Nursing Council: నర్సింగ్ కౌన్సిల్.. పైసా వసూల్
ABN , Publish Date - Mar 04 , 2025 | 05:23 AM
నర్సుల ఐడెంటిటీ రిజిస్ట్రేషన్లు, రెన్యువల్స్‌లో భారీగా డబ్బులు దండుకోవడం, పాలనా వ్యవహారాల్లో అందినకాడికి నిధుల దోపిడీ.. ఇలా కౌన్సిల్‌లో అధికారుల అవినీతి అడ్డూ అదుపూ లేకుండా సాగుతోంది. రాష్ట్రంలో నర్సింగ్ విద్య భ్రష్టు పట్టడానికి నర్సింగ్ కౌన్సిల్ పరోక్షంగా కారణమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రైవేటు కాలేజీల నుంచి భారీగా లంచాలు.. నర్సుల రిజిస్ట్రేషన్లు, రెన్యువల్స్‌లో చేతివాటం
లెక్కలు చెప్పకుండా నిధుల దోపిడీ
పదేళ్లుగా ఉన్నతాధికారుల ఇష్టారాజ్యం
హైదరాబాద్, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ అనేక అక్రమాలకు నిలయంగా మారింది. ప్రైవేటు నర్సింగ్ కాలేజీల నుంచి పెద్దమొత్తంలో పైసలు వసూలు చేయడం, నర్సుల ఐడెంటిటీ రిజిస్ట్రేషన్లు, రెన్యువల్స్‌లో భారీగా డబ్బులు దండుకోవడం, పాలనా వ్యవహారాల్లో అందినకాడికి నిధుల దోపిడీ.. ఇలా కౌన్సిల్‌లో అధికారుల అవినీతి అడ్డూ అదుపూ లేకుండా సాగుతోంది. రాష్ట్రంలో నర్సింగ్ విద్య భ్రష్టు పట్టడానికి నర్సింగ్ కౌన్సిల్ పరోక్షంగా కారణమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో కొత్త నర్సింగ్ కాలేజీకి అనుమతులు వచ్చిన తర్వాత అధికారులు వరుసగా నాలుగేళ్లపాటు తనిఖీలు చేస్తారు. ఆ తర్వాత నాలుగేళ్లకోసారి తనిఖీలుంటాయి. తనిఖీలకు నర్సింగ్ కౌన్సిల్ నుంచి ఇద్దరు సభ్యులు, హెల్త్ వర్సిటీ నుంచి డాక్టర్లు వస్తారు. రెండుసార్లు తనిఖీలు చేసిన తర్వాత అడ్మిషన్లు ఇస్తారు. ఇక తనిఖీలకు వచ్చే వారిని కొత్త అల్లుడిలా చూసుకుంటామని ప్రైవేటు నర్సింగ్ కాలేజీలు చెబుతున్నాయి. వారికి హోటల్ రూమ్, భోజనం, కారు, ఖరీదైన వస్త్రాలతో పాటు పెద్దమొత్తంలో నగదు ఇస్తామని వెల్లడిస్తున్నాయి. అలా అయితేనే తమకు అనుకూలంగా రిపోర్టులు వెళతాయని.. ఇలా ఏటా రూ.లక్షల్లో సమర్పించుకోవాల్సి వస్తోందని అంటున్నాయి.
ఎన్‌ఆర్‌టీఎ్‌స పోర్టల్‌తో మోసం..
కోర్సులు పూర్తి చేసుకున్న నర్సులు నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంతకంటే ముందు వారికి నర్స్ యూనిక్ ఐడింటిఫికేషన్ నంబరు(ఎన్‌యూఐడీ) ఉండాలి. అందుకోసం అభ్యర్థులు నర్స్ రిజిస్ట్రేషన్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్(ఎన్‌ఆర్‌టీఎ్‌స) వెబ్‌సైట్‌లో నమోదు చేసుకొని, ఎన్‌యూఐడీ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవాలి. నర్స్ కోర్సులు చేసిన వారు విధిగా ఈ కార్డును పొందాలి. అయితే ఈ పోర్టల్ కేవలం నర్సింగ్ కౌన్సిల్‌లోనే ఓపెన్ అవుతుందని కొందరు నర్సులు చెబుతున్నారు. ప్రైవేటులో చదివిన విద్యార్థులను కాలేజీ యాజమాన్యాలే కౌన్సిల్‌కు తీసుకువచ్చి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. అందుకోసం ఒక్కొక్కరి నుంచి రూ.2-5 వేల వరకు వసూలు చేస్తున్నారు. రోజూ సగటున 70-100 మంది వరకు రిజిస్ట్రేషన్, రెన్యువల్ కోసం కౌన్సిల్‌కు వస్తారు.
కౌన్సిల్ నిధులపై లెక్కలేవి..?
ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ మాదిరిగా ప్రతీ ఏడాది వార్షిక ఆదాయ, వ్యయ వివరాలను రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ వెల్లడించడం లేదు. అలాగే రాష్ట్ర వైద్యమండలికి జరిగినట్లు నర్సింగ్ కౌన్సిల్‌కు ఎన్నికలు నిర్వహించడం లేదు. తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి ఇదే తంతు నడుస్తోంది. కౌన్సిల్ ఉన్నతాఽధికారులు కొంత మంది నామినేటెడ్ సభ్యులను పెట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అలాగే కౌన్సిల్‌కు సంబంధించిన న్యాయపరమైన వ్యవహారాలను పర్యవేక్షించేందుకు స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులుగా తమ కుటుంబీకులను నియమించుకుని, వారికి పెద్దమొత్తంలో ఫీజులు చెల్లించినట్లు ఆరోపణలున్నాయి. అలాగే నర్సింగ్ కౌన్సిల్ క్యాష్ బుక్‌ను మెయింటెన్ చేయడం లేదని చెబుతున్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్కరికే కౌన్సిల్ బాధ్యతలు అప్పగించడం వెనుక అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయు. నర్సింగ్ కౌన్సిల్‌లో దశాబ్ద కాలంగా పాతుకుపోయిన ఉన్నతాధికారుల నుంచి సిబ్బంది వరకు అందరినీ బదిలీ చేయాలని నర్సులు కోరుతున్నారు.
ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు
నర్సింగ్ కౌన్సిల్ ఉన్నతాధికారులపై ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, ఆరోగ్య కార్యదర్శి, వైద్య విద్య సంచాలకులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేశాం. కానీ ఇంత వరకు చర్యలు తీసుకోలేదు. నర్సింగ్ కౌన్సిల్ నిధులు రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన కౌన్సిల్ భవనం నిరుపయోగంగా మారింది. తనిఖీల సమయంలో పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. కౌన్సిల్‌కు ఏళ్లుగా ఎన్నికలు నిర్వహించడం లేదు.
- నక్కా సూర్య కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు, నర్సింగ్ వెల్ఫేర్ అసోసియేషన్
Also Read: హై బీపీతో ఇబ్బంది పడుతున్నారా.. జస్ట్ 5 నిమిషాలు ఇలా చేయండి..
Also Read: ఏపీ ప్రభుత్వంపై సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు
Also Read: రంగంలోకి మీనాక్షి నటరాజన్
For Telangana News And Telugu News..