Pre Primary Education: వెయ్యి స్కూళ్లలో ప్రీ ప్రైమరీ తరగతులు
ABN , Publish Date - Jul 27 , 2025 | 03:40 AM
ప్రాథమిక విద్య, ప్రాఽథమిక పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పూర్వ ప్రాథమిక (ప్రీప్రైమరీ) తరగతులు ప్రారంభించనుంది.
ఈ ఏడాది నుంచే ప్రభుత్వ ప్రైమరీ స్కూళ్లలో
ప్రతి బడికి ఒక ఇన్‌స్ట్రక్టర్, ఆయా పోస్టు
విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, స్నాక్స్
నిద్ర పోయేందుకు పాఠశాలలోనే ఏర్పాట్లు
హైదరాబాద్, జూలై 26 (ఆంధ్ర జ్యోతి): ప్రాథమిక విద్య, ప్రాఽథమిక పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పూర్వ ప్రాథమిక (ప్రీప్రైమరీ) తరగతులు ప్రారంభించనుంది. ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల ప్రాథమిక పాఠశాలల్లో అమలు చేయనుంది. ఇందుకోసం గత నెలలో 210 పాఠశాలల వివరాలు ప్రకటించగా, మరో 790 బడుల జాబితాను శనివారం ప్రకటించిన విద్యాశాఖ.. ప్రీ ప్రైమరీ పాఠశాల నిర్వహణకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రీ ప్రైమరీ విద్యార్థుల కోసం ఇప్పుడున్న పాఠశాలల్లో ప్రత్యేక గది కేటాయించాలని ప్రధానోపాధ్యాయులను కోరింది.
వచ్చే ఏడాది (2026-27)లో ఒకటో తరగతిలో ప్రవేశం పొందేవారికి ఇప్పుడు ప్రీప్రైమరీ విద్యార్థిగా ప్రవేశాలివ్వాలని తెలిపింది కొత్తగా అందుబాటులోకి రానున్న తరగతుల నిర్వహణకు ప్రతి పాఠశాలకు ఇద్దరు సిబ్బంది (ఒక ఇన్‌స్ట్రక్టర్, ఆయా) చొప్పున విద్యాశాఖ రాష్ట్ర వ్యాప్తంగా 2,000 మందిని నియమించనున్నది.. జిల్లా స్థాయిలో కలెక్టర్ నేతృత్వంలో ఇంటర్ చదివిన స్థానిక యువతీ యువకులను ఈ ఉద్యోగాలకు నియమిస్తారు. ప్రతి విద్యార్థికి పౌష్ఠికాహారం అందించడమే లక్ష్యమన్న విద్యాశాఖ.. ప్రీ ప్రైమరీ విద్యార్థులకూ మధ్యాహ్న భోజన పథకం వర్తింపచేయాలని కోరింది. అలాగే అంగన్‌వాడీల ఆధ్వర్యంలో చిన్నారులకు స్నాక్స్ కూడా ఇవ్వడంతోపాటు వారికి కేటాయించే తరగతి గదిలో చిన్నారులకు ఆసక్తి కలిగేలా ఆట వస్తువులు, బొమ్మలు అందుబాటులో ఉంచాలని సూచించింది. చిన్నారులు నిద్ర పోవడానికి తరగతి గదిలో ఒక చోటు ఏర్పాటు చేయాలని మార్గదర్శకాల్లో కోరింది.
ఈవార్తలు కూడా చదవండి..
పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు..
సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో ఘోర తప్పిదం.. పోలీసుల కేసు నమోదు
Read latest Telangana News And Telugu News