గురుకులాలకు నిత్యావసరాల సరఫరా బాధ్యత మహిళా సంఘాలకు
ABN , Publish Date - May 15 , 2025 | 04:01 AM
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ గురుకులాలతోపాటు ఇతర ఎస్సీ, బీసీ వసతి గృహాలకు నిత్యావసరాలు, కాస్మెటిక్స్‌ను మహిళా సంఘాల ద్వారా సరఫరా చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది.
ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం.. త్వరలో సీఎంకు నివేదిక
వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలుకు అధికార్ల కసరత్తు
హైదరాబాద్, మే 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ గురుకులాలతోపాటు ఇతర ఎస్సీ, బీసీ వసతి గృహాలకు నిత్యావసరాలు, కాస్మెటిక్స్‌ను మహిళా సంఘాల ద్వారా సరఫరా చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో విద్యార్థులకు నాణ్యమైన సరుకులు అందడమేకాకుండా మహిళా సంఘాలు ఆర్థికంగా మరింత బలోపేతమయ్యే అవకాశం ఉంటుందని భావిస్తోంది. కాస్మెటిక్స్ విక్రయాల కోసం గురుకులాల వద్ద మహిళా సంఘాల ఆధ్వర్యంలో స్టాళ్లను ఏర్పాటు చేయించాలని, విద్యార్థులు నేరుగా వెళ్లి వారికి అవసరమైనవి కొనుక్కునే అవకాశం కల్పించాలనుకుంటోంది. మరోవైపు మండల పరిధిలోని గురుకులాలు, ఇతర వసతి గృహాలకు తాజా కూరగాయలు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈమేరకు మాతృదినోత్సవం సందర్భంగా ఈ అంశాలన్నింటిపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించినట్టు తెలిసింది. గురుకులాలకు వస్తువుల సరఫరా బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించే అంశంపై సమగ్ర నివేదిక రూపొందించాలని ఆదేశించినట్టు సమాచారం. విద్యార్థులకు అవసరమైన ప్లేట్లు, గ్లాసులు, ట్రంక్‌పెట్టెలు, బూట్లు, బ్యాగులు, టై, బెల్టు, బకెట్లు, ఎడ్యుకేషన్ కిట్లు, స్పోర్ట్స్ డ్రెస్సులు, కాస్మెటిక్స్ తదితరాల సరఫరాకు రాష్ట్రస్థాయి లో టెండర్లు పిలవాలని... కూరగాయలు, పళ్లు, నిత్యావసరాల సరఫరా బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించనున్నట్టు తెలిసింది. కాస్మెటిక్స్‌ను సెంట్రలైజ్డ్ టెండర్లలో కూడా మహిళా సంఘాలకు లబ్ధి చేకూరే విధానాలేమి ఉన్నాయో అధ్యయనం చేయాలని సూచించినట్టు తెలుస్తోంది. చికెన్, కోడిగుడ్ల సరఫరాను ఏజెన్సీలకు అప్పగించే యోచనలో ఉన్నట్టు సమాచారం. వచ్చే విద్యా సంవత్సరం నుంచే మహిళా సంఘాల ద్వారా సరఫరా చేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు సమగ్ర నివేదికను సిద్ధం చేసి త్వరలోనే సీఎంకు సమర్పించనున్నట్టు అధికారికవర్గాలు చెబుతున్నాయి.
గుత్తేదారు వ్యవస్థకు స్వస్తి!
గురుకులాల్లో నిత్యావసరాలు, కాస్మెటిక్స్‌కు సంబంధించి గుత్తేదారు వ్యవస్థకు స్వస్తి పలికి.. దాని స్థానంలో మండల కేంద్రాల నుంచి రాష్ట్ర స్థాయి వరకు మహిళా సంఘాలకు బాధ్యతలను అప్పగించనున్నారు. తల్లులు ఇంట్లో తమ పిల్లలకు నాణ్యమైన భోజనాన్ని ఎంత బాధ్యతగా అందిస్తారో.. గురుకులాలకు కూడా అదే స్థాయిలో మహిళలు నాణ్యమైన కూరగాయలు, నిత్యావసరాలను అందిస్తారని ప్రభుత్వం భావించడమే ఇందుకు కారణం. అదే విధంగా పిల్లలకు ప్రతి ఏటా ప్రభుత్వం ఉచితంగా అందించే యూనిఫారమ్ విషయంలోనూ నేతన్నలతో మాట్లాడి, ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రాఽథమికంగా నిర్ణయించారు.
