Share News

CBI Investigation: కాళేశ్వరంపై విచారణ జరపండి

ABN , Publish Date - Sep 03 , 2025 | 04:45 AM

కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకల వ్యవహారం కేంద్రానికి చేరింది. ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలు, నిధు ల దుర్వినియోగం, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు....

CBI Investigation: కాళేశ్వరంపై విచారణ జరపండి

అవకతవకలు, నిధుల దుర్వినియోగానికి బాధ్యులైన వారిపై దర్యాప్తు చేయండి

  • సీబీఐకి సమ్మతి తెలుపుతూ సర్కారు జీవో

హైదరాబాద్‌, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకల వ్యవహారం కేంద్రానికి చేరింది. ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలు, నిధు ల దుర్వినియోగం, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు, ప్రజాప్రతినిధులు, ప్రైవేట్‌ వ్యక్తు లు, అధికారులు, నిర్మాణ సంస్థలపై విచారణ జరిపే బాధ్యతను కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కు అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం రాత్రి జీవో 104ను జారీ చేసింది. 2016లో రాష్ట్రంలో సీబీఐ విచారణకు స్వేచ్ఛనిస్తూ జీవో జారీ చేసిన నాటి ప్రభు త్వం.. ఆ తర్వాత కేంద్రంతో విభేదాల కారణంగా 2022 ఆగస్టు 30న జీవో 51 ద్వారా సీబీఐ విచార ణపై ఆంక్షలు విధించింది. నిర్దిష్ట కేసుల్లో ప్రభుత్వం అనుమతిస్తే తప్ప రాష్ట్రంలో సీబీఐ ఏ కేసునూ స్వచ్ఛందంగా తీసుకోవడానికి వీల్లేకుండా కట్టడి చేసింది. ఈ క్రమంలో జీవో 51లోని నిర్దిష్ట అంశాల ఆధారంగా కాళేశ్వరం విచారణకు మాత్రం సీబీఐకి అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్డీఎ్‌సఏ), జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌లు విచారణ జరిపిన విషయాలనూ జీవోలో పేర్కొంది. కాళేశ్వరం అవకతవకలపై దర్యాప్తులో సీబీఐకి పూర్తి సహకారం అందిస్తామని తెలిపింది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ తమకు అందిందని సీబీఐ తెలిపింది. కేంద్ర హోంశాఖ సమ్మతి తెలిపితే సీబీఐ రంగంలోకి దిగనుంది. ఇప్పటికే జస్టిస్‌ పీసీ ఘోష్‌ విచారణలో కీలక పత్రాలన్నీ వెలుగులోకి వచ్చాయి. ఆ పత్రాలన్నింటినీ ప్రస్తుతం బీఆర్కే భవన్‌లో భద్రంగా ఉంచారు. సీబీఐ ఈ పత్రాలన్నీ కోరే అవకాశం ఉన్నందున ప్రభుత్వం మంగళవారమే అధికారులను అప్రమత్తం చేసింది. అయితే, ఈ కేసులో సీబీఐ దర్యాప్తు ప్రారంభించాలంటే ఢిల్లీ స్పెషల్‌ పోలీస్‌ ఎస్టాబ్లి్‌షమెంట్‌ యాక్ట్‌లోని సెక్షన్‌ 5 ప్రకారం కేంద్ర హోం శాఖ నోటిఫికేషన్‌ జారీ చేయాల్సి ఉంటుంది. కేంద్రం నోటిఫికేషన్‌ తర్వాతే మిగతా అంశాలపై సీబీఐ అధికారులు దృష్టి సారించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిపై సీబీఐ అధికారులు న్యాయనిపుణులను సంప్రదించనున్నారు.


కాళేశ్వరం విచారణ సాగిందిలా..

