Share News

Urea Shortage: కేంద్రం వల్లే యూరియా కొరత

ABN , Publish Date - Sep 04 , 2025 | 04:53 AM

కేంద్రప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితోనే దేశవ్యాప్తంగా యూరియా కొరత నెలకొందని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. ఎరువుల ఉత్పత్తిని పెంచకపోవటం వల్ల సమస్య పెరిగిపోయిందన్నారు.

Urea Shortage: కేంద్రం వల్లే యూరియా కొరత

దేశమంతటా ఈ సమస్య ఉంది.. 11 లక్షల టన్నులు అడిగితే.. 5 లక్షల టన్నులు ఇచ్చారు

  • వరదలతో 2.5 లక్షల ఎకరాల్లో నష్టం

  • ఢిల్లీలో మీడియాతో మంత్రి తుమ్మల

  • వ్యవసాయ యంత్రాలపై 12ు జీఎస్టీ తొలగించాలి

  • కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్‌కు తుమ్మల విజ్ఞప్తి

న్యూఢిల్లీ, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): కేంద్రప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితోనే దేశవ్యాప్తంగా యూరియా కొరత నెలకొందని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. ఎరువుల ఉత్పత్తిని పెంచకపోవటం వల్ల సమస్య పెరిగిపోయిందన్నారు. రాష్ట్రంలో సాగురంగంలో నెలకొన్న సమస్యలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఢిల్లీకి వచ్చిన మంత్రి తుమ్మల బుధవారం మీడియాతో మాట్లాడారు. చైనా నుంచి ఎర్రసముద్రం మీదుగా వచ్చే యూరియా రాకపోవడం వల్ల కొరత ఏర్పడిందన్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో రాష్ట్రానికి 11 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా కావాలని అడిగితే కేంద్రం 9.8 లక్షల మెట్రిక్‌ టన్నులు ఇస్తామని చెప్పిందని, ఇప్పటి వరకు 5.20 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే ఇచ్చిందని తెలిపారు. యూరియా సరైన సమయానికి రాకపోవడం వల్ల రైతాంగం ఆందోళనలో ఉందని, ఈ నెలలో పంటలకు ఎరువులు చాలా అవసరమన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో గత నాలుగు నెలలుగా యూరియా ఉత్పత్తి జరగటం లేదని, మరో 15 రోజుల వరకూ ఇదే పరిస్థితి అని చెప్పారు. తెలంగాణలో ఎరువుల బ్లాక్‌ మార్కెట్‌కు ఆస్కారం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో భారీవర్షాలు, వరదల వల్ల ప్రాథమిక అంచనాల ప్రకారం 2.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, దీనిని కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. గతంలో రాష్ట్రంలో వరదలు సంభవించినప్పుడు కేంద్రం సాయం చేయలేదని విమర్శించారు.


ముడి పామాయిల్‌పై దిగుమతి సుంకం తగ్గించాలన్న కేంద్రం నిర్ణయంతో తెలంగాణలోని పామాయిల్‌ రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందని, ఆ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్‌కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఆయిల్‌ పామ్‌ గెలలకు టన్నుకు రూ.25 వేల కనీస మద్దతు ధర కల్పించేలా ఆయిల్‌ పామ్‌ దిగుమతి సుంకాన్ని 44 శాతానికి పెంచాలన్నారు. బుధవారం శివరాజ్‌సింగ్‌తో ఆయన నివాసంలో మంత్రి తుమ్మల భేటీ అయ్యారు. ఎన్‌బీఎస్‌ (న్యూట్రియెంట్‌ బేస్డ్‌ సబ్సిడీ) పాలసీ కింద ఫాస్పరస్‌, పొటాషియంపై రాయితీని పెంచాలని, యూరియాతో సమానంగా ధరల సమతుల్యత పాటించాలని కేంద్ర మంత్రిని కోరారు. భద్రాద్రి కొత్తగూడెం, నారాయణపేట, ములుగు, కొమురంభీం ఆసిఫాబాద్‌, సంగారెడ్డి జిల్లాలను ప్రధానమంత్రి ధన్‌-ధాన్య కృషి యోజన (పీఎండీడీకేవై) పథకంలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ యంత్రాలపై 12 శాతం జీఎస్టీ విధించటం వల్ల యంత్రాల కొనుగోలు చిన్న, సన్నకారు రైతులకు భారంగా తయారైందని, జీఎస్టీని మినహాయించాలని విజప్తి చేశారు. తుమ్మల వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్‌రెడ్డి, గౌరవ్‌ ఉప్పల్‌ ఉన్నారు.

Updated Date - Sep 04 , 2025 | 04:53 AM