Local Elections: ఎన్నికల కాలం!
ABN , Publish Date - Oct 02 , 2025 | 05:37 AM
రాష్ట్రంలో ఈనెల 9వ తేదీ నుంచి నాలుగు నెలల పాటు ఎన్నికల సీజనే. నవంబరు 11 వరకు పరిషత్, పంచాయతీ ఎన్నికలు......
నవంబరు 11 వరకు పరిషత్,పంచాయితీ ఎన్నికలు
డిసెంబరులో మునిసిపల్.. ఆ వెంటనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు
నవంబరులో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక !
బీసీ రిజర్వేషన్లపై 8న కోర్టు విచారణపైనే ఉత్కంఠ
50 శాతం మించొద్దని కోర్టు చెబితే.. కాంగ్రెస్ పార్టీ పరంగా ఇచ్చే యోచన
సంక్రాంతి తర్వాతే ‘విస్తరణ’.. నామినేటెడ్ పదవుల భర్తీ
క్షేత్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పదవుల పండుగ
హైదరాబాద్, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఈనెల 9వ తేదీ నుంచి నాలుగు నెలల పాటు ఎన్నికల సీజనే. నవంబరు 11 వరకు పరిషత్, పంచాయతీ ఎన్నికలు.. అవి ముగియగానే మునిసిపల్ ఎన్నికలు, అదే ఊపులో జీహెచ్‌ఎంసీ ఎన్నికలనూ వెంట వెంటనే నిర్వహించేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై 8న హైకోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చినా ఎన్నికలపై ముందుకే వెళ్లాలని సర్కారు భావిస్తోంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు 8న విచారణ చేపట్టనున్న నేపథ్యంలో కోర్టు స్పందన ఎలా ఉంటుందన్న ఉత్కంఠ నెలకొంది. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని హైకోర్టు స్పష్టం చేస్తే గనక.. కాంగ్రెస్ పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించి షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం జూమ్ ద్వారా టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్, మంత్రులతో నిర్వహించిన సమావేశంలో ఈ నెల 5 వరకు జెట్పీటీసీ సీట్లకు ఆశావహుల జాబితాలు పంపాలని సూచించినట్లు చెబుతున్నారు.
వరుస ఎన్నికలు
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 9న నోటిఫికేషన్ విడుదల మొదలుకుని, నవంబరు 11 వరకూ పరిషత్, పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో 80శాతానికి పైగా జెడ్పీ స్థానాలను వశం చేసుకునేందుకు అధికార కాంగ్రెస్ ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేసింది. పరిషత్, పంచాయితీ ఎన్నికలు ప్రక్రియ పూర్తి కాగానే మునిసిపల్ ఎన్నికలను నిర్వహించేందుకు సర్కారు సమాయత్తమవుతోంది. పరిషత్ ఎన్నికలు పూర్తి కాగానే మునిసిపాలిటీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే.. డిసెంబరు నెల మొత్తం మునిసిపల్ ఎన్నికల ప్రక్రియే కొనసాగుతుంది. జీహెచ్‌ఎంసీ పాలక మండలి పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరితో పూర్తి కానుంది. పరిషత్, పంచాయతీ.. మునిసిపల్ ఎన్నికల వేడిలోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలనూ నిర్వహించాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది. జనవరి - ఫిబ్రవరి నెలల్లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించేందుకు అవకాశం ఉంది. ఈ నెల చివర్లోగానీ.. నవంబరు మొదట్లో గానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది.
సంక్రాంతి తర్వాతే.. మంత్రివర్గ విస్తరణ
వచ్చే నాలుగు నెలల పాటు వరుసగా ఎన్నికల నేపథ్యంలో.. రాష్ట్రంలో అప్పటిదాకా ఎన్నికల కోడ్ కొనసాగనుంది. దీంతో సంక్రాంతి తర్వాతే మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. స్థానిక ఎన్నికల్లో మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరును పరిగణనలోకి తీసుకుని మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణను చేపట్టేందుకు అవకాశం ఉందని చెబుతున్నారు. నామినేటెడ్ పదవుల భర్తీలోనూ ఆయా నాయకులు స్థానిక ఎన్నికల్లో కనపరిచిన పనితీరును పరిగణనలోకి తీసుకోనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా స్థానిక ఎన్నికల ప్రక్రియ పూర్తయితే వార్డు మెంబర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్‌లు.. మునిసిపల్.. కార్పొరేషన్ చైర్మన్లు ఇలా వేల సంఖ్యలో నేతలు పదవులు పొందనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. స్థానిక ఎన్నికల్లో పదవులు దక్కని ముఖ్యనాయకులను వడపోసి కార్పొరేషన్ పదవులు కట్ట బెట్టడం రాష్ట్ర నాయకత్వానికీ తేలికవుతుందని చెబుతున్నారు. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వందలాది నామినేటెడ్ పోస్టుల భర్తీకీ లైన్ క్లియర్ అవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.