Share News

Housing Board: హౌసింగ్‌ బోర్డు స్థలాల వేలం

ABN , Publish Date - Jun 04 , 2025 | 05:08 AM

రాష్ట్ర హౌసింగ్‌ బోర్డు పరిధిలో ఉన్న ఓపెన్‌ ప్లాట్లను వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇందిరమ్మ ఇళ్ల పథకానికి వినియోగించనున్నారు.

Housing Board: హౌసింగ్‌ బోర్డు స్థలాల వేలం

హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో ఉన్నవన్నీ

రూ.500-600 కోట్ల ఆదాయం అంచనా

హైదరాబాద్‌, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హౌసింగ్‌ బోర్డు పరిధిలో ఉన్న ఓపెన్‌ ప్లాట్లను వేలం వేయాలని సర్కారు నిర్ణయించింది. దీంతో హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో బోర్డు పరిధిలో ఉన్న ప్లాట్లన్నింటినీ వేలం వేసేందుకు రంగం సిద్ధమైంది. వేలం ద్వారా రూ.500 - 600 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బోర్డు పరిధిలో ఉన్న ఓపెన్‌ ప్లాట్ల వివరాలతో ఇప్పటికే నివేదికలను రూపొందించారు. అదే విధంగా ఆయా ప్లాట్ల వేలానికి సంబంధించి కూడా ప్రాఽథమికంగా కొన్ని ధరలను నిర్దేశించుకున్నారు. ఇప్పటికే మహబూబ్‌నగర్‌, కూకట్‌పల్లిలోని ప్లాట్ల వేలానికి ప్రకటనలు ఇవ్వగా, త్వరలో వాటికి వేలం నిర్వహించనున్నారు. మిగిలిన వాటికి ఈ నెలాఖరులోపు ప్రకటనలు ఇచ్చి.. ఆగస్టు-సెప్టెంబరు నాటికి వేలం ప్రక్రియను ముగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిసింది. కాగా, కూకట్‌పల్లిలో 18 వరకు ప్లాట్లుండగా.. వీటి వేలంతో దాదాపు రూ.150 కోట్ల వరకు ఆదాయం రావచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు వికారాబాద్‌ జిల్లా పరిఽధిలో పరిగి, రంగారెడ్డి జిల్లాలోని గచ్చిబౌలి, లక్ష్మీదేవిపల్లి, రావిర్యాల, గద్వాల, వరంగల్‌ జిల్లాలో ఉన్న ప్లాట్ల వేలానికి సంబంఽధించి త్వరలోనే ప్రకటనలు ఇచ్చేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.


వేలం ఆదాయం.. ఇందిరమ్మ ఇళ్లకు..

గృహ నిర్మాణ శాఖకు అనుబంధంగా ఉన్న హౌసింగ్‌ బోర్డు పరిధిలోని ఓపెన్‌ ప్లాట్లు, రాజీవ్‌ స్వగృహ పరిధిలో ఉన్న అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్లు, అసంపూర్తిగా ఉన్న టవర్లు, ఓపెన్‌ ప్లాట్ల వేలంతో వచ్చే ఆదాయాన్ని ఇందిరమ్మ ఇళ్ల పథకానికి వినియోగించాలని సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు దాదాపు రూ.22వేల కోట్ల వరకు అవసరమవుతోందని అంచనా..


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం చంద్రబాబుతో హీరో అక్కినేని నాగార్జున భేటీ

ఏపీ కేబినెట్ భేటీ.. ఎప్పుడంటే..

For Telangana News And Telugu news

Updated Date - Jun 04 , 2025 | 05:08 AM