Jagga Reddy: సోనియా భారతదేశానికి కోడలై 59 ఏళ్లయింది!
ABN , Publish Date - Aug 16 , 2025 | 03:32 AM
సోనియాగాంధీ భారతదేశం కోడలై 59 ఏళ్లు అయింది. దేశం, ధర్మం గురించి మాట్లాడే బీజేపీ నాయకులకు మన ధర్మంలో వారసత్వం ఎలా వస్తుందోకూడా తెలియదా? భర్తది ఏ కులమైతే భార్యదీ అదే కులమవుతుందన్న తెలివి కూడా వారికి లేదా?’
ధర్మం గురించి మాట్లాడే బీజేపీ నేతలకు వారసత్వం ఎలా వస్తుందో తెలియదా?
త్యాగాల చరిత్రే లేని బీజేపీ.. గాంధీ కుటుంబంపై నిందలు వేయడమా?
సోనియా, రాహుల్‌ల గొప్ప గుణం బీజేపీ నాయకుల్లో ఎవరికైనా ఉందా?
యావత్ దేశం.. సోనియాను గెలిపిస్తే ఆమె మన్మోహన్‌ను ప్రధాని చేశారు
3సార్లూ దొంగ ఓట్లతోనే అధికారంలోకి బీజేపీ .. దీన్ని రాహుల్ నిరూపించారు
ఇది సుప్రీం కోర్టులోనూ బట్టబయలైంది
బీజేపీకి తొత్తుగా ఈసీ: తూర్పు జగ్గారెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): ‘‘సోనియాగాంధీ భారతదేశం కోడలై 59 ఏళ్లు అయింది. దేశం, ధర్మం గురించి మాట్లాడే బీజేపీ నాయకులకు మన ధర్మంలో వారసత్వం ఎలా వస్తుందోకూడా తెలియదా? భర్తది ఏ కులమైతే భార్యదీ అదే కులమవుతుందన్న తెలివి కూడా వారికి లేదా?’’ అంటూ టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. స్వాతంత్య్ర ఉద్యమంలో పాత్ర, త్యాగాల చరిత్రే లేని బీజేపీ నాయకులు.. త్యాగాల కుటుంబమైన గాంధీ కుటుంబంపై నిందలు వేయడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. గాంధీ భవన్‌లో శుక్రవారం మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడారు. గాంధీ కుటుంబానికి కోడలిగా వచ్చిన సోనియాను ఈ దేశ మహిళగా ప్రజలూ గుర్తించారన్నారు. ఆమె కూడా భారత సంప్రదాయాలకే కట్టుబడి ఉన్నారని, తన భర్త రాజీవ్‌గాంధీ చనిపోయాక ఆ బాధతో ఏడేళ్లు అజ్ఞాత జీవితం గడిపారన్నారు. ఆ తర్వాత ప్రజలు కోరుకుంటేనే ఆమె రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు.
యావత్ దేశం సోనియా నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీని గెలిపించినా ఆమె ప్రధాని పదవిని స్వీకరించలేదని జగ్గారెడ్డి గుర్తు చేశారు. ప్రధాని కావాలంటూ మన్మోహనే స్వయంగా రాహుల్‌ను కోరితే ఆయనా వద్దన్నారని పేర్కొన్నారు. సోనియా, రాహుల్ కలిసి మన్మోహన్‌ను ప్రధానిని చేసి సుపరిపాలన అందించారని చెప్పారు. ‘‘సోనియా, రాహుల్‌కు ఉన్న ఈ గొప్పగుణం బీజేపీ నేతల్లో ఎవరికైనా ఉందా?’’ అని నిలదీశారు. ఇవాళ బీజేపీ ఇలా ఉందంటే వాజ్‌పేయీ, ఆడ్వాణీల త్యాగం వల్లనేనన్నారు. బీజేపీ ఢిల్లీ నేతలకు త్యాగం చేసే గుణమే ఉంటే ఆడ్వాణీ ప్రధాని అయి ఉండేవారన్నారు. ఓట్ల చోరీ వల్లే బీజేపీ 3సార్లు అధికారంలోకి వచ్చిందన్నారు. దీన్ని రాహుల్ నిరూపించారని, సుప్రీం కోర్టులోనూ నిజం బట్టబయలైందన్నారు. ఓట్ల చోరీ గురించి రాహుల్ మాట్లాడుతుంటే బీజేపీ నేతలు సమాధానం చెప్పలేక సోనియాపై నిందలు వేస్తున్నారన్నారు. ఎన్నికల కమిషన్ బీజేపీకి తొత్తుగా మారిందన్నారు. ప్రస్తుత బీజేపీ.. వాజ్‌పేయి, ఆడ్వాణీ కాలంనాటి విలువలతో నడుస్తున్న పార్టీ కాదన్నారు. తప్పు చేశామన్న భయం ఆ పార్టీ నేతల్లో మొదలైందన్నారు.