Konda Lakshman Bapuji Award: ‘పుట్టపాక’ చేనేత కళాకారులకు.. కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారాలు
ABN , Publish Date - Aug 06 , 2025 | 05:32 AM
రాష్ట్ర ప్రభుత్వం ఏటా అందించే కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారాలకు యాదాద్రి భువనగిరి జిల్లా పుట్టపాక గ్రామానికి చెందిన ముగ్గురు చేనేత కళాకారులు ఎంపికయ్యారు.
సంస్థాన్ నారాయణపురం, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఏటా అందించే కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారాలకు యాదాద్రి భువనగిరి జిల్లా పుట్టపాక గ్రామానికి చెందిన ముగ్గురు చేనేత కళాకారులు ఎంపికయ్యారు. చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7న ప్రభుత్వం వీరికి అవార్డులను అందజేయనుంది. చేనేత రంగంలో విశేష ప్రతిభ కనబరుస్తున్న చేనేత కార్మికులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ పురస్కారాలను అందిస్తోంది. మంగళవారం ప్రకటించిన అవార్డులకు పుట్టపాకకు చెందిన చేనేత కార్మికులు సామల భాస్కర్, గూడ పవన్, కొలను శంకర్ ఎంపికయ్యారు.
సామల భాస్కర్ నెమలి, దేవతామూర్తులు డిజైన్ ఉన్న చీరలను రూపొందించారు. ఇక గూడ పవన్ ఆరు నెలల పాటు శ్రమించి సహజమైన రంగులు అద్ది తేలియా రుమాల్ డబుల్ ఇక్కత్ చీరను నేశారు. రూ.75 వేల ఖరీదు చేసే ఈ చీర గత నెలలో పవన్‌కు జాతీయ పురస్కారాన్ని తెచ్చిపెట్టింది. కొలను శంకర్, రాజ్‌కోట్ సిల్క్, లెనిన్ కాటన్‌తో డబుల్ ఇక్కత్ పద్దతిలో ప్రత్యేక చీరలు రూపొందించారు. ఇదే గ్రామానికి చెందిన గజం నర్మద కూడా మార్కెటింగ్ విభాగంలో జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు.