తెలంగాణ ఎప్‌సెట్.. ‘ఏపీ’ అప్‌సెట్!
ABN , Publish Date - Feb 21 , 2025 | 04:39 AM
తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎప్‌సెట్-2025 నోటిఫికేషన్ గురువారం విడుదలైంది. ఈ నెల 25 నుంచి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు.
స్థానికేతర విభాగంపై స్పష్టత లేకుండానే నోటిఫికేషన్
ఏప్రిల్ 29-మే 5 వరకు పరీక్షలు
ఈ నెల 25 నుంచే దరఖాస్తులు
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎప్‌సెట్-2025 నోటిఫికేషన్ గురువారం విడుదలైంది. ఈ నెల 25 నుంచి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆలస్య రుసుముతో ఏప్రిల్ 24 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఏప్రిల్ 29 నుంచి మే 5వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. పునర్విభజన చట్టం మేరకు పదేళ్ల ఉమ్మడి ప్రవేశాలకు నిరుటితో గడువు ముగిసింది. ఫలితంగా ఈ ఏడాది నుంచి ఏపీ విద్యార్థులు ఎప్‌సెట్ రాసేందుకు అనుమతిపై సందిగ్ధత నెలకొంది. స్థానికేతర విభాగంలో ప్రవేశాలకు అర్హతపైౖ ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. దీంతో ఎప్‌సెట్ అధికారులు అస్పష్టంగానే నోటిఫికేషన్ జారీచేశారు. ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వులకు లోబడే స్థానికేతర విభాగం ప్రవేశాలు ఉంటాయని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
అంటే రాష్ట్రంలోని ప్రముఖ కళాశాలల్లో స్థానికేతర విభాగం (15 శాతం) కన్వీనర్ సీట్లకు పోటీ పడాలనుకునే ఏపీ అభ్యర్థులకు ప్రస్తుతానికి అవకాశం లేనట్లే. మరోవైపు యాజమాన్య కోటా సీట్లను ప్రతిభ ఆధారంగా భర్తీ చేస్తే.. ఏపీ అభ్యర్థులు ర్యాంకులు పొందాలంటే టీజీ ఎప్‌సెట్ రాసేందుకు అనుమతిస్తారా? లేదా? అన్నదానిపైనా స్పష్టత లేదు. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమ య్యే లోపే ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసే అవకాశం ఉందని ఉన్నత విద్యామండలి వర్గాలు చెబుతున్నాయి. సకాలంలో ఉత్తర్వులు జారీకాకుంటే తెలంగాణ అభ్యర్థులకు మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేలా ఎప్‌సెట్ అప్లికేషన్‌ను రూపొందించినట్ల్లు సమాచారం. మరోవైపు బీఎస్సీ ఫారెస్ట్రీ ప్రవేశాలను ఈ ఏడాది ఎప్‌సెట్ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. పూర్తి సమాచారం కోసం ఈఏపీసెట్.టీజీసీహెచ్‌ఈ.ఏసీ.ఇన్ వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు.