Tummala: యూరియా కొరత సృష్టిస్తే డీలర్లపై కేసులు
ABN , Publish Date - Jul 10 , 2025 | 03:34 AM
కేంద్రం కేటాయించిన ఎరువులను సకాలంలో తెప్పించేందుకు నిరంతరం అధికారులతో సంప్రదింపులు జరపాలని, జిల్లాల వారీగా ప్రణాళికలు ఏర్పాటు చేసుకొని రైతులకు సకాలంలో యూరియా
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
హైదరాబాద్, జూలై 9 (ఆంధ్రజ్యోతి): కేంద్రం కేటాయించిన ఎరువులను సకాలంలో తెప్పించేందుకు నిరంతరం అధికారులతో సంప్రదింపులు జరపాలని, జిల్లాల వారీగా ప్రణాళికలు ఏర్పాటు చేసుకొని రైతులకు సకాలంలో యూరియా అందేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. యూరియా కొరత సృష్టించినా, అధిక ధరలకు అమ్మినా, ఇతర ఉత్పత్తులను లింకు పెట్టినా కఠిన చర్యలు తీసుకోవాలనీ ఆదేశాలు జారీ చేశారు. కేంద్రం ప్రకటించిన విధంగా ఎరువుల సరఫరాలు జరుగుతాయని ఆశించిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా జిల్లాల వారీ ప్రణాళిక చేసుకుందని మంత్రి తెలిపారు.
దిగుమతి యూరియాలో తెలంగాణకు కేటాయించిన మేరకు సరఫరా జరగకపోవడంతో దేశీయంగా ఉత్పత్తయ్యే యూరియాను కేటాయించాలని కోరినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న రామగుండం ఎరువుల కంపెనీ నుంచి కేటాయింపులను 30 వేల టన్నుల నుంచి 60 వేల టన్నులకు పెంచాలని విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. జూలై వరకు కేటాయించిన 6.60 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి వచ్చేవరకు నిత్యం కేంద్ర మంత్రిత్వశాఖ ప్రతినిధులతో సమన్వయం చేసుకోవల్సిందిగా అధికారులను ఆదేశించారు. రానున్న రోజుల్లో కేంద్రం నుంచి ఎరువుల సరఫరాలు మెరుగవుతాయని ఆశిస్తున్నామని, రైతులు ఈ విషయంలో ఆందోళన చెందకుండా, వారి అవరసరాల మేరకే కొనుగోలు చేయాల్సిందిగా మంత్రి తుమ్మల విజప్తి చేశారు.