Share News

High Court: భూ సర్వే అధికారం ఎస్సైకి ఎక్కడిది?: హైకోర్టు

ABN , Publish Date - Jul 10 , 2025 | 04:16 AM

భూసర్వే చేయించే అధికారం పోలీసు ఎస్సైకి ఎక్కడిదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. సివిల్‌ వివాదంలో జోక్యం చేసుకోవడంతోపాటు గంటల తరబడి పోలీస్‌స్టేషన్‌లో కూర్చోబెడుతున్నారన్న

High Court: భూ సర్వే అధికారం ఎస్సైకి ఎక్కడిది?: హైకోర్టు

  • సివిల్‌ వివాదంలో ఎస్సై వేధింపులు

  • యాంకర్‌ శిల్పాచక్రవర్తి వ్యాజ్యం

  • నల్లగొండ జిల్లా చింతపల్లి.. ఎస్సై రామ్మూర్తికి హైకోర్టు నోటీసులు

హైదరాబాద్‌, జూలై 9 (ఆంధ్రజ్యోతి): భూసర్వే చేయించే అధికారం పోలీసు ఎస్సైకి ఎక్కడిదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. సివిల్‌ వివాదంలో జోక్యం చేసుకోవడంతోపాటు గంటల తరబడి పోలీస్‌స్టేషన్‌లో కూర్చోబెడుతున్నారన్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలని పేర్కొంటూ నల్లగొండ జిల్లా చింతపల్లి ఎస్సై రామ్మూర్తికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం కూర్మేడ్‌ గ్రామంలో 32 ఎకరాల భూవివాదంలో ప్రైవేటు వ్యక్తి అయిన మహమ్మద్‌ అబ్దుల్‌ అజీజ్‌తో కలిసి చింతపల్లి ఎస్సై రామ్మూర్తి వేధింపులకు గురిచేస్తున్నారని.. తరచూ ఫోన్‌చేసి, పోలీ్‌సస్టేషన్‌కు రావాలని ఆదేశిస్తున్నారని పేర్కొంటూ టీవీ యాంకర్‌ శిల్పా చక్రవర్తి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఠాణాలో గంటల తరబడి కూర్చోబెడుతున్నారని ఆరోపించారు.


2017లో అజీజ్‌ నుంచి 32 ఎకరాల వ్యవసాయ భూమి తాము కొనుగోలు చేశామని.. ఈ భూమికి సంబంధించి విక్రయదారు, స్థానిక పోలీసులతో కలిసి వేధింపులకు దిగుతున్నారని ఆరోపించారు. ఈ భూమికి సంబంధించి సివిల్‌ కోర్టు రెండుసార్లు శాశ్వత ఇంజంక్షన్‌, పోలీస్‌ ప్రొటెక్షన్‌ ఆదేశాలు జారీ చేసిందని.. అయినా స్థానిక పోలీసులు జోక్యం చేసుకోవడం ఆపడం లేదని ఆరోపించారు. ప్రత్యేకంగా ఎస్సై రామ్మూర్తి ఈ వ్యవహారంలో వ్యక్తిగతంగా జోక్యం చేసుకుంటూ.. సెటిల్‌మెంట్‌ చేసుకోవాలని పోలీ్‌సస్టేషన్‌లో చర్చలు జరుపుతున్నారని.. చట్టవిరుద్ధంగా సర్వే చేయిస్తున్నారని పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలను, చట్టాలను ధిక్కరించడంతోపాటు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై వాదనలను విన్న జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌ ధర్మాసనం.. వివరణ ఇవ్వాలని పేర్కొంటూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, నల్లగొండ ఎస్పీ, దేవరకొండ డీఎస్పీ తదితరులకు నోటీసులు జారీచేసింది. అలాగే ఎస్సై రామ్మూర్తిని వివరణ ఇవ్వాలని పేర్కొన్న హైకోర్టు.. ఆయనకు వ్యక్తిగత నోటీసులు ఇచ్చేందుకు పిటిషనర్ల న్యాయవాదికి అనుమతినిచ్చింది.


లాయర్ల బీమా10 లక్షలకు పెంపు

న్యాయవాదులకు అందించే ఆర్థిక ప్రయోజనాలను పెంచుతూ తెలంగాణ రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ బుధవారం కీలక ప్రకటన చేసింది. ఇప్పటివరకు ఉన్న డెత్‌ క్లెయిమ్‌ను రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ నర్సింహారెడ్డి, వైస్‌చైర్మన్‌ సునీల్‌గౌడ్‌, బీసీఐ సభ్యుడు విష్ణువర్ధన్‌రెడ్డి ప్రకటించారు. మరణించిన లాయర్ల అంత్యక్రియల ఖర్చులను రూ.15 వేల నుంచి 20 వేలకు పెంచినట్లు వెల్లడించారు. అనారోగ్యంతో బాధపడేవారికి వైద్యచికిత్స ఖర్చులను రూ.లక్షకు, లైబ్రరీ రుణాన్ని 10 వేల నుంచి 15 వేలకు పెంచామన్నారు.

Updated Date - Jul 10 , 2025 | 04:16 AM