High Court: ‘కాళేశ్వరం’ రక్షణకు తీసుకున్న చర్యలేంటి?
ABN , Publish Date - Aug 13 , 2025 | 03:46 AM
కాళేశ్వరం ప్రాజెక్టు రక్షణ కోసం తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్ 39 ప్రకారం చేయాల్సిన పనుల అమలుపైనా వివరాలు సమర్పించాలని ఆదేశించింది.
గత ఆదేశాల అమలుపై నివేదిక ఇవ్వండి
ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు
హైదరాబాద్, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు రక్షణ కోసం తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్ 39 ప్రకారం చేయాల్సిన పనుల అమలుపైనా వివరాలు సమర్పించాలని ఆదేశించింది. 2023లో ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వరదలు సంభవించిన నేపథ్యంలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ నిబంధనలు అమలు చేయాలని, కాళేశ్వరం ప్రాజెక్టు రక్షణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ డాక్టర్ చెరుకు సుధాకర్, కే శ్రవణ్‌కుమార్ తదితరులు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
ఈ పిటిషన్ మంగళవారం చీఫ్ జస్టిస్ ఏకే సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం ఎదుట మరోసారి విచారణకు వచ్చింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదిస్తూ.. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల రక్షణకు చర్యలు తీసుకోకపోవడం వల్ల నష్టం మరింత పెరుగుతుందని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఇదే పిటిషన్‌పై గతంలో ఇచ్చిన ఆదేశాల అమలుపై నివేదిక సమర్పించడంతోపాటు ప్రస్తుత పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియజేయాలని ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణ ఈనెల 28కి వాయిదా పడింది.