Share News

Kaleshwaram Project: మేడిగడ్డ.. మంత్రివర్గ నిర్ణయమే

ABN , Publish Date - Jun 08 , 2025 | 04:53 AM

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, నిధులు, ప్రస్తుత స్థితి, ప్రయోజనాలపై ఆయన పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం- వాస్తవాలు’ పేరిట వివరణాత్మక గణాంకాలతో కాంగ్రెస్‌ ఆరోపణలను తిప్పికొట్టారు.

Kaleshwaram Project: మేడిగడ్డ.. మంత్రివర్గ నిర్ణయమే

వ్యాప్కోస్‌ నివేదిక, లైడార్‌ సర్వేలతోనే ఆ ప్రాంతం ఎంపిక.. ఉప సంఘంలో సభ్యులుగా ఈటల, తుమ్మల

ప్రాజెక్టు ద్వారా 20.33 లక్షల ఎకరాలకు నీరు.. 17లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ.. కాంగ్రెస్‌ది దుష్ప్రచారం

2 పిల్లర్లు కుంగితే ప్రాజెక్టే కూలినట్టుగా చిత్రీకరణ.. బీజేపీకి జేబు సంస్థగా నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ

మేడిగడ్డ కుంగుబాటుపై నా వద్ద కీలక డాక్యుమెంట్‌.. కాళేశ్వరంపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌లో హరీశ్‌

హైదరాబాద్‌, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ వద్ద బ్యారేజీ కట్టాలన్నది అప్పటి మంత్రివర్గం తీసుకున్న నిర్ణయమని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పష్టం చేశారు. వ్యాప్కోస్‌ (డబ్ల్యూఏపీసీవోఎస్‌) నివేదికలు, లైడార్‌ (ఎల్‌ఐడీఏఆర్‌) సర్వేలు, రిటైర్డ్‌ ఇంజినీర్లు, రాష్ట్ర ఇంజినీర్ల సలహాలు, సూచనల ఆధారంగానే బ్యారేజీ నిర్మాణానికి మేడిగడ్డను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, నిధులు, ప్రస్తుత స్థితి, ప్రయోజనాలపై ఆయన పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం- వాస్తవాలు’ పేరిట వివరణాత్మక గణాంకాలతో కాంగ్రెస్‌ ఆరోపణలను తిప్పికొట్టారు. కేంద్ర జలవనరుల సంస్థ సూచనలకు అనుగుణంగా కీలక బ్యారేజీని ఎక్కడ నిర్మిస్తే.. అనువుగా ఉంటుందో చెప్పాలని వ్యాప్కో్‌సను కోరుతూ అప్పటి ప్రభుత్వం జీవో జారీ చేసినట్లు తెలిపారు. వాళ్లు సర్వే చేసి మేడిగడ్డ వద్ద కడితే బాగుంటుందని నివేదిక ఇచ్చారని, ఆ నివేదికను స్టడీ చేసేందుకు క్యాబినెట్‌ సబ్‌ కమిటీ, రిటైర్డ్‌ ఇంజినీర్లతో మరో కమిటీని కేసీఆర్‌ వేసినట్లు గుర్తుచేశారు. అందులో అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న తాను చైర్మన్‌గా, మరో మంత్రి ఈటల రాజేందర్‌తోపాటు గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా అనుభవం ఉన్న తుమ్మల సభ్యులుగా ఉన్నట్లు తెలిపారు. ముగ్గురం కలిసి నీటిపారుదల శాఖ ఇంజనీర్లతో చర్చలు జరిపామని పేర్కొన్నారు. మేడిగడ్డ వద్ద కాళేశ్వరం కట్టాలని క్యాబినెట్‌కు సబ్‌ కమిటీతోపాటు రిటైర్డ్‌ ఇంజినీర్ల కమిటీ నివేదికలు ఇచ్చాయని తెలిపారు. తుమ్మల కూడా సంతకం పెట్టి రికమండ్‌ చేశారని గుర్తు చేశారు. 2007 నుంచి 2014వరకు కేంద్రం, మహారాష్ట్ర, ఏపీలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలే ఉన్నా.. తుమ్మడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతి సాధించలేకపోయారని పేర్కొన్నారు. ఆ ప్రాజెక్టుపై పునరాలోచన చేయాలని సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ సూచనతోపాటు నీటి లభ్యత లేదన్న నివేదికలతోనే ప్రాణహిత- చేవెళ్లను రీడిజైన్‌ చేయాల్సి వచ్చిందని చెప్పారు.


