నేడు టీజీ ఎప్‌సెట్-2025 నోటిఫికేషన్
ABN , Publish Date - Feb 20 , 2025 | 04:15 AM
తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఎప్‌సెట్-2025 నోటిఫికేషన్ గురువారం విడుదల చేయనున్నట్లు సెట్ కన్వీనర్ వెల్లడించారు.
నాన్‌లోకల్ కేటగిరీ ప్రవేశాలపై స్పష్టత ఇవ్వని సర్కారు
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఎప్‌సెట్-2025 నోటిఫికేషన్ గురువారం విడుదల చేయనున్నట్లు సెట్ కన్వీనర్ వెల్లడించారు. నాన్‌లోకల్ కేటగిరీ ప్రవేశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో కొన్ని షరతులకు లోబడి నోటిఫికేషన్ జారీ చేసేందుకు అధికారులు సిద్ధమైనట్లు తెలిసింది. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లయిన నేపథ్యంలో తెలంగాణ ఎప్‌సెట్‌కు ఏపీ విద్యార్థులను నాన్‌లోకల్ కేటగిరీలో అనుమతించాలా? లేదా? అనే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జారీ చేయబోయే ఉత్తర్వుల మేరకే నాన్‌లోకల్ కేటగిరీ ప్రవేశాలుంటాయని నోటిఫికేషన్‌లో పేర్కొనే అవకాశం ఉంది.
మరోవైపు రాష్ట్ర అటవీశాఖ ఆధ్వర్యంలోని కళాశాల్లో బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సులో ప్రవేశాలపైనా అయోమయ పరిస్థితి నెలకొంది. గతేడాది వరకు ఈ కోర్సులో ప్రవేశాలను ఎప్‌సెట్ ర్యాంకుల ఆధారంగా చేపట్టగా, ఈ ఏడాది అటవీశాఖే స్వయంగా ప్రవేశపరీక్ష నిర్వహించాలని భావించింది. అయితే ఈ మేరకు బుధవారం వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర్వులు రాలేదు. ఎప్‌సెట్‌లో బీఎస్సీ ఫారెస్ట్రీ ప్రవేశాల అంశాన్ని ప్రస్తావిస్తారా, లేదా అనే దానిపై అయోమయం నెలకొంది.