Agents Fraud: కిర్గిజిస్థాన్‌లో బందీ అయిన కుమారుడు.. విడిపించేందుకు పుస్తెలు తాకట్టుపెట్టిన తల్లి
ABN , Publish Date - Aug 09 , 2025 | 05:38 AM
స్థానిక ఏజెంట్ మోసం చేయడంతో సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం బల్వంతపుర్ గ్రామానికి చెందిన రజనీకాంత్‌ను కిర్గిజిస్థాన్‌లో ఓ కంపెనీ అధికారులు బంధించారు. రూ.లక్ష చెల్లిస్తేనే విడుదల చేస