SC Categorization: ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాల జారీ ఎలా?!
ABN , Publish Date - Apr 17 , 2025 | 04:17 AM
ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో కుల ధ్రువీకరణ పత్రాల జారీపై మార్గదర్శకాలు జారీ చేసేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది.
వర్గీకరణ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో
మార్గదర్శకాల విడుదలపై సర్కారు కసరత్తు
‘కులగణన’ను ప్రామాణికంగా తీసుకునే యోచన
ఆ వివరాలు అధికారులకు అందుబాటులో ఉంటే
తప్పులు జరిగే అవకాశం ఉండదని అంచనా
రిజర్వేషన్ ఫలాలు అర్హులకే అందేలా ప్రణాళికలు
హైదరాబాద్, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో కుల ధ్రువీకరణ పత్రాల జారీపై మార్గదర్శకాలు జారీ చేసేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. త్వరలోనే పెద్దఎత్తున రానున్న ఉద్యోగ నోటిఫికేషన్లతోపాటు విద్యా సంస్థల ప్రవేశాల్లో ఎస్సీ వర్గీకరణ ప్రకారం ఆయా కులాల వారికి అవకాశాలు కల్పించాల్సిన నేపథ్యంలో ఎక్కడా పొరపాట్లు జరగొద్దన్న కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉంది. అయితే, ఎస్సీ సామాజిక వర్గంలోని అభివృద్ధి చెందిన వర్గాలు అత్యంత వెనకబడిన వర్గాల కేటగిరీ కింద కుల ధ్రువీకరణ పత్రాలు పొందితే.. వర్గీకరణకు అర్థం ఉండదని సర్కారు భావిస్తోంది. ఈ విషయమై ఆయా సామాజిక వర్గాల నాయకులు ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా.. ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎడాపెడా కుల ధ్రువీకరణ పత్రాలు జారీ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సర్కారు యోచిస్తోంది. ఇందుకోసం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని ఆలోచిస్తోంది. వర్గీకరణ అనంతరం అత్యంత వెనుకబడిన వర్గాలకే వర్గీకరణ ఫలాలు అందాలంటే కుల ధ్రువీకరణ పత్రం ఎంతో కీలకమైంది.
ఎస్సీ వర్గీకరణలో భాగంగా గ్రూప్-1లో సామాజికంగా, ఆర్ధికంగా, విద్యా పరంగా, అత్యంత వెనుకబడిన 15కులాల వారికి (3.288శాతం జనాభా) 1శాతం, గ్రూప్-2లో మాదిగలు, మాదిగ ఉపకులాలలుగా ఉన్న 18 కులాల (62.748శాతం) వారికి 9శాతం, గ్రూప్-3లో మాలలు, మాల ఉపకులాలుగా ఉన్న (33.963శాతం జనాభా) 26 కులాల వారికి 5శాతం చొప్పున రిజర్వేషన్‌ను కేటాయించిన విషయం తెలిసిందే. గ్రూప్-1లో 1,71,625 మంది, గ్రూప్-2లో 32,74,377 మంది, గ్రూప్-3లో 17,71,1682 మంది జనాభా ఉన్నారు. గ్రూప్-1లో ఉన్న 1.71 లక్షల మందిలో బుడగ జంగాల కులస్తులే 1.12 లక్షల మంది ఉండగా, బాపురి, చచాటి, డక్కలి, డొక్కాల్వార్, జగ్గలి, కొలుపులవాండ్లు, పంబాడ, పంబండి, పంబాల, మాంగ్, మాంగ్‌గరోడి, మన్నె, మప్తీ, మాతంగి, మెహతర్, మండాల, సంబన్, సప్రు ఉపకులాలన్నీ కలిపి 59 వేల మంది ఉన్నారు. గ్రూప్-1లోని ఈ కులాల వారిని గుర్తించి, కుల ధ్రువీకరణ పత్రాలను ఎలా ఇస్తారనేదే పెద్ద సమస్య అని దళిత యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు బొబ్బిళ్లపాటి బాబురావు పేర్కొన్నారు. ఈ ఉపకులాలకు కేటాయించిన రిజర్వేషన్‌ను ఇతర గ్రూప్‌లకు చెందిన వర్గాలు కొల్లగొట్టే ప్రమాదం లేకపోలేదని ఆందోళన వ్యక్తం చేశారు.
కులగణనే పరిష్కారం చూపనుందా?
ఎస్సీ సామాజికవర్గంలో వెనుకబడిన వర్గాలను గుర్తించేందుకు కులగణన గణాంకాలను ప్రామాణికంగా తీసుకోవాలని సర్కారు భావిస్తోంది. ఉదాహరణకు ఒక జిల్లాలోని మండల పరిఽధిలో ఎస్సీ ఉపకులమైన డక్కలి సామాజికవర్గ జనాభా ఉంటే.. సంబంధిత మండల రెవెన్యూ అధికారికి ఆ సమాచారం అందుబాటులో ఉంటుంది. ఒక వేళ ఆ మండల పరిధిలో మస్తీ ఉపకులస్తులు ఒక్కరూ లేరనుకుంటే.. ఆ విషయమూ తహసీల్దార్‌కు తెలిసేలా ఏర్పాట్లు చేయనున్నారు. అంటే.. కుల ధ్రువీకరణ పత్రం జారీ చేసేముందే తన మండల పరిఽధిలో ఏయే ఉపకులాలున్నాయో తహసీల్దార్‌కు ముందే సమాచారం ఉంటుం ది. దాంతో అర్హులైన వారికే సర్టిఫికెట్లు జారీ అవు తాయని సచివాలయ అధికారులు చెబుతున్నారు.
అఫిడవిట్లు తీసుకోవాలి
ఎస్సీ కులాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాల జారీలో సర్కారు జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే వర్గీకరణ ఫలాలు వెనుకబడిన వర్గాలకు దూరమయ్యే ప్రమాదం ఉంది. నియామకాల సమయంలో కచ్చితంగా అఫడవిట్లు తీసుకోవాలి. తప్పుడు పత్రం ఇస్తే... ఉద్యోగం నుంచి తీసేయడంతోపాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.
- మల్లేశం, ఓయూ ప్రొఫెసర్, హైదరాబాద్