Share News

CM Revanth Reddy: ఆర్థిక వృద్ధికి మేధోమథనం

ABN , Publish Date - May 22 , 2025 | 04:40 AM

తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక వృద్ధికి ‘తెలంగాణ రైజింగ్ విజన్ బోర్డు’ను ఏర్పాటు చేయనుంది. మేధావులు, నిపుణులతో కలిసి రాష్ట్ర అభివృద్ధికి కొత్త ప్రణాళికలు రూపొందించనున్నారు.

CM Revanth Reddy: ఆర్థిక వృద్ధికి మేధోమథనం

  • మేధావులు, నిపుణులతో త్వరలో ‘తెలంగాణ రైజింగ్‌ విజన్‌ బోర్డు’

  • రాష్ట్ర అభివృద్ధి, ఆర్థిక వృద్ధికి ప్రణాళికలు రూపొందించనున్న బోర్డు

  • 24న నీతి ఆయోగ్‌ భేటీలో బోర్డు గురించి ప్రస్తావించనున్న సీఎం

హైదరాబాద్‌, మే 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆర్థిక వృద్ధిని, ఆదాయాన్ని పెంచే మార్గాలను అన్వేషించేందుకు, వివిధ రంగాల్లో అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకుగాను ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు చేర్చుతూ, ఆయా అంశాలపై మేధోమథనం చేసేందుకు ‘తెలంగాణ రైజింగ్‌ విజన్‌ బోర్డు’ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రం ట్రిలియన్‌ డాలర్‌ ఆర్థిక వ్యవస్థగా ఎదిగేలా, దేశ జీడీపీలో ప్రస్తుతం ఉన్న రాష్ట్ర వాటాను మరింత పెంచేలా ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందుకోసం ‘తెలంగాణ రైజింగ్‌-2050’ పేరుతో ఒక లక్ష్యాన్ని పెట్టుకుంది. తాజాగా దీనికి అనుసంధానంగా ‘తెలంగాణ రైజింగ్‌ విజన్‌ బోర్డు’ను ఏర్పాటు చేయనుంది. ఈ బోర్డు ఏర్పాటుకు సంబంధించిన ప్రాథమిక కసరత్తు కూడా పూర్తయినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. వివిఽధ రంగాలకు చెందిన మేధావులు, నిపుణులు, ప్రముఖులను బోర్డులో నియమించాలని నిర్ణయించినట్లు, వారు ఎవరనే దానిపైనా ఇప్పటికే స్పష్టతకు వచ్చినట్లు సమాచారం. బోర్డు ఏర్పాటు, సభ్యుల నియామకం, వారు నిర్వర్తించాల్సిన విధులకు సంబంధించిన అంశాలన్నింటినీ సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా పరిశీలిస్తున్నారు. ఈ నెల 24న ఢిల్లీలోని భారత మండపంలో ‘వికసిత్‌ భారత్‌ 2047- రోల్‌ ఆఫ్‌ టీమ్‌ ఇండియా’ అనే అంశంపై నీతి ఆయోగ్‌ నిర్వహించే సమావేశంలో ‘తెలంగాణ రైజింగ్‌ విజన్‌ బోర్డు’ గురించి సీఎం రేవంత్‌ ప్రస్తావించనున్నట్టు తె లిసింది. అంతేకాకుండా రాష్ట్ర ఆర్థిక వృద్ధికి చేపడుతున్న నూతన విధానాలు, దేశ ఆర్థిక వ్యవస్థకు అందించే సహకారం గురించీ సీఎం వెల్లడించనున్నారు. అయితే ఆ సమావేశానికి ముందే బోర్డు ఏర్పాటుకు సంబంధించిన అంశాలను సీఎం స్వయంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.


అభివృద్ధే లక్ష్యంగా

భవిష్యత్తు అంశాలే లక్ష్యంగా తెలంగాణ రైజింగ్‌ విజన్‌ బోర్డు పనిచేస్తుందని స్పష్టమవుతోంది. 2023 నుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి పలు దేశాల నుంచి రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా.. సుమారు లక్ష ఉద్యోగాల కల్పనకు అవకాశం ఏర్పడింది. దేశీయంగా, అంతర్జాతీయంగా పెట్టుబడుల విషయంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంటోంది. అయితే పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకోవడమే కాకుండా.. పరిశ్రమలు నెలకొల్పేలా చర్యలు తీసుకోవ డం, రాష్ట్ర ఆర్థిక వృద్ధికి రూపొందించాల్సిన ప్రత్యేక ప్రణాళికలు ఈ బోర్డులో జరుగుతాయని సమాచారం. ఇప్పటికే ఐటీ, ఔషధ రంగం, పట్టణీకరణలో రాష్ట్రం ముందంజలో ఉంది. మరికొన్ని రంగాల్లోనూ అభివృద్ధి కోసం ఏం చేయాలి? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత వృద్ధిలోకి తీసుకొచ్చేదెలా? అనే అంశాలపై బోర్డులో మేధోమథనం చేస్తారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు ఉన్న మార్గాలను అన్వేషిస్తారు. భవిష్యత్తులో మరిన్ని కంపెనీలను హైదరాబాద్‌కు తీసుకురావడంతోపాటు ఇక్కడ కంపెనీల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను ప్రపంచానికి తెలియజేసేలా ప్రత్యేక కార్యాచరణను రూపొందించనున్నట్టు తెలిసింది. ఇందుకోసం తెలంగాణలో ఉన్న శాంతిభద్రతల అంశం, సమతుల్య వాతావరణ పరిస్థితులు సహా ముఖ్యమైన అంశాలతో సవివర నివేదికలు తయారు చేస్తారు. కాగా, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు, సంక్లిష్టతలను తగ్గించడం, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, పౌష్ఠికాహారం, మహిళా సాధికారత, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన అంశాలపై బోర్డు పనిచేయనుంది.


మేధావులు, ప్రముఖులతో సీఎం భేటీలు..

రాష్ట్ర ఆర్థిక వృద్ధి, ఆదాయాన్ని పెంచేందుకు ఉన్న మార్గాలు, ఆర్థిక క్రమశిక్షణ, పట్టణాభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, ఉపాఽధి అవకాశాల సృష్టి వంటి అంశాలపై మేధావులు, ప్రముఖులతో సీఎం రేవంత్‌ తరచూ సమావేశమవుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటైన మొదట్లోనే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మాజీ గవర్నర్‌ రఘురామ్‌రాజన్‌తోనూ రేవంత్‌ సమావేశమయ్యారు. తాజాగా ఆర్థికశాస్త్ర నిపుణుడు, నోబెల్‌ అవార్డు గ్రహీత అభిజిత్‌ బెనర్జీతోనూ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, అభివృద్ధి అంశాలపై చర్చించారు. ఆయనతో మాట్లాడుతున్న సందర్భంగానే తెలంగాణ రైజింగ్‌ విజన్‌ బోర్డు ఏర్పాటు గురించి సీఎం ప్రస్తావించారు. బోర్డులో భాగస్వామ్యం పంచుకోవాలని బెనర్జీని ఆహ్వానించగా ఆయన సుముఖత వ్యక్తం చేశారు. కాగా, బోర్డు చైర్మన్‌, సభ్యుల విషయంలోనూ స్పష్టత రావడంతోత్వరలోనే ప్రకటించనున్నట్టు సమాచారం.

Updated Date - May 22 , 2025 | 04:40 AM