Ration Cards: స్మార్ట్ రేషన్ కార్డులు!
ABN , Publish Date - Mar 13 , 2025 | 05:16 AM
రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి రంగం సిద్ధమవుతోంది. కొత్త కార్డులతో పాటు, ఇప్పటికే ఉన్న కార్డుల స్థానంలో క్యూఆర్ కోడ్‌తో ఉన్న స్మార్ట్ రేషన్‌కార్డులను అందించేందుకు పౌరసరఫరాల శాఖ సన్నాహాలు చేస్తోంది.

ఏటీఎం కార్డు తరహాలో రూపకల్పన
పీవీసీ కార్డుపై క్యూ ఆర్ కోడ్, రాష్ట్ర ప్రభుత్వ లోగో సహా కుటుంబ పెద్ద పేరు
1.20 కోట్ల కార్డుల ముద్రణకు టెండర్లు ఆహ్వానించిన పౌర సరఫరాల శాఖ
25వ తేదీ వరకు దాఖలుకు అవకాశం
హైదరాబాద్, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి రంగం సిద్ధమవుతోంది. కొత్త కార్డులతో పాటు, ఇప్పటికే ఉన్న కార్డుల స్థానంలో క్యూఆర్ కోడ్‌తో ఉన్న స్మార్ట్ రేషన్‌కార్డులను అందించేందుకు పౌరసరఫరాల శాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు కొత్త కార్డుల ముద్రణ కోసం మంగళవారమే టెండర్లను ఆహ్వానించగా.. 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల దాకా టెండర్ల దాఖలుకు అవకాశం కల్పించింది. ఈ నెల 26న సాంకేతిక, ఆర్థిక బిడ్‌లను తెరిచి, అర్హత సాధించిన వారికి కార్డుల ముద్రణ బాధ్యతలు అప్పగించనుంది. ఇందుకోసం 56 పేజీలతో కూడిన రిక్వస్ట్ ఫర్ ప్రపోజల్‌ను (ఆర్‌ఎ్‌ఫపీ) టెండర్ నోటీసుతోపాటు జత చేసింది. కొత్తగా అందించనున్న రేషన్ కార్డులు గతంలో కంటే భిన్నంగా ఉండనున్నాయి. సైజు, కార్డుపై ముద్రించే వివరాల్లోనూ పౌరసరఫరాల శాఖ పలు మార్పులు చేసింది. ఈ మేరకు కొత్త కార్డుల ముద్రణ కోసం ఇచ్చిన టెండర్ నోటీసులో ఆ వివరాలను పేర్కొంది. కొత్త కార్డులపై కుటుంబ పెద్ద పేరు మినహా ఎవరి ఫొటోలనూ పెట్టడం లేదు. 760 మైక్రాన్స్ మందం, 85.4మి.మీ పొడవు, 54మి.మీ వెడల్పు ఉండే పీవీసీ కార్డుపై రేషన్ కార్డు వివరాలను పొందుపర్చనున్నారు. దీని ప్రకారం కొత్త రేషన్‌కార్డు ఏటీఎమ్ కార్డు సైజులో ఉండనుంది.
కార్డుకు ఒకవైపు ప్రభుత్వ లోగో, కుటుంబ పెద్ద వివరాలు, హోలోగ్రామ్, మరోవైపు కార్డుదారుడి పూర్తి చిరునామా, క్యూఆర్ కోడ్ ముద్రించనున్నారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి కోటి, దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్న వారికి 20లక్షల చొప్పున మొత్తం 1.20కోట్ల రేషన్ కార్డుల ముద్రణకు పౌరసరఫరాల శాఖ టెండర్లు పిలిచింది. కార్డుల సరఫరా పూర్తయ్యే వరకు లేదా రెండేళ్ల పాటు ఈ ఒప్పందం అమలులో ఉంటుంది. కొత్త కార్డుల ముద్రణకు అయ్యే ఖర్చును పూర్తిగా తామే చెల్లిస్తామని టెండరు నోటీసులో పౌరసరఫరాల శాఖ తెలిపింది. బోగస్, నకిలీ కార్డులకు చెక్ పెట్టేందుకే క్యూ ఆర్ కోడ్ విధానాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్టు తెలిసింది. క్యూఆర్ కోడ్‌తో ఇచ్చే కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చాలన్నా, తొలగించాలన్నా పెద్దగా ఇబ్బందేమీ ఉండదని, మార్పులు చేసిన వెంటనే కొత్త క్యూఆర్ కోడ్‌ను జనరేట్ చేసి ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని అధికారిక వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 89,95,282 రేషన్‌కార్డులు ఉన్నాయి. వీటిలో కేంద్రం ఇచ్చినవి (నేషనల్ ఫుడ్ సెక్యురిటీ కార్డు) 48,51,075, రాష్ట్రం ఇచ్చినవి (స్టేట్ ఫుడ్ సెక్యురిటీ కార్డు) 41,44,207 ఉన్నాయి. కొత్త రేషన్ కార్డుల కోసం, ఇప్పటికే ఉన్న కార్డుల్లో కొత్త సభ్యులను చేర్చడం కోసం దాదాపుగా 18 లక్షల దరఖాస్తులు ప్రభుత్వానికి వచ్చాయి. వీటిలో అర్హులైన వారందరికీ రేషన్‌కార్డులను ఇవ్వడంతోపాటు, కార్డుల్లో కొత్త కుటుంబ సభ్యుల పేర్లు చేర్చే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సర్కారు నిర్ణయించింది.
కొత్త స్మార్ట్ కార్డు ఇలా..
ముందువైపు: తెలంగాణ ప్రభుత్వ లోగో, రేషన్‌కార్డు నంబర్, కుటుంబ పెద్ద పేరు, రేషన్ షాపు నంబర్, హోలోగ్రామ్, సంబంధిత అధికారి సంతకం
వెనుక వైపు: జిల్లా పేరు, మండలం, గ్రామం, క్యూ ఆర్ కోడ్, రేషన్ కార్డుదారుడి చిరునామా