Share News

12 నుంచి బడ్జెట్‌ సమావేశాలు!

ABN , Publish Date - Mar 07 , 2025 | 03:52 AM

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 12న గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రసంగంతో మొదలవుతాయి. అయితే సమావేశాలు ఎప్పటిదాకా కొనసాగుతాయనేది 13న జరిగే అసెంబ్లీ బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ సమావేశం నిర్ణయించనుంది.

12 నుంచి బడ్జెట్‌ సమావేశాలు!

  • వర్గీకరణ, బీసీ బిల్లులకు ఆమోదం

  • ఒకట్రెండోజుల విరామమిచ్చి సీఎం నేతృత్వంలో ఢిల్లీకి అఖిలపక్షం

  • ఆ తర్వాతే బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న సర్కారు

హైదరాబాద్‌, మార్చి 2(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 12న గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రసంగంతో మొదలవుతాయి. అయితే సమావేశాలు ఎప్పటిదాకా కొనసాగుతాయనేది 13న జరిగే అసెంబ్లీ బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ సమావేశం నిర్ణయించనుంది. సచివాలయంలో గురువారం జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్లు సమాచారం. తొలి రోజున గవర్నర్‌ ప్రసంగం ఉండగా.. ఆ తర్వాత రోజు ఆ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, సమాధానం ఉంటాయి. అనంతరం ఎస్సీ వర్గీకరణ, స్థానిక సంస్థలు.. విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ బిల్లులను అసెంబ్లీలో ప్రవేశ పెట్టి.. చర్చించి ఆమోదిస్తారు. బీసీ రిజర్వేషన్‌ను పెంచుకునేందుకు వీలుగా రాజ్యాంగాన్ని సవరించాలంటూ కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించనున్నారు. అనంతరం సభకు ఒకటి, రెండు రోజులు విరామం ఇచ్చి.. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన అఖిలపక్షం ఢిల్లీకి వెళ్లనుంది. ప్రధానిని కలిసి అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని ఇవ్వనుంది. సమావేశాలు పునఃప్రారంభమయ్యాక రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. ఈ నెలఖరులోగా ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం లభించనుంది.


బిల్లులు, ఇతర అంశాలపై సుదీర్ఘ చర్చ

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశల్లో కీలకమైన బిల్లులు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ అంశాలపైన సుదీర్ఘంగా క్యాబినెట్లో చర్చ జరిగింది. అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులును కూడా పిలిపించుకుని మాట్లాడారు. అసెంబ్లీ నిర్వహణపైన ఆయనకు సూచనలిచ్చారు. కీలకమైన బిల్లులు, కులగుణన సర్వేలతో పాటుగా 50 అంశాలపైన సుదీర్ఘంగా మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకుంది. కాగా, భేటీ ముగిసిన తర్వాత అధికారులను బయటికి పంపేసిన మంత్రులు..రాజకీయ, ఇతర అంశాలపైనా చర్చించుకున్నట్లు సమాచారం. పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఓటమిపైనా విశ్లేషణ చేసినట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల తరహాలోనే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీకి బీఆర్‌ఎస్‌ సహకరించిందని, కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థి ఓట్లను చీల్చారన్న అవగాహనకు వచ్చినట్లు సమాచారం.

Updated Date - Mar 07 , 2025 | 03:52 AM