Share News

Lift Irrigation: మళ్లీ సీడబ్ల్యూసీకి ‘పాలమూరు’ డీపీఆర్‌

ABN , Publish Date - May 03 , 2025 | 05:18 AM

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ)కు మళ్లీ పంపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Lift Irrigation: మళ్లీ సీడబ్ల్యూసీకి ‘పాలమూరు’ డీపీఆర్‌

  • అధికారులకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఆదేశం

హైదరాబాద్‌, మే 2 (ఆంధ్రజ్యోతి): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ)కు మళ్లీ పంపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మైనర్‌ ఇరిగేషన్‌లో మిగిలిన 45 టీఎంసీలు, బచావత్‌ ట్రైబ్యునల్‌ వెసులుబాటులో దక్కిన 45 టీఎంసీలు కలిపి 90 టీఎంసీలతో డీపీఆర్‌ను ఈనెల 6 లేదా 7వ తేదీన దాఖలు చేయాలని భావిస్తోంది. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి జలసౌధలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో శుక్రవారం వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనుమతులపై ఆరా తీశారు.


ఇందుకు స్పందించిన అధికారులు మైనర్‌ ఇరిగేషన్‌లో 45 టీఎంసీలు ఏ విధంగా మిగిలాయనే దానిపై లెక్కలు సక్రమంగా లేవని, పోలవరం ప్రాజెక్టు వల్ల దక్కిన 45 టీఎంసీలపై ఉమ్మడి ఏపీకే అధికారాలు ఉన్నాయని, ట్రైబ్యునల్‌ తేల్చేదాకా ఈ నీటిపై ఏ రాష్ట్రానికి అధికారాలు రావని సీడబ్ల్యూసీ డీపీఆర్‌ను వెనక్కి పంపిందని తెలిపారు. సీడబ్ల్యూసీ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని మైనర్‌ ఇరిగేషన్‌లో 45 టీఎంసీల నీటిపొదుపుపై శాస్త్రీయంగా లెక్కలు తీశామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును ఏపీ అవసరాల కోసం కడుతున్నందున.. సాగర్‌ ఎగువన తెలంగాణ మాత్రమే ఉందని, ఈ లెక్కన 45 టీఎంసీలపై పూర్తి అధికారం తెలంగాణకే ఉందని అధికారులు వెల్లడించారు. దాంతో 90 టీఎంసీలతో డీపీఆర్‌ను దాఖలు చేసి, అనుమతులు సాధించాలని మంత్రి ఆదేశించారు.

Updated Date - May 03 , 2025 | 05:19 AM