TTD: ఏపీ సీఎం ఔనన్నా.. టీటీడీ కరుణించట్లే..!
ABN , Publish Date - Mar 04 , 2025 | 04:06 AM
దీంతో తెలంగాణ నేతలు గుర్రుమంటున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి సాధారణ భక్తులతోపాటు నిత్యం వీఐపీల తాకిడి కూడా అధికమే. దీంతో బ్రేక్ దర్శనాలకు ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోంది.
తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇచ్చే సిఫారసు లేఖలపై తిరుమల అధికారుల మల్లగుల్లాలు
ఇప్పటికే రోజుకు 7500 బ్రేక్ దర్శనాల తాకిడి
ప్రస్తుతం ఈ దర్శనాలకే మధ్యాహ్నం దాటుతోంది
తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలతో మరింత ఒత్తిడి
ఎలా సర్దుబాటు చేయాలో తోచక సతమతం
(తిరుమల-ఆంధ్రజ్యోతి)
తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలపై బ్రేక్ దర్శన టికెట్లు ఇవ్వాలని ఏపీ సీఎం ఆదేశించినా.. ఇప్పటికే బ్రేక్ దర్శనాల తాకిడి ఎక్కువ కావడంతో టీటీడీ కేటాయించలేకపోతోంది! దీంతో తెలంగాణ నేతలు గుర్రుమంటున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి సాధారణ భక్తులతోపాటు నిత్యం వీఐపీల తాకిడి కూడా అధికమే. దీంతో బ్రేక్ దర్శనాలకు ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోంది. ఇప్పటికే రోజురోజుకూ పెరిగిపోతున్న బ్రేక్ టికెట్ల సంఖ్యను ఎలా తగ్గించాలనే ఆలోచనలో తలమునకలై ఉన్న టీటీడీ.. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై కూడా వీఐపీ బ్రేక్, రూ.300 దర్శన టికెట్లు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలపడంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ప్రస్తుతం నిత్యం 60 వేల నుంచి 70 వేల మంది శ్రీవారిని దర్శించుకుంటున్న విషయం తెలిసిందే. వారాంతాలు, విశేష పర్వదినాల్లో ఆ సంఖ్య లక్ష దాకా చేరుతోంది. ప్రస్తుతం ఏపీ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎంఎల్సీలు ఇలా కేవలం ప్రజాప్రతినిధుల ద్వారానే 1,800 నుంచి 2 వేల వరకు టికెట్లు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. పోలీసు, ప్రెస్, న్యాయవ్యవస్థ, ఐఏఎస్, టీటీడీ ఉద్యోగులు, కేంద్రమంత్రులు, సీఎంవో సిఫారసుతో మరో 1,500 వరకు టికెట్లు జారీ చేస్తున్నారు.
ఇక, టీటీడీ బోర్డు చైర్మన్, సభ్యులకు 580 టికెట్లు జారీ చేస్తున్నారు. ఇవికాక.. స్వయంగా వచ్చే వీఐపీలు, టీటీడీ అధికారులు, దాతలకు కలిపి 600 టికెట్లు, శ్రీవాణిట్రస్టుకు విరాళాలు ఇచ్చే భక్తులకు 1,500 బ్రేక్ టికెట్లు ఇస్తున్నారు. విపరీతమైన ఒత్తిడితో ప్రజాప్రతినిధులు అదనంగా మరికొన్ని బ్రేక్ దర్శన టికెట్లు పొందుతున్నారు. ఇలా వీఐపీ బ్రేక్ దర్శనాలు రోజుకు 7 వేల నుంచి 7,500 వరకు వెళ్లిపోతున్నాయి. ప్రస్తుతం వీరందరికీ దర్శనం పూర్తయ్యేసరికే మద్యాహ్నం అయిపోతోంది. ఈ క్రమంలోనే.. తెలంగాణ ప్రజాప్రతినిధుల కోరిక మేరకు సీఎం రేవంత్‌రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. దానిపై సానుకూలంగా స్పందించిన చంద్రబాబు తెలంగాణ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ సిఫారసు లేఖలపై సోమవారం నుంచి గురువారం వరకు ఏదైనా రెండు రోజులు వీఐపీ బ్రేక్ దర్శనం, మరో రెండు రోజులు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి లేఖలు తీసుకుని జారీ చేసేలా డిసెంబరు నెలలో నిర్ణయం తీసుకున్నారు.
ఈ అంశంపై ప్రణాళికలు సిద్ధం చేయాలంటూ టీటీడీకి ఆదేశాలు అందాయి. అయితే ఇప్పటికే పెరిగిన బ్రేక్ దర్శన సిఫారసులను ఎక్కడ తగ్గించాలో అర్థంకాక టీటీడీ అధికారులు సతమతమవుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సిఫారసు లేఖలతో వస్తున్న తెలంగాణ భక్తులు.. ‘మా లెటర్లు ఎందుకు తీసుకోరు’ అంటూ వాగ్వాదానికి దిగుతున్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై దర్శనాలు ఇవ్వడం ప్రారంభిస్తే మరో 1,100 టికెట్లు పెరుగుతాయి. ఫలితంగా మరో గంట సమయం వీఐపీలకు కేటాయించాల్సి వస్తుంది. ఈ సమయాన్ని ఎక్కడ సర్దుబాటు చేయాలనే అంశంపై టీటీడీ గట్టి కసరత్తుచేస్తోంది.
Also Read: హై బీపీతో ఇబ్బంది పడుతున్నారా.. జస్ట్ 5 నిమిషాలు ఇలా చేయండి..
Also Read: ఏపీ ప్రభుత్వంపై సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు
Also Read: రంగంలోకి మీనాక్షి నటరాజన్
For Telangana News And Telugu News..