Share News

Cabinet Expansion: నేడే విస్తరణ

ABN , Publish Date - Jun 08 , 2025 | 05:01 AM

ఆదివారం మధ్యాహ్నం 12.19 గంటలకు రాజ్‌భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. మంత్రివర్గంలో ఆరు ఖాళీలు ఉండగా.. అన్నీ కాకుండా ప్రస్తుతానికి పాక్షికంగా మాత్రమే భర్తీ చేయనున్నారు.

Cabinet Expansion:  నేడే విస్తరణ
Telangana Cabinet Expansion

మధ్యాహ్నం 12.19కు రాజ్‌భవన్‌లో ప్రమాణం

ఆరు ఖాళీల్లో.. మూడు మాత్రమే భర్తీచేసే అవకాశం

బీసీ, ఎస్సీ వర్గాలకే మంత్రివర్గ విస్తరణ పరిమితం!

బీసీల నుంచి వాకిటి శ్రీహరికి క్యాబినెట్‌ బెర్తు పక్కా

ఎస్సీల్లో మాల, మాదిగలకు ఒక్కొక్కరి చొప్పున..

మాల సామాజివర్గం నుంచి జి.వివేక్‌కు చాన్స్‌

మాదిగల్లో కవ్వంపల్లి, అడ్లూరి లక్ష్మణ్‌లలో ఒకరికి!

ఎస్టీల నుంచీ ఒకరికి ఇవ్వాలంటున్న సీఎం రేవంత్‌

ఓసీల నుంచి సుదర్శన్‌రెడ్డి పేరూ ప్రతిపాదన

విస్తరణకు కాంగ్రెస్‌ అధిష్ఠానం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినా.. తుది జాబితాలో ఎవరెవరు ఉంటారన్న ఉత్కంఠ

అందుబాటులో ఉండండి: సీఎం

మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, వేముల వీరేశం, కాలె యాదయ్య, మందుల సామేలు శనివారం రాత్రి సీఎం రేవంత్‌ను కలిశారు. విస్తరణలో తమ సామాజికవర్గానికి స్థానం కల్పించాలని కోరారు. ‘ఆదివారం అందుబాటులో ఉండండి. మీలో ఒకరికి మంత్రి పదవి వస్తుంది. ఎవరికి వచ్చినా.. ఇప్పుడు కలిసివచ్చినట్లే కలిసి ఉండాలి, కలిసి రావాలి’ అని వారితో సీఎం అన్నట్లు సమాచారం. కాగా, ఈ ఐదుగురిలో కవ్వంపల్లి పేరు తొలి ప్రాధాన్యంగా ఉండగా.. అడ్లూరి లక్ష్మణ్‌ పేరూ పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది.

హైదరాబాద్‌, జూన్‌ 7, (ఆంధ్రజ్యోతి): ఎన్నాళ్లో వేచిన మంత్రివర్గ విస్తరణ.. చివరికి ఇన్నాళ్లకు జరగబోతోంది. ఆశావహులు, సామాజిక సమీకరణలు వంటి అంశాలతో ఎన్నోసార్లు వాయిదా పడుతూ వచ్చిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్‌ అధిష్ఠానం నుంచి ఎట్టకేలకు గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. ఆదివారం మధ్యాహ్నం 12.19 గంటలకు రాజ్‌భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. మంత్రివర్గంలో ఆరు ఖాళీలు ఉండగా.. అన్నీ కాకుండా ప్రస్తుతానికి పాక్షికంగా మాత్రమే భర్తీ చేయనున్నారు. ఈ దఫాలో కేవలం ముగ్గురినే తీసుకోవాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. అది కూడా బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకే చోటు దక్కనుంది. బీసీల నుంచి నారాయణపేట జిల్లా మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి అవకాశం లభించనుంది. ముదిరాజ్‌ సామాజికవర్గానికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి గతంలోనే ప్రకటించారు. ఆ వర్గం నుంచి ఉన్న ఏకైక ఎమ్మెల్యే శ్రీహరే కావడంతో ఈయనకు బెర్త్‌ ఖాయమైంది. ఇక ఎస్సీల నుంచి మాల సామాజికవర్గానికి చెందిన మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే జి.వివేక్‌కు అవకాశం దక్కనుంది. మరో బెర్తును కూడా ఎస్సీల నుంచే భర్తీ చేయనున్నారు. ఈ అవకాశం మాదిగ సామాజికవర్గానికి చెందిన కరీంనగర్‌ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు గానీ, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు గానీ లభించనుంది. ఇలా ఎస్సీల నుంచి మాల, మాదిగలకు ఒక్కొక్కరికి చొప్పున ఇద్దరు ఎమ్మెల్యేలకు చోటు కల్పించనున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.


