వులను కూడా బయటపెడతానని చెప్పారు. ఈ విషయంలో ఎవరితోనైనా చర్చించడానికి సిద్ధమని ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారాలన్నీ గత ప్రభుత్వ హయాంలోనే జరిగాయని స్పష్టం చేశారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టే నిరుపయోగమని నేషనల్ డ్యామ్ సేప్టీ అథారిటీ అప్పుడే చెప్పిందని తుమ్మల తెలిపారు. ప్రస్తుత కమిషన్ విచారణలో వాస్తవాలను తేల్చిన తరువాత చర్యలుంటాయన్నారు. మరోవైపు సమ్మక్క-సారక్క, తుపాకులగూడెం ప్రాజెక్టులపైనా వివరాలు ఇవ్వాలని కోరడంతో నివేదికలు ఇచ్చామని పేర్కొన్నారు. కానీ, అప్పుడు జరిగిన నిర్ణయాలు, ఇచ్చిన నివేదికలకు విరుద్ధంగా బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. గత ప్రభుత్వాల్లోనూ తాను ఉన్నానని, ఎల్లప్పుడూ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజలకు ఉపయోగపడే విధంగానే పనిచేశానని అన్నారు.
అబద్ధాల హరీశ్ అవుతారు..
కాళేశ్వరం విషయం క్యాబినెట్‌లో ఉందని, తుమ్మలకు కూడా ఈ విషయం తెలుసునని హరీశ్‌రావు అనడంపై విలేకరులు ప్రశ్నించగా, ‘ఇంకా అసత్యాలు మాట్లాడితే.. ఆయన అబద్ధాల హరీశ్ అవుతారు’ అని తుమ్మల వ్యాఖ్యానించారు. క్యాబినెట్‌కు వచ్చినట్టు ఏదైనా సాక్ష్యం ఉంటే చూపించాలని, రాలేదని చూపించేందుకు తాను సిద్ధమని అన్నారు. అయితే కాళేశ్వరం ప్రారంభమైన మూడేళ్ల తరువాత రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఫైలు మాత్రం క్యాబినెట్‌కు వచ్చిందన్నారు. ఆ సమయంలో అంతర్గతంగా కూడా కొంత ఇబ్బందులు పడ్డామని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
చిప్స్ ప్యాకెట్ చోరీ చేసినందుకు తిట్లు.. బాలుడి ఆత్మహత్య
భార్యకు నిప్పు పెట్టిన భర్త.. కోరిక తీర్చ లేదని..