Share News

High Court: 90 రోజుల్లో స్థానికం ముగించాలి!

ABN , Publish Date - Jun 26 , 2025 | 04:32 AM

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను 90 రోజుల్లో పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘానికి(ఎ్‌సఈసీ) ఆదేశాలు జారీచేసింది.

High Court: 90 రోజుల్లో స్థానికం ముగించాలి!

  • పంచాయతీ ఎన్నికలపై సర్కారుకు హైకోర్టు స్పష్టీకరణ

  • సెప్టెంబరు 30లోపే ఫలితాలు ప్రకటించాలి

  • 30 రోజుల్లో ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేయాలి

  • ఎస్‌ఈసీ 60 రోజుల్లో ఎన్నికలు పూర్తి చేయాలి: హైకోర్టు

  • ఎన్నికలపై ఇప్పటికే 14 నెలలు ఆలస్యమైంది..

  • దానిపై చర్చించే సమయం లేదని ధర్మాసనం వ్యాఖ్య

హైదరాబాద్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను 90 రోజుల్లో పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘానికి(ఎ్‌సఈసీ) ఆదేశాలు జారీచేసింది. 30 రోజుల్లో రిజర్వేషన్లను ఖరారు చేసి, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సమ్మతి తెలియజేయాలని ప్రభుత్వానికి నిర్దేశించింది. ప్రభుత్వం సమ్మతి తెలిపిన తర్వాత ఫలితాల వెల్లడి సహా మొత్తం ఎన్నికల ప్రక్రియను 60 రోజుల్లో పూర్తిచేయాలని ఎస్‌ఈసీకి స్పష్టంచేసింది. సెప్టెంబరు 30లోగా పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెల్లడించాలని ఆదేశాలు జారీచేసింది. రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారం పంచాయతీల పదవీకాలం ముగిసేలోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ఇప్పటికే 14 నెలలు ఆలస్యం చేశారని పేర్కొంది. 2024 జనవరి 31 నాటికే పంచాయతీల గడువు ముగిసిందని తెలిపింది. 14 నెలలు ఎందుకు ఆలస్యం జరిగింది? అది న్యాయసమ్మతమా? కాదా? అనే చర్చలోకి ప్రస్తుత దశలో వెళ్లడం లేదని తెలిపింది. ఎన్నికల ప్రక్రియలో నాలుగో దశ అయిన రిజర్వేషన్ల ఖరారును పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి కనీసం 20 రోజులు పడుతుందని ప్రభుత్వం చెప్పగా.. తాము 30 రోజుల గడువు ఇస్తున్నామని తెలిపింది.


ఎన్నికలు నిర్వహించి, ఫలితాలు ప్రకటించడానికి ఎస్‌ఈసీకి 60 రోజుల గడువు ఇస్తున్నట్లు పేర్కొంది. సెప్టెంబరు 30న లేదా అంతకంటే ముందే ఫలితాలు ప్రకటించాలని ఆదేశించింది. కాగా, నల్లగొండ జిల్లా తాకట్లెపల్లి మండలం పీకే మల్లేపల్లి గ్రామ తాజా మాజీ సర్పంచి కొప్పుల పార్వతి సహా జిల్లాలోని మరో ఆరుగురు తాజా మాజీ సర్పంచులు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని పేర్కొంటూ 2024 జనవరి 31న పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై తాజాగా జస్టిస్‌ టి.మాధవీదేవి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది జె.ప్రభాకర్‌ వాదిస్తూ.. పంచాయతీల గడువు ముగిసే తేదీలోపే ఎన్నికలు నిర్వహించాలని రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243ఈ, 243కే, తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం-2018 నిర్దేశిస్తున్నప్పటికీ ఎన్నికలు నిర్వహించడం లేదని చెప్పారు. ఇప్పటికే 14 నెలలు ఆలస్యం చేశారన్నారు. గడువు ముగిసేలోపు ఎన్నికలు పెట్టాల్సి ఉన్నా ప్రభుత్వం, ఎస్‌ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.


ఎన్నికలు పెట్టే పరిస్థితి లేకపోతే హైకోర్టును ఆశ్రయించాల్సి ఉన్నప్పటికీ ఎస్‌ఈసీ ఆ పని చేయలేదన్నారు. ఎస్‌ఈసీ తరఫున సీనియర్‌ న్యాయవాది విద్యాసాగర్‌ వాదిస్తూ.. పంచాయతీరాజ్‌ చట్టం-2018 సెక్షన్‌ 197(6) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి తెలియజేయాల్సి ఉందన్నారు. ప్రభుత్వం అంగీకరిస్తేనే తాము నోటిఫికేషన్‌ జారీచేస్తామని తెలిపారు. ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ ఇమ్రాన్‌ఖాన్‌ వాదిస్తూ.. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలంటే ‘వికాస్‌ కిషన్‌రావు గవాలీ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ మహారాష్ట్ర’ కేసులో సుప్రీంకోర్టు నిర్దేశించిన విధంగా ట్రిపుల్‌ టెస్ట్‌ను అనుసరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆ టెస్ట్‌లో భాగంగానే డెడికేటెడ్‌ బీసీ కమిషన్‌ను నియమించామని, శాస్త్రీయ పద్ధతిలో కులగణన ద్వారా బీసీల లెక్కలు సేకరించామని తెలిపారు. నాలుగో దశ అయిన రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల అమలులో భాగంగానే ఆలస్యమైనట్లు వివరణ ఇచ్చారు. అన్ని వర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. ఆలస్యం ఎందుకు జరిగిందని చర్చించే సమయం ఇప్పుడు లేదని పేర్కొంది. 90 రోజుల్లో.. అంటే ఈ ఏడాది సెప్టెంబరు 30 లేదా అంతకంటే ముందే పంచాయతీ ఎన్నికల ఫలితాలు ప్రకటించాలని ఆదేశిస్తూ తీర్పు ఇచ్చింది.

Updated Date - Jun 26 , 2025 | 04:32 AM