Bachupally: సంపులో ఇద్దరు పిల్లలను పడేసి.. తానూ దూకి!
ABN , Publish Date - Aug 21 , 2025 | 04:24 AM
ఇద్దరూ రెక్కలు ముక్కలు చేసుకుంటున్నా వచ్చే ఆ కొన్ని పైసలు ఉన్న నలుగురు పిల్లల పోషణకు ఏమాత్రం చాలకపోవడంతో ఆ దంపతుల మధ్య కలతలు మొదలయ్యాయి.
ఓ తల్లి అఘాయిత్యం.. పిల్లలు మృతి.. ఆమె సురక్షితం
దంపతులకు నలుగురు కొడుకులు.. పోషణకు తిప్పలు
కుటుంబ నియంత్రణ ఆపరేషన్ విషయంలో గొడవలు
నిజాంపేట, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): ఇద్దరూ రెక్కలు ముక్కలు చేసుకుంటున్నా వచ్చే ఆ కొన్ని పైసలు ఉన్న నలుగురు పిల్లల పోషణకు ఏమాత్రం చాలకపోవడంతో ఆ దంపతుల మధ్య కలతలు మొదలయ్యాయి. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుందామన్న భర్త వినకపోవడంతో భార్య మనోవేదనకు గురైంది. ఇద్దరు కుమారులను నీళ్లతో నిండి ఉన్న సంపులో పడేసి తాను దూకింది. ఈ ఘటన నుంచి ఆమె సురక్షితంగా బయటపడ్డా ఆ చిన్నారులు ప్రాణాలు కోల్పోవడమే తీవ్ర విషాదం. హైదరాబాద్ బాచుపల్లిలో ఈ ఘటన జరిగింది. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం ధర్మారం గ్రామానికి చెందిన లక్ష్మణ్, రత్నమ్మ(30) భార్యభర్తలు. వీరికి జగన్ (8), పవన్ (7), అరుణ్ (3), సుభాష్ (8 నెలలు) కుమారులున్నారు. పెద్ద పిల్లలు ఇద్దరూ సొంతూర్లో లక్ష్మణ్ తల్లిదండ్రుల వద్ద ఉంటూ చదువుకుంటున్నారు. రెండేళ్ల క్రితం అరుణ్‌ను వెంటబెట్టుకొని లక్ష్మణ్ దంపతులు బతుకుదెరువు కోసం బాచుపల్లికి వచ్చారు.
అక్కడ వారికి నాలుగో సంతానంగా సుభాష్ కలిగాడు. లక్ష్మణ్ లారీల్లో ఇసుక లోడింగ్, అన్‌లోడింగ్ పని చేస్తుండగా రత్నమ్మ కూలీ పనులకు వెళుతోంది. పిల్లల పోషణ కష్టంగా మారిందని, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకుందామని భర్తను రత్నమ్మ పలుమార్లు అడిగినా అతడు నిర్లక్ష్యంగా మాట్లాడాడు. ఈ విషయంలోనే దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. బుధవారం అర్ధరాత్రి భార్యాభర్తలు మరోసారి తగవుపడ్డారు. తర్వాత రత్నమ్మ.. నిద్రలో ఉన్న చిన్నారులు అరుణ్, సుభా్‌షను ఇంటిముందున్న నీటి సంపులో పడేసి, తాను దూకింది. పక్కనే ఉంటున్న ఓ వ్యక్తి అర్ధరాత్రి కాలకృత్యాలు తీర్చుకునేందుకు లేవడం.. సంపులోంచి అరుపులు వినిపించడంతో చూసి ఇరుగుపొరుగును అప్రమత్తం చేశాడు. వారొచ్చి రత్నమ్మను బయటకు తీశారు. పిల్లలను బయటకు తీసేలోపే ఆ చిన్నారులిద్దరూ మృతిచెందారు. పోలీసులొచ్చి రత్నమ్మను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.