Aarogyasri: ఆరోగ్యశ్రీ పరిధిలోకి కొత్తగా 30లక్షల మంది
ABN , Publish Date - Jul 27 , 2025 | 03:48 AM
రాష్ట్రంలో కొత్తగా 30 లక్షల మంది రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిఽధిలోకి రాబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీ చేయడంతో వీరంతా ఆ పథకం కిందికి రానున్నారు.
నూతన రేషన్ కార్డులతో పెరగనున్న సంఖ్య
ఆరోగ్యశ్రీతో కార్డుల అనుసంధాన ప్రక్రియ
ట్రస్టు కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు
పౌరసరఫరాలశాఖతో సమన్వయం
హైదరాబాద్, జూలై 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా 30 లక్షల మంది రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిఽధిలోకి రాబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీ చేయడంతో వీరంతా ఆ పథకం కిందికి రానున్నారు. కొత్తగా రేషన్ కార్డు తీసుకుంటున్న వారిలో అర్హులైన లబ్ధిదారులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు వైద్యశాఖ కసరత్తు చేస్తోంది. అందుకోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసింది. ఈసెల్ ద్వారా పౌరసరఫరాల శాఖతో సమన్వయం చేసుకుని కొత్తగా రేషన్ కార్డులు మంజూరు అయిన వారి వివరాలతోపాటు.. పాత రేషన్ కార్డులో కొత్తగా చేరిన కుటుంబ సభ్యుల వివరాలను ఆరోగ్యశ్రీలో నమోదు చేస్తారు. రాష్ట్రంలో కొత్తగా 5.61లక్షల మందికి రేషన్ కార్డులు జారీ చేయగా.. వీటి ద్వారా 27.87 లక్షల మంది సభ్యులుగా చేరారు. ఇవిగాక ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులలో అదనపు కుటుంబ సభ్యుల నమోదుతో ఆ సంఖ్య సుమారుగా 30 లక్షలకు చేరుకోనుంది. ఆరోగ్యశ్రీతో కొత్త రేషన్ కార్డుల అనుసంధానానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆరోగ్య శ్రీ ట్రస్ట్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ముఖ్యం గా పేదలు ఎటువంటి ఇబ్బంది పడకుండా, తమ జేబుల నుంచి ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యసేవలు అందాలంటే రేషన్ కార్డుకు, ఆరోగ్యశ్రీకి అనుసంధానం అయి ఉండాలని ఆయన సూచించినట్లు సమాచారం. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రేషన్ కార్డుల పంపిణీ, ఆరో గ్య శ్రీ అనుసంధాన ప్రక్రియను కూడా వీలైనంత వేగంగా పూర్తి చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి కూడా అధికారులను ఆదేశించారు. వాస్తవానికి ఆరోగ్యశ్రీకి, రేషన్‌కార్డుకు ఎటువంటి లింకు లేకుం డా చూడాలని తొలుత ప్రభుత్వం భావించింది. అయితే సాంకేతిక కారణాలతో పాటు పరిస్థితుల ప్రభావం దృష్ట్యా రెండింటికి అనుసంధానం చేయ డం తప్పడంలేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
3.14 కోట్లకు పెరగనున్న లబ్ధిదారులు
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 90.10 లక్షల కుటుంబాలు ఆరోగ్య శ్రీ పరిధిలోకి వస్తుండగా, 2.84 కోట్ల మంది అర్హులుగా ఉన్నారు. తాజా కొత్త రేషన్ కార్డుల లబ్ధిదారుల కుటుంబాలతో కలిపి ఆరోగ్యశ్రీ కార్డుల సంఖ్య సుమారు 95-96 లక్షలకు పెరగనుంది. అలాగే లబ్ధిదారుల సంఖ్య సుమారు 3.14 కోట్లకు చేరనుంది. దీంతో పాటు కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ కూడా తెలంగాణలో అమలవుతున్నది. గతంలోనే ఆరోగ్య శ్రీ, ఆయుష్మా న్ భారత్ పథకాలను కలిపి అమలు చేస్తున్నారు. దీంతో వైద్య చికిత్సల సంఖ్య 1835కు చేరింది. అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిఽధిలోకి 1042 ప్రభుత్వ, 461 ప్రైవేటు ఆస్పత్రులు వచ్చాయి.
ఈవార్తలు కూడా చదవండి..
పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు..
సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో ఘోర తప్పిదం.. పోలీసుల కేసు నమోదు
Read latest Telangana News And Telugu News