Share News

Telangana to Approach Supreme Court: పోలవరం-నల్లమలసాగర్‌పై సుప్రీంకోర్టుకు!

ABN , Publish Date - Dec 13 , 2025 | 05:40 AM

పోలవరం నల్లమలసాగర్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది....

Telangana to Approach Supreme Court: పోలవరం-నల్లమలసాగర్‌పై సుప్రీంకోర్టుకు!

  • రాష్ట్రం తరఫున వాదించాలని అభిషేక్‌ సింఘ్విని కోరనున్న ప్రభుత్వం

హైదరాబాద్‌, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): పోలవరం-నల్లమలసాగర్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. పోలవరం-బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టును పక్కనపెట్టిన ఏపీ ప్రభుత్వం తాజాగా పోలవరం-నల్లమలసాగర్‌ను తెరమీదికి తీసుకొచ్చింది. అంతేకాకుండా గోదావరి-కావేరి అనుసంఽధానాన్ని నల్లమలసాగర్‌ నుంచే చేపట్టాలని ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దాంతో దీన్ని అడ్డుకునే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కేంద్రానికి లేఖలు కూడా రాసింది. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కు కూడా ఫిర్యాదు చేసింది. ఈ ప్రాజెక్టు అంశం రాష్ట్రంలో దుమారం రేపుతుండటంతో దీన్ని న్యాయస్థానంలోనే అడ్డుకోవాలనే ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

ఈ కేసులో తెలంగాణ తరఫున వాదించాలని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్విని ప్రభుత్వం కోరనుంది. దీనికోసం శనివారం న్యూఢిల్లీలో ఆయన నివాసంలో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి కలుసుకోనున్నారు. ప్రస్తుతం అంతరాష్ట్ర నది జలాల అంశాలపై మరో న్యాయవాది సీఎస్‌ వైథ్యనాథన్‌ వాదిస్తున్నారు. ఆయన స్థానంలో అభిషేక్‌ మను సింఘ్వికి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక ఏపీ ప్రభుత్వం పోలవరం-నల్లమలసాగర్‌ ప్రాజెక్టుపై చురుగ్గా ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రాజెక్టు ప్రాథమిక సాధ్యాసాధ్యాల నివేదిక(పీఎ్‌ఫఆర్‌)ను కేంద్ర జలశక్తి శాఖతో పాటు కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ)కి అందించి మదింపు చేయిస్తోంది. కేంద్రం కూడా సానుకూలంగా ఉండటంతో ఎలాగైనా సరే దీన్ని సుప్రీంకోర్టులో అడ్డుకునే ప్రయతాల్లో ప్రభుత్వం ఉంది. మరోవైపు ప్రాజెక్టు డీపీఆర్‌ను సిద్ధం చేయడానికి వీలుగా గతనెలలోనే ఏపీ టెండర్లు పిలిచింది.

పోలవరం నుంచి నల్లమలసాగర్‌కు తొలిదశలో, రెండో దశలో నల్లమలసాగర్‌ నుంచి సోమశిలకు, ఆ తర్వాత కావేరికి తరలించాలని యోచిస్తోంది. గోదావరి-కావేరి అనుసంధానం ప్రాజెక్టును ఇచ్చంపల్లి వద్ద రిజర్వాయర్‌ కట్టి తరలించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి గుర్తు చేసిన విషయం విదితమే. గత బీఆర్‌ఎస్‌ హయాంలో సమ్మక్కసాగర్‌ (తుపాకులగూడెం) నుంచి తరలించడానికి అప్పటి ప్రభుత్వం సమ్మతి తెలుపగా... కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రం ఇచ్చంపల్లి రిజర్వాయర్‌ కట్టి, అక్కడి నుంచి తరలించాలని సూచించింది. తెలంగాణ కొన్ని షరతులతో ఇచ్చంపల్లికి అంగీకారం తెలుపగా ఏపీ మాత్రం బేషరతుగా పోలవరం-నల్లమలసాగర్‌-సోమశిల-కావేరి చేపట్టాలని కేంద్రానికి గుర్తు చేయడం కలకలం రేపింది. దాంతో ఏపీ ప్రభుత్వం కేంద్రంలో భాగస్వామిగా కూడా ఉండటంతో ఏపీ ప్రతిపాదిత ప్రాజెక్టుకు కేంద్రం సానుకూల సంకేతాలు ఇవ్వడంతో దీన్ని అడ్డుకునే ప్రయత్నాల్లో తెలంగాణ ఉంది.

ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు హరీశ్‌రావు కీలక లేఖ

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి

Updated Date - Dec 13 , 2025 | 06:39 AM