Chairman Naveen Mittal: ఉద్యోగుల సమస్యలపై కమిటీ
ABN , Publish Date - May 07 , 2025 | 03:30 AM
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సీఎస్ నవీన్ మిత్తల్ నేతృత్వంలో ప్రభుత్వ అధికారి కమిటీ ఏర్పాటు అయింది. జేఏసీతో బుధవారం సమావేశమై వారం రోజుల్లో నివేదిక సమర్పించనున్నట్లు తెలిపింది.
నవీన్ మిత్తల్ నేతృత్వంలో ఏర్పాటు
సంఘాలతో చర్చించి తగిన సిఫారసులతో వారంలో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ఆదేశం
నేడు ఉద్యోగ సంఘాలతో కమిటీ భేటీ
హైదరాబాద్, మే 6 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికిగాను సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల సమస్యలు, సంక్షేమంపై చర్చించేందుకు ఉన్నతస్థాయి అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిత్తల్ చైర్మన్‌గా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేశ్‌కుమార్, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ప్రత్యేక కార్యదర్శి కృష్ణభాస్కర్ సభ్యులుగా అధికారుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు (జీవో 572) జారీ చేశారు. అన్ని విభాగాల ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించి.. వారి సమస్యలను ప్రభుత్వానికి నివేదించేలా ఈ కమిటీకి ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఆదేశాలిచ్చిన రోజు నుంచి వారం వ్యవధిలో నివేదికను ప్రభుత్వానికి అందించాలని పేర్కొంది. ప్రభుత్వ పథకాల అమలులో ఉద్యోగుల పాత్ర కీలకమని, పెండింగ్ సమస్యలపై ఇప్పటికే పలు ప్రతిపాదనలు ఉన్నందున వాటితోపాటు ఉద్యోగుల సంక్షేమంపై చర్చించి, తగిన సిఫారసులు చేసేందుకు కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపింది. కాగా, అధికారుల కమిటీ.. గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఉద్యోగుల సమస్యలు, సంక్షేమంపై చర్చించనుంది. ఉద్యోగులు లేవనెత్తిన సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.
నేడు ఉద్యోగుల జేఏసీతో సమావేశం
ప్రభుత్వం అధికారుల కమిటీని ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం వారు కమిటీ చైర్మన్ నవీన్ మిత్తల్‌ను కలిసి ఉద్యోగ సమస్యలను వివరించారు. పూర్తిస్థాయిలో చర్చించేందుకు సచివాలయంలో బుధవారం సాయంత్రం 4 గంటలకు సమావేశం కావాలని నిర్ణయించారు. ఉద్యోగుల జేఏసీ తరఫున సమావేశంలో పాల్గొనే ప్రతినిధుల వివరాలను మిత్తల్‌కు అందజేశారు. జేఏసీ నుంచి అధ్యక్ష, కార్యదర్శులతోపాటు వివిధ సంఘాల ప్రతినిధులు 15 మంది హాజరవుతున్నట్లు తెలిపారు. కాగా, ప్రభుత్వం అధికారుల కమిటీని నియమించడంపై సీఎం రేవంత్‌రెడ్డికి ఉద్యోగుల మరో జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు బుధవారం సాయంత్రం 5 గంటలకు తమ జేఏసీ ప్రతినిధులతో అధికారుల కమిటీ సమావేశం కానుందని లచ్చిరెడ్డి తెలిపారు. ఉద్యోగుల సమస్యలను కమిటీ దృష్టికి తీసుకెళ్లి.. త్వరగా పరిష్కారమయ్యేలా కృషి చేస్తామన్నారు.