Share News

రూ.4,500 కోట్ల రుణానికి కేంద్రం నిరాకరణ!

ABN , Publish Date - Feb 16 , 2025 | 04:13 AM

రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలలో తీసుకోవాలనుకున్న రూ.10 వేల కోట్ల అప్పులో రూ.4,500 కోట్లకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీంతో ప్రభుత్వం ఈ నెల 18న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించే వేలం పాటలో పాల్గొనడం లేదు.

రూ.4,500 కోట్ల రుణానికి కేంద్రం నిరాకరణ!

  • జనవరి నాటికే రూ.53,678 కోట్ల అప్పు తీసేసుకున్న రాష్ట్రం!

హైదరాబాద్‌, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలలో తీసుకోవాలనుకున్న రూ.10 వేల కోట్ల అప్పులో రూ.4,500 కోట్లకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీంతో ప్రభుత్వం ఈ నెల 18న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించే వేలం పాటలో పాల్గొనడం లేదు. రుణాల కోసం ఎలాంటి ఇండెంట్లూ పెట్టలేదు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ.30 వేల కోట్ల అప్పు తీసుకుంటామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌బీఐకి ప్రతిపాదించింది. జనవరి, ఫిబ్రవరి, మార్చిలో రూ.10 వేల చొప్పున రూ.30 వేల కోట్ల అప్పు కోసం ఇండెంట్లు సమర్పించింది. కానీ, జనవరిలో కేంద్ర ప్రభుత్వం అనుమతించిన రూ.5,500 కోట్ల అప్పును మాత్రమే తీసుకోగలిగింది. మిగతా రూ.4,500 కోట్లు తీసుకోలేకపోయింది. ఈ ఫిబ్రవరిలో తీసుకోవాల్సిన రూ.10వేల కోట్లలో 4న రూ.3000 కోట్లు, 11న రూ.2000 కోట్లు, 18న రూ.2500 కోట్లు, 25న రూ.2500కోట్ల చొప్పున అప్పు తీసుకుంటామని ప్రతిపాదించింది. ఈనెల 4న రూ.3000 కోట్లు తీసుకుంది.


11న తీసుకోవాల్సిన రూ.2000 కోట్లు, 18న తీసుకోవాల్సిన రూ.2500కోట్ల అప్పునకు ఇండెంట్లు పెట్టలేకపోయింది. కేంద్రం నుంచి అనుమతి రాకపోవడంతో అప్పు తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నెల 25న తీసుకోవాలనుకున్న రూ.2500 కోట్ల అప్పునకు కేంద్రం అనుమతి ఇస్తుందా.. లేదా? అనేది వేచి చూడాలి. వాస్తవానికి 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ ద్వారా రూ.49,255.41 కోట్ల మార్కెట్‌ రుణాలను సేకరిస్తామని బడ్జెట్‌లో పొందుపర్చింది.కానీ, జనవరి నాటికే రూ.53,678.93 కోట్ల రుణం తీసుకుంది. అంటే పరిమితికి మించి రూ.4,423 కోట్ల అప్పు తీసుకుంది. అయితే, ఈ నెల 25న మరో రూ.2,500 కోట్లు, మార్చిలో రూ.10 వేల కోట్ల అప్పు తీసుకుంటామని ఆర్‌బీఐకి తెలంగాణ ప్రతిపాదించింది. అయితే, ఇందుకు కేంద్రం అనుమతిస్తుందా అన్నది ప్రశ్నార్థకమే. ఈ విషయంపై ఆర్థిక శాఖ అధికారులు పెదవి విప్పడం లేదు.

Updated Date - Feb 16 , 2025 | 04:13 AM