ఇప్పటికే కాళేశ్వరం ఎత్తిపోతలలోని అన్ని కాంపొనెంట్లపై కంప్రోల్టర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) అధ్యయనం చేసి, ఆర్థిక, విధానపరమైన లోపాలను బయటపెట్టిన విషయం తెలిసిందే. కాళేశ్వరంలోని అన్ని కాంపొనెంట్లను అధ్యయనం చేసి, దాదాపు రూ.27 వేల కోట్లకు పైగా అవకతవకలు జరిగాయని, అనవసర వృథా జరిగిందని కాగ్‌ తేల్చింది. ఇందుకోసం దాదాపు ఏడాదిన్నర సమయం వెచ్చించింది. ఇక 2023 అక్టోబరు 21న కాళేశ్వరం ఎత్తిపోతలలోని మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాకులో 16, 17, 18, 19, 20, 21వనంబరు పిల్లర్లు కుంగాయి. 2023 అక్టోబరు 24న ఎన్‌డీఎ్‌సఏ అధ్యయనం చేసి, నవంబరు 1న నివేదిక ఇచ్చింది. సరైన ప్రణాళిక లేకపోవడం, డిజైనింగ్‌, నిర్మాణ నాణ్యత లోపాలతో పాటు ఓఅండ్‌ఎం లోపాలతో బ్యారేజీ కుంగిందని నివేదిక ఇచ్చింది. దీన్ని గత ప్రభుత్వం తిరస్కరిస్తూ లేఖ రాసింది. ఆ తర్వాత 2023 డిసెంబరు 7న రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక బ్యారేజీ కుంగుబాటుకు కారణాలేంటి? పునరుద్ధరణకు ఏం చర్యలు తీసుకోవాలో నివేదిక ఇవ్వాలని ఎన్‌డీఎ్‌సఏను కోరగా.. నిపుణుల కమిటీ వేసింది. ఆ తర్వాత ఏడా ది పాటు సుదీర్ఘ అధ్యయనం చేసి, నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఇదే క్రమంలో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కూడా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై అధ్యయనం చేసి, నివేదికను అందించింది. పలువురిపై క్రిమినల్‌ కేసులు, క్రమశిక్షణ చ ర్యలు, పెన్షన్‌ కోతకు సిఫారసు చేయగా.. ప్రభుత్వం 38 మందికి షోకాజ్‌ నోటీసులు కూడా ఇచ్చింది. మరోవైపు 2024 మార్చి 14న కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంలో జరిగిన నిర్లక్ష్యం, లోపాలను పరిశీలించి.. జరిగిన నష్టంపై నివేదికివ్వాలని కోరుతూ ప్రభుత్వం జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. 115 మందిని ప్రశ్నించి, పత్రాలను పరిశీలించి కమిషన్‌ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.

వీరిపైనే గురి..?

రాజకీయంగా మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రులు హరీశ్‌, ఈటల రాజేందర్‌నే లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. అధికారుల పరంగా ఈ జాబితా భారీగానే ఉంది. మాజీ సీఎస్‌ ఎస్‌.కె.జోషి, సీఎంవో మాజీ కార్యదర్శి స్మితాసబర్వాల్‌, మాజీ ఈఎన్‌సీలు సి.మురళీధర్‌, నల్లా వెంకటేశ్వర్లు, బి.హరిరామ్‌, బి.నాగేంద్రరావు, హైడ్రాలజీ సీఈ శంకర్‌నాయక్‌, సీడీవో మాజీ ఈఎన్‌సీ నరేందర్‌రెడ్డి, ఈఎన్‌సీ(ఓఅండ్‌ఎం) టి.శ్రీనివాస్‌, రామగుండం సీఈ సుధాకర్‌రెడ్డి, టి.ప్రమీల, శ్రీదేవి, మాజీ సీఈలు బి.వి.రమణారెడ్డి, బసవరాజు, ఈఈలు తిరుపతిరావు, ఓంకార్‌ సింగ్‌, పబ్లిక్‌ వర్క్స్‌ మాజీ డైరెక్టర్‌ ఫణిభూషణ్‌శర్మలపైనే విచారణ అంతా గురిపెట్టే అవకాశాలున్నాయి. విజిలెన్స్‌, జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ నివేదిక కూడా వీరి చుట్టూనే తిరిగింది. ఇక నిర్మాణ సంస్థలపై కూడా విచారణ జరపాలని సీబీఐకి ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌లో పొందుపర్చింది. దీంతో ఎల్‌అండ్‌టీ (మేడిగడ్డ), అఫ్కాన్స్‌ (అన్నారం- షాపూర్‌జీ పల్లోంజీ అనుబంధ సంస్థ), సుందిళ్ల (నవయుగ)పైనా విచారణ చేపట్టే అవకాశాలున్నాయి.


ఇవి కూడా చదవండి..

దీన్ని ఫాలో చేయాలంటే గుండె ధైర్యం కావాల్సిందే.. ఏం రాశాడో మీరే చూడండి..

ఓరి దీని వేషాలో.. పామును ఈ పిల్లి ఎలా కెలుకుతుందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

Updated Date - Sep 03 , 2025 | 04:45 AM