ఈఎన్‌సీ అనిల్‌కుమార్‌పై బదిలీ వేటు!
ABN , Publish Date - Jun 21 , 2025 | 03:12 AM
నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ (జనరల్) జి.అనిల్‌కుమార్‌పై ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ఆయనపై బదిలీ వేటు వేసింది. అనిల్‌కుమార్‌ను బదిలీ చేయడంతోపాటు..
నీటిపారుదల శాఖ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశం
హైదరాబాద్, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ (జనరల్) జి.అనిల్‌కుమార్‌పై ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ఆయనపై బదిలీ వేటు వేసింది. అనిల్‌కుమార్‌ను బదిలీ చేయడంతోపాటు నీటిపారుదల శాఖ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశిస్తూ ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 16న ఇచ్చిన ఈ ఉత్తర్వులు శుక్రవారం వెలుగులోకి వచ్చాయి. అనిల్‌కుమార్ స్థానంలో ప్రస్తుతం ఈఎన్‌సీ (అడ్మిన్)గా పనిచేస్తున్న మహ్మద్ అంజద్ హుస్సేన్‌కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. గత కొన్ని రోజులుగా ఈఎన్‌సీ అనిల్‌కుమార్‌పై ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. తాజాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన ఈఈ నూనె శ్రీధర్ వ్యవహారంతో ఇది మరింత ఎక్కువైంది. శ్రీధర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ ప్రక్రియను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారని గుర్తించిన ప్రభుత్వం.. 2024 జూన్ 27న ఆయన్ను బదిలీ చేసింది. నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని రాహుల్ బొజ్జా అప్పట్లో ఉత్తర్వులు ఇచ్చారు.
ఆ ఉత్తర్వులను అడ్డుకున్న అనిల్‌కుమార్.. శ్రీధర్ ఏడాది పాటు చొప్పదండిలోనే కొనసాగడానికి సహకరించారని తేల్చారు. నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులను బేఖాతరు చేయడం ద్వారా అనిల్‌కుమార్ శ్రీధర్‌కు మేలు చేశారని ఏసీబీ ప్రభుత్వానికి నివేదించింది. ఓ దశలో అనిల్‌కుమార్‌కు కూడా నోటీసులు ఇవ్వాలని ఏసీబీ యోచించినట్లు సమాచారం. అయితే శ్రీధర్ బదిలీ ఆపింది వాస్తవమేనని, దీని వెనక ఎలాంటి దురుద్దేశాలూ లేవని అనిల్‌కుమార్ ప్రభుత్వానికి తెలిపారు. కాళేశ్వరం విచారణ జరుగుతున్న క్రమంలో కమిషన్ అడిగే కీలక సమాచారాన్ని అక్కడ పనిచేసిన వారైతేనే ఇవ్వగలరన్న కారణంతోనే బదిలీని ఆపినట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జాకు సమాచారం ఇచ్చారు. నూనె శ్రీధర్ బదిలీని నిలుపుదల చేయించిన రోజు నుంచి ఇప్పటిదాకా ఆ ప్రాంతంలో ఎలాంటి పనులూ జరగలేదని, అలాంటప్పుడు అక్రమాలను ప్రోత్సహించినట్లు ఎలా అవుతుందంటూ అనిల్‌కుమార్ ప్రభుత్వానికి నివేదించినా ఫలితం లేకుండా పోయింది.
కృష్ణాకు ఒకరు.. గోదావరికి మరొకరు
కృష్ణా జలాల వివాదంలో ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా వెళుతున్నారనే కారణంతో ఈఎన్‌సీ సి.మురళీధర్‌ను ప్రభుత్వం తప్పించడం తెలిసిందే. దీంతో ఈఎన్‌సీ (అడ్మిన్)గా ఉన్న అనిల్‌కుమార్‌కు ఈఎన్‌సీ (జనరల్)గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇటీవల ఆయన్ను పూర్తిస్థాయి ఈఎన్‌సీ (జనరల్)గా నియమించగా.. గోదావరి-బనకచర్ల వివాదంతో పాటు నూనె శ్రీధర్ వ్యవహారంలో ప్రభుత్వం ఆయన్ను తప్పించింది.