Share News

Engineering Admissions: ఎప్‌సెట్‌ మొదటివిడతలో 93% సీట్ల భర్తీ

ABN , Publish Date - Jul 19 , 2025 | 04:02 AM

ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఎప్‌సెట్‌ మొదటివిడత సీట్ల కేటాయింపు ప్రక్రియ ముగిసింది. కౌన్సెలింగ్‌కు సంబంధించి సీట్ల కేటాయింపును సాంకేతిక విద్యాశాఖ శుక్రవారం ప్రకటించింది.

Engineering Admissions: ఎప్‌సెట్‌ మొదటివిడతలో 93% సీట్ల భర్తీ

సీఎస్‌‌ఈలో 97%, ఈసీఈలో 92% పూర్తి.. కోర్‌ ఇంజనీరింగ్‌ కోర్సులకు పెరిగిన డిమాండ్‌

  • సివిల్‌లో 80% దాటిన అడ్మిషన్లు

  • మొత్తం 77,561 మందికి ఇంజనీరింగ్‌ సీట్ల కేటాయింపు

  • కేటాయింపుల్లో అబ్బాయిలు 54%, అమ్మాయిలు 46%

  • 16,793 మందికి దక్కని సీట్లు

  • ఇంజనీరింగ్‌ మొదటివిడత సీట్ల కేటాయింపు పూర్తి

హైదరాబాద్‌, జూలై 18(ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఎప్‌సెట్‌ మొదటివిడత సీట్ల కేటాయింపు ప్రక్రియ ముగిసింది. కౌన్సెలింగ్‌కు సంబంధించి సీట్ల కేటాయింపును సాంకేతిక విద్యాశాఖ శుక్రవారం ప్రకటించింది. కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేసే కన్వీనర్‌ కోటాలో మొత్తం 83,054 సీట్లుండగా.. మొదటివిడతలో మొత్తం 77,561 సీట్లు భర్తీ అయ్యాయి. మొత్తం సీట్లలో ఇది 93.3ు. ఇంకా 5,493 సీట్లు మిగిలిఉన్నాయి. ఉన్నత వర్గాల్లోని పేదలకు ఉద్దేశించిన ఈడబ్ల్యుఎస్‌ కోటాలో 6,083 మంది సీట్లు సాధించారు. మొత్తం సీట్లు పొందినవారిలో 41,924(54.1ు) మంది అబ్బాయిలు కాగా, 35,637(45.9ు) మంది అమ్మాయిలున్నారు. 12న ప్రకటించిన మాక్‌ సీట్‌ అలాట్‌మెంట్‌లో 77,154 మందిసీటు సాధించారు. మార్పులు చేర్పులకు 2 రోజులు అవకాశమివ్వగా.. వీరిలో 36,544 (47.36ు) మంది ఇతర కాలేజీలు, బ్రాంచ్‌లను మార్చుకున్నారు. విద్యార్థులు 22లోపు ట్యూషన్‌ ఫీజు చెల్లించాలని, లేనిపక్షంలో సీటు రద్దుచేస్తామని ఎప్‌సెట్‌ కన్వీనర్‌, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన పేర్కొన్నారు. మొదటి విడతలో సీటు సాధించి, ట్యూషన్‌ ఫీజు చెల్లించకుండా రెండో విడతలో పాల్గొంటే మొదటి విడత సీటు రద్దవుతుందన్నారు.


