Share News

రాష్ట్ర వ్యాప్తంగా బిల్డ్‌ నౌ

ABN , Publish Date - Apr 25 , 2025 | 04:25 AM

భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియను సులభతరం చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన అప్లికేషన్‌ ‘బిల్డ్‌ నౌ’ రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి వచ్చింది.

రాష్ట్ర వ్యాప్తంగా బిల్డ్‌ నౌ

  • భవన నిర్మాణ అనుమతులు ఇక ఆ ప్లాట్‌ఫామ్‌ ద్వారానే

  • గురువారం సాయంత్రం నుంచి అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం

  • జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలో సానుకూల ఫలితాలతో నిర్ణయం

హైదరాబాద్‌, ఏప్రిల్‌, 24(ఆంధ్రజ్యోతి): భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియను సులభతరం చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన అప్లికేషన్‌ ‘బిల్డ్‌ నౌ’ రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి వచ్చింది. గురువారం సాయంత్రం 5 గంటల నుంచి అన్ని మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల పరిధిలో ఉన్న పట్టణ ప్రణాళిక విభాగాలు బిల్డ్‌నౌ ద్వారానే భవన నిర్మాణ అనుమతులు జారీ చేయాలని ఆదేశాలు జారీ చేశామని డీటీసీపీ దేవేందర్‌ రెడ్డి తెలిపారు. ఈ అధునాతన అప్లికేషన్‌ బిల్డ్‌నౌను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మార్చి 20న ప్రారంభించారు. కృత్రిమ మేథ(ఏఐ), బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ, ఆగ్యుమెంటెడ్‌ రియాలిటీ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భవన నిర్మాణ అనుమతులు ఇచ్చేలా బిల్డ్‌నౌ ఫ్లాట్‌ఫాంను రూపొందించారు. తొలుత ఈ విధానాన్ని జీహెచ్‌ఎంసీ పరిధిలో అమలు చేసి 950 దరఖాస్తులకు అనుమతించారు.


సానుకూల పలితాలు ఇవ్వడంతో ఏప్రిల్‌ 19 నుంచి హెచ్‌ఎండీఏ పరిధిలో అమలు చేశారు. భవన డ్రాయింగ్స్‌(మ్యాప్‌, ప్లాన్‌ )పరిశీలనను నూతన విధానం సులభతరం చేసింది. టీజీ బిపాస్‌ పోర్టల్‌ ద్వారా గతంలో డిజైన్ల అనుమతుల కోసం రోజుల తరబడి వేచి ఉండే పరిస్థితి ఉండేది. కానీ, బిల్డ్‌నౌ ద్వారా 30 సెకన్ల వ్యవధిలో డిజైన్ల పరిశీలన పూర్తి చేస్తున్నారు. ప్రయోగాత్మకంగా ఖాజాగూడ సర్కిల్‌ పరిధిలో వివిధ నిర్మాణాలకు అనుమతులిచ్చారు. సాంకేతిక పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో గురువారం సాయంత్రం నుంచి బిల్డ్‌నౌను రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ విధానాన్ని అమలు చేసేందుకు పట్టణ ప్రణాళిక విభాగంలో సుమారు 1500 మందికి శిక్షణ కూడా ఇచ్చారు. కాగా, గతంలో టీజీ బిపాస్‌ ద్వారా దరఖాస్తుల పరిశీలనకు నెల రోజుల పాటు వేచి ఉండే పరిస్థితి ఉండేదని, బిల్డ్‌నౌ ద్వారా 5 నిమిషాలలోనే దరఖాస్తుల పరిశీలన పూర్తవుతుందని అధికారులు కూడా చెబుతున్నారు.

Updated Date - Apr 25 , 2025 | 04:25 AM