Share News

MBBS Seats: ఎంబీబీఎస్‌ సీట్లన్నీ పదిలమే

ABN , Publish Date - Jul 10 , 2025 | 03:28 AM

రాష్ట్రంలోని 34 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఉన్న 4,090 ఎంబీబీఎస్‌ సీట్లు ఈ విద్యా సంవత్సరం కూడా యథావిధిగా కొనసాగుతాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం ప్రకటించింది.

MBBS Seats: ఎంబీబీఎస్‌ సీట్లన్నీ పదిలమే

  • 34 కళాశాలల్లోని 4,090 సీట్లకు ఎన్‌ఎంసీ ఓకే

  • త్వరలోనే నీట్‌ స్టేట్‌ ర్యాంకులు: వైద్య ఆరోగ్య శాఖ

హైదరాబాద్‌, జూలై 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 34 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఉన్న 4,090 ఎంబీబీఎస్‌ సీట్లు ఈ విద్యా సంవత్సరం కూడా యథావిధిగా కొనసాగుతాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం ప్రకటించింది. ఆయా సీట్లు ఎప్పట్లానే కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేస్తామని పేర్కొంది. ఇందుకు అవసరమైన అనుమతులను జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ) మంజూరు చేసిందని ఓ ప్రకటనలో తెలిపింది. అధ్యాపకుల కొరత సహా రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో నెలకొన్న సమస్యలపై ఎన్‌ఎంసీ ఇటీవల షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఇందుకు స్పందించిన వైద్య, ఆరోగ్య శాఖ ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంది. 44 మంది సీనియర్‌ అధ్యాపకులకు పదోన్నతి కల్పించి వైద్య కళాశాలల ప్రిన్సిపాల్‌లుగా, బోధనాస్పత్రులకు సూపరింటెండెంట్లుగా నియమించింది. 278 మంది అసోసియేట్‌ ప్రొఫెసర్లకు.. ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పించింది.


అలాగే, 231 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు అసోసియేట్‌ ప్రొఫెసర్లుగా పదోన్నతి ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటుంది. ఇక, 607 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 21 ఆస్పత్రుల్లో కొత్తగా 6వేల పడకల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. ఇక, కళాశాలల పర్యవేక్షణకు మెడికల్‌ కాలేజీ మానిటరింగ్‌ కమిటీ(ఎంసీఎంసీ)లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ఎన్‌ఎంసీ.. నాలుగు నెలల్లోగా అన్ని సమస్యలను పరిష్కరించుకోవాలని సూచిస్తూ అన్ని కళాశాలలకు అనుమతులు కొనసాగించింది. మరోవైపు, ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియను ప్రారంభించేందుకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా త్వరలోనే నీట్‌ ేస్టట్‌ ర్యాంకులను విడుదల చేయనున్నారు. ఆ తర్వాత మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ షెడ్యూల్‌ ప్రకారం కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభిస్తారు.

Updated Date - Jul 10 , 2025 | 03:29 AM