సీఎ్‌సఈకి సమానంగా కోర్‌

ఈసారి కోర్‌ ఇంజనీరింగ్‌ కోర్సుల సీట్లు ఎక్కువగా భర్తీ అయ్యాయి. కోర్‌ బ్రాంచ్‌లు-- ఎలక్ట్రికల్‌, ఎలకా్ట్రనిక్స్‌, సివిల్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన వారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండటం, భవిష్యత్తుల్లోనూ భారీ డిమాండ్‌ ఏర్పడుతుందని తెలంగాణ ఉన్నత విద్యామండలి విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించిది. ఈ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు ఉపాధి అవకాశాలకు ప్రత్యేకంగా సంబంధిత కంపెనీలతో ఉన్నత విద్యామండలి ఒప్పందాలు కుదుర్చుకుంది. దీంతో ఈసారి సీఎ్‌సఈతో సమానంగా ఈసీఈలో సీట్లు భర్తీ అయ్యాయి. సీఎ్‌సఈలోని మొత్తం 17 బ్రాంచ్‌లలో 58,742 సీట్లుండగా.. 57,042(97.11%) భర్తీ అయ్యాయి. ఈ విభాగంలో 1,700 సీట్లు మాత్రమే మిగిలాయి. అయితే ఈసారి ఈసీఈలో మొదటివిడతలోనే 90 శాతానికి పైగా సీట్లు భర్తీ అయ్యాయి. ఈ విభాగంలో మొత్తం 10,967 సీట్లుండగా.. 10,099(92.09%) పూర్తయ్యాయి. ట్రిపుల్‌-ఈలో 4,695 సీట్లలో 3,519(74.95%), మెకానికల్‌లో 3,230లో 2,401 (74.33ు) భర్తీ అయ్యాయి. కొన్నేళ్లుగా సివిల్‌ ఇంజనీరింగ్‌కు డిమాండ్‌ తగ్గుతూ వస్తోంది. గత ఏడాది 63.36ు సీట్లు మాత్రమే భర్తీ కాగా.. ఈసారి మొదటి విడతలోనే 80ు సీట్ల కేటాయింపులు జరగడం గమనార్హం..! సివిల్‌లో మొత్తం 3,376 సీట్లుండగా.. 2,756(81.64ు) భర్తీ అయ్యాయి.


ప్రైవేటు కాలేజీల్లో 94%, వర్సిటీల్లో 84% భర్తీ

ఈసారి మొదటివిడతలో ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో మొత్తం 75,384 సీట్లలో 70,959 (94.1%) భర్తీ అయ్యాయి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ యూనివర్సిటీల్లోని 20 కాలేజీల్లో 6,108 సీట్లు ఉండగా 5,151(84.3%) భర్తీ అయ్యాయి. రెండు ప్రైవేటు యునివర్సిటీల్లో 1,367 సీట్లలో 1,357(99.2ు), రాష్ట్రంలో ఉస్మానియాలోని ఏకైక ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కాలేజీలో మొత్తం 195 సీట్లలో 94(48.4ు) భర్తీ అయ్యాయి.


జేఎన్‌టీయూ కాలేజీనే కింగ్‌?

హైదరాబాద్‌ సిటీ, జూలై 18 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌ విద్యలో జేఎన్‌టీయూనే రారాజు అన్న విషయం మరోసారి రుజువైంది. ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్‌లో తొలివిడత సీట్ల కేటాయింపులో.. టాప్‌ ర్యాంకర్లలో అత్యధికులు జేఎన్‌టీయూ కాలేజీనే ఎంచుకున్నారు. టాప్‌-100 ర్యాంకర్లలో ముగ్గురు, టాప్‌-వెయ్యి ర్యాంకర్లలో 64 మంది క్యాంపస్‌ కాలేజీల్లోని వివిధ ఇంజనీరింగ్‌ కోర్సులను ఎంచుకున్నారు. క్యాంపస్‌ కాలేజీలోని 11 ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌లలో 618 సీట్లుండగా, అన్నీ భర్తీ అయిపోవడం విశేషం..! ఈ కాలేజీలో అనుభవజ్ఞులైన ఆచార్యులు, మెరుగైన వసతి, రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల వార్షిక ప్యాకేజీతో క్యాంపస్‌ ఇంటర్వ్యూలు లభించడం వంటి అంశాలు టాపర్లను జేఎన్‌టీయూవైపు ఆకట్టుకుంటున్నాయి. ఈ కాలేజీలో హైఎండ్‌ ప్లేస్‌మెంట్‌కు ఢోకా లేదని కంప్యూటర్‌ సైన్స్‌ విభాగం సీనియర్‌ ప్రొఫెసర్‌ వి.కామాక్షి ప్రసాద్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.

ఏ కోర్సులో ఎన్ని సీట్లు..?

కోర్సు మొత్తం సీట్లు భర్తీ (%)

సీఎ్‌సఈ 28,246 27,657 97.91

సీఎ్‌సఈ ఏఐ-ఎంఎల్‌ 13,540 13,093 96.70

సీఎ్‌సఈ డాటాసైన్స్‌ 7,600 7,295 95.99

సీఎ్‌సఈ ఐటీ 3,960 3,849 97.20

సీఎ్‌సఈ ఏఐ-డాటా సైన్స్‌ 1,301 1,276 98.08

ఈసీఈ 10,967 10,099 92.09

ఈఈఈ 4,695 3,519 74.95

సివిల్‌ ఇంజనీరింగ్‌ 3,376 2,756 81.64

మెకానికల్‌ ఇంజనీరింగ్‌ 3,230 2,401 74.33

మొత్తం 83,054 77,561 93.39

Updated Date - Jul 19 , 2025 | 04:02 AM