3 బెర్తులూ కొత్త ఎమ్మెల్యేలకే..

క్యాబినెట్‌లో భర్తీ చేయబోయే మూడు స్థానాలకూ తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారినే తీసుకుంటుండడం గమనార్హం. వీరిలో జి.వివేక్‌ 2009-2014 మధ్య ఓసారి ఎంపీగా పనిచేసినా.. ఎమ్మెల్యేగా ఎన్నికయింది మాత్రం తొలిసారే. వాకిటి శ్రీహరి, కవ్వంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ కూడా తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచినవారే. అయితే ఇదే తుది జాబితా కాదన్న అభిప్రాయాలూ ఉన్నాయి. బీసీ, ఎస్సీలతోపాటు ఒక ఎస్టీకి, అదే సమయంలో ఓసీల నుంచి సీనియర్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డికీ అవకాశం ఇవ్వాలని స్వయంగా సీఎం రేవంత్‌ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఎస్టీల నుంచి లంబాడ సామాజికవర్గానికి చెందిన నల్లగొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్‌తోపాటు మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ ఎమ్మెల్యే జాటోత్‌ రాంచందర్‌నాయక్‌ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. కాగా, నిజామాబాద్‌ జిల్లా బోదన్‌ ఎమ్మెల్యే పి.సుదర్శన్‌రెడ్డికి మంత్రివర్గంలో స్థానం ఖాయమని ముందు నుంచీ ప్రచారం జరుగుతోంది. అయితే తుది జాబితాలో ఆయన పేరు ఉంటుందా? లేదా? అన్నది సస్పెన్స్‌గానే మారింది. మంత్రివర్గ విస్తరణకు గ్రీన్‌సిగ్నల్‌ లభించి, విస్తరణ ముహూర్తం కూడా ఖరారైౖనా.. జాబితాపై మాత్రం అర్ధరాత్రి వరకు తుది చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బెర్తుల ఖరారులో మార్పుచేర్పులు కూడా ఉండవచ్చని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం జరిగేది మంత్రివర్గ విస్తరణా? పునర్‌వ్యవస్థీకరణా? అన్న చర్చ కూడా నడిచింది. అయితే ప్రస్తుతానికి విస్తరణ మాత్రమే ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


అంతటా చర్చ.. అంతా సస్పెన్స్‌

మంత్రివర్గ విస్తరణపై శనివారం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు ఊహాగానాలు సాగాయి. కాంగ్రె్‌సలో అందరూ ఇదే అంశంపై చర్చింరుకున్నారు. కానీ, కొత్త మంత్రులు ఎవరు అవుతారనే అంశపై మాత్రం సస్పెన్స్‌ కొనసాగింది. ఒక దశలో పార్టీలోని ముఖ్యనేతలెవరికీ దీనిపై నిర్దిష్ట సమాచారం లేకుండా పోయింది. సీఎం రేవంత్‌రెడ్డికి మాత్రం అధిష్ఠానం ముందుగానే చెప్పింది. ఆ తర్వాత క్రమంగా రాత్రి 10 గంటలు దాటాక పార్టీలోని సీనియర్లు, మంత్రులకు కూడా ఈ సమాచారం అందించారని తెలిసింది. అయితే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, ఫలానా సమయంలో అని మాత్రమే చెప్పారు తప్ప.. ఎవరెవరికి? ఎంతమందికి? అన్న విషయంలో మాత్రం ఒకరిద్దరికే స్పష్టత ఉందని సమాచారం.


ఇవి కూడా చదవండి:

చిప్స్ ప్యాకెట్ చోరీ చేసినందుకు తిట్లు.. బాలుడి ఆత్మహత్య

భార్యకు నిప్పు పెట్టిన భర్త.. కోరిక తీర్చ లేదని..

Read Latest and Crime News

Updated Date - Jun 08 , 2025 | 08:47 AM