Sridhar Babu: ఐటీ ఎగుమతుల్లో 17.98% వృద్ధి
ABN , Publish Date - Mar 02 , 2025 | 03:37 AM
ఇతర రాష్ట్రాలకు దీటుగా తెలంగాణ అన్ని రంగాల్లోనూ తన ప్రత్యేకతను చాటుతూ.. అభివృద్ధిలో దూసుకుపోతోందని మం త్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.
ఏఐ యుగంలో కొత్తగా ఆలోచిస్తేనే విజయం
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): ఇతర రాష్ట్రాలకు దీటుగా తెలంగాణ అన్ని రంగాల్లోనూ తన ప్రత్యేకతను చాటుతూ.. అభివృద్ధిలో దూసుకుపోతోందని మం త్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. సాఫ్ట్‌వేర్ ఎగుమతుల్లో జాతీయ సగటు వృద్ధి 8శాతంగా ఉందని.. తెలంగాణ వృద్ధి రేటు 17.98 శాతంగా నమోదైందని, ఐటీ రంగంలో రాష్ట్ర సత్తా తెలిపేందుకు ఈ గణాంకాలు చాలని ఆయన వ్యాఖ్యానించారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో శనివారం హెచ్‌ఐసీసీలో నిర్వహించిన సదస్సులో మంత్రి ప్రసంగించారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే తమ లక్ష్యమని, ఇది తేలికైన విషయం కాకపోయినా.. సీఎం రేవంత్ నేతృత్వంలో ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు.
ఏఐ, క్వాంటమ్, మెషీన్ లెర్నింగ్ తదితర కొత్త సాంకేతికతల సాయంతో సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారాలను చూపించే దిశగా ఆవిష్కర్తలు కొత్తగా ఆలోచించాలని కోరారు. ఏఐ లాంటి ఎమర్జింగ్ టెక్నాలజీ్‌సకు హబ్‌గా తెలంగాణను తీర్చిదిద్దుతున్నామన్నారు. ఎమర్జింగ్ టెక్నాలజీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామని, ఈ టెక్నాలజీ సాయంతో పౌర సేవలు ప్రజల ముంగిట తెచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.