12 లక్షల మంది విద్యార్థులు..
గురుకులాలకు నిత్యావసరాలు, కాస్మెటిక్స్, కూరగాయల సరఫరాకు సంబంధించి మహిళలకు కొన్ని బడా కంపెనీలతో ప్రత్యేక శిక్షణను ఇప్పించా లని ప్రాథమికంగా నిర్ణయించారు. వ్యాపారంలో మెళకువలు నేర్పి నష్టంరాకుండా చూడవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇక కూరగాయల సరఫరా విషయంలో అత్యంత జాగ్రత్త వహించేలా చర్యలు తీసుకోనున్నారు. కనీసం రెండ్రోజులకు సరిపడా నిత్యావసరాలు గురుకులాలు, హాస్టళ్లలో ఉండేలా చూడనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, సాధారణ గురుకులాలు, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ (కేజీబీవీ), ఏకలవ్య మోడల్ స్కూల్, అర్బన్ రెసిడెన్షియల్, ప్రత్యేక పాఠశాలలు కలిపి 2,053 ఉండగా.. సుమారు 10,12,603 మంది విద్యార్థులున్నారు. ఇవీకాక ఎస్సీ, బీసీ సంక్షేమ హాస్టళ్లు 1,698ఉండగా.. వీటిలో దాదాపు 1,93,399 మంది ఉంటున్నారు. మొత్తంగా 3,751 పాఠశాలలు, హాస్టళ్లలో కలిపి దాదాపు 12,06,002 మంది విద్యార్థులు ఉంటారు. వీరి భోజనాల కోసం ఆయా గురుకులాలు టెండర్లు పిలిచి సరుకులు సరఫరా చేయిస్తున్నారు.
గురుకుల విద్యార్థులకు స్మార్ట్ కార్డులు..
కాస్మెటిక్స్ కొనేందుకు విద్యార్థులకే ప్రత్యేక స్మార్ట్ కార్డు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారు. దుకాణానికి వెళ్లి అవసరమైనవి కొనుక్కోవడంతోపాటు డబ్బును ఖర్చు చేసే తీరు పిల్లలకు తెలుస్తుందని, దీంతో ఆర్థిక నిర్వహణపై వారికి అవగాహన ఏర్పడుతుందని భావిస్తున్నారు. కాస్మెటిక్స్‌కు అవసరమయ్యే నగదును గురుకులాల అధికారులు స్మార్ట్ కార్డులో జమచేస్తారు. కాస్మెటిక్స్ విక్రయించే మహిళా సంఘాల దుకాణాల్లోనే ఆ కార్డు పనిచేస్తుంది. కార్డులో ఎంత నగదు ఉంది, వేటికి ఎంత ఖర్చు చేశారన్న వివరాలు విద్యార్థులకు తెలుస్తాయి.
గురుకుల విద్యార్థులకు స్మార్ట్ కార్డులు..
కాస్మెటిక్స్ కొనేందుకు విద్యార్థులకే ప్రత్యేక స్మార్ట్ కార్డు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారు. దుకాణానికి వెళ్లి అవసరమైనవి కొనుక్కోవడంతోపాటు డబ్బును ఖర్చు చేసే తీరు పిల్లలకు తెలుస్తుందని, దీంతో ఆర్థిక నిర్వహణపై వారికి అవగాహన ఏర్పడుతుందని భావిస్తున్నారు. కాస్మెటిక్స్‌కు అవసరమయ్యే నగదును గురుకులాల అధికారులు స్మార్ట్ కార్డులో జమచేస్తారు. కాస్మెటిక్స్ విక్రయించే మహిళా సంఘాల దుకాణాల్లోనే ఆ కార్డు పనిచేస్తుంది. కార్డులో ఎంత నగదు ఉంది, వేటికి ఎంత ఖర్చు చేశారన్న వివరాలు విద్యార్థులకు తెలుస్తాయి.