అభాండాలు వేయడం సరికాదు

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మొత్తం 20,33,578 ఎకరాలకు సాగునీరు అందిందని, ఇది స్వయంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలోనే ఉందని హరీశ్‌ గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా 141 టీఎంసీల నీటిని నిల్వ చేసేలా 16 రిజర్వాయర్లను నిర్మించామని, ఇందులో ఒక్క మల్లన్న సాగర్‌లోనే 50 టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశం ఉందని తెలిపారు. ఎస్సారెస్పీకి నీళ్లు రాని సమయంలో మేడిగడ్డ ద్వారా నీటిని ఎతి ్తపోశామని, వర్షాలు బాగా కురిసినప్పుడు ఎస్సారెస్సీ నుంచి మిడ్‌మానేరుకు నీళ్లు తెచ్చుకున్నామని చెప్పారు. మిడ్‌మానేరు నుంచి అన్నపూర్ణ, రంగనాయకసాగర్‌, మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ సాగర్‌ వరకు నీటిని ఎత్తిపోశామని తెలిపారు. ఎస్సారెస్పీ స్టేజ్‌-2లో తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ వరకు నీళ్లందించామన్నారు. కాళేశ్వరం నీటితో నేరుగా 98,570 ఎకరాల కొత్త ఆయకట్టుకు, ప్రాజెక్టు కాల్వల ద్వారా నింపిన 456 మైనర్‌ ఇరిగేషన్‌ ట్యాంకుల ద్వారా 39,146 ఎకరాలకు, అలాగే ఎస్సారెస్పీ స్టేజ్‌-1, స్టేజ్‌-2, నిజాంసాగర్‌ నీటితో నింపిన 2,143 మైనర్‌ ఇరిగేషన్‌ ట్యాంకుల ద్వారా 1.67లక్షల ఎకరాలకు నీరు అందిందని వివరించారు. ఎస్సారెస్పీ స్టేజ్‌ 1, స్టేజ్‌ 2, నిజాంసాగర్‌ ప్రాజెక్టుల పరిధిలోని 17.8లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించామన్నారు. అలాంటి ప్రాజెక్టుపై అభాండాలు వేయడం సరికాదని అన్నారు.


తట్టెడు మట్టి తీయకుండా 1052కోట్లు స్వాహా

దేశంలో ఏ ప్రాజెక్టు కూడా ప్రతిపాదిత వ్యయంతో పూర్తి కాలేదని, కానీ.. దేశంలోనే అతి తక్కువ కాస్ట్‌ ఎస్కలేషన్‌తో పూర్తి చేసిన ఏకైక ప్రాజెక్టు కాళేశ్వరమేనని హరీశ్‌రావు అన్నారు. తుమ్మిడిహెట్టిని రూ.17,875 కోట్లతో నిర్మిస్తామంటూ 2007లో జీవో ఇచ్చి, ఏ పని చేయకుండానే అంచనా వ్యయాన్ని రూ.38,500 కోట్లకు పెంచిన కాంగ్రెస్‌ నాయకులు.. కాళేశ్వరం ఖర్చు పెరిగిందంటూ తమపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రాణహిత చేవెళ్ల కోసం రూ.10వేల కోట్లు ఖర్చు చేశామని, ఇంకో 20వేల కోట్లు పెడితే పూర్తయ్యేదన్న ఉత్తమ్‌ మాటలను ప్రస్తావిస్తూ.. తాము లెక్కలు తీస్తే రూ.3700 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు తేలిందని చెప్పారు. ‘తుమ్మిడిహెట్టిలో తట్టెడు మట్టి ఎత్తకుండానే మొబిలైజేషన్‌ అడ్వాన్సుల పేరిట రూ.1052కోట్లను చెల్లించారని స్వయంగా కాగ్‌ తన రిపోర్ట్‌లో వెల్లడించింది. ఆ డబ్బును కాంగ్రెస్‌ నాయకులే జేబుల్లో నింపుకొన్నారు. ఆనాడు టీడీపీ నేతగా ఉన్న రేవంత్‌రెడ్డి.. ఇది జలయజ్ఞం కాదు.. ధన యజ్ఞం అంటూ విమర్శించారు. కానీ.. అదే రేవంత్‌రెడ్డి ఈ రోజు కాంగ్రెస్‌ అవినీతిని వెనుకేసుకొస్తున్నారు’ అని విమర్శించారు. 9న కమిషన్‌ ముందు హాజరై ప్రాజెక్టుకు సంబంధించిన వాస్తవాలను చెప్తామని తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు సంబంధించి తన వద్ద మరో కీలక డాక్యుమెంట్‌ ఉందన్నారు. నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ కూడా బీజేపీకి జేబు సంస్థగా వ్యవహరిస్తోందని, ఈడీ, సీబీఐలా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పని చేస్తోందని ఆరోపించారు. మేడిగడ్డలో పిల్లర్‌ కుంగితే రెండు రోజుల్లో వచ్చి.. మూడు రోజుల్లోనే ఎన్డీఎ్‌సఏ నివేదిక ఎలా ఇచ్చిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఉత్తమ్‌.. అబద్ధాల ప్రవాహాన్ని ఆపండి

అబద్ధాల ప్రవాహాన్ని ఇకనైనా ఆపాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి హరీశ్‌ సూచించారు. కాంగ్రెస్‌ దుష్ప్రచారాన్ని ఆధారాలతో బయటపెట్టినా.. మళ్లీ అవే అబద్ధాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. ఐదేళ్లలో మేడిగడ్డ నుంచి 162టీఎంసీలే ఎత్తిపోశామని చెబుతున్న ఉత్తమ్‌కు.. లక్ష్మి, సరస్వతి, పార్వతి, నంది, గాయత్రి పంప్‌హౌ్‌సల నుంచి ఎత్తి పోసిన నీరు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.


ఇవి కూడా చదవండి:

చిప్స్ ప్యాకెట్ చోరీ చేసినందుకు తిట్లు.. బాలుడి ఆత్మహత్య

భార్యకు నిప్పు పెట్టిన భర్త.. కోరిక తీర్చ లేదని..

Read Latest and Crime News

Updated Date - Jun 08 , 2025 | 04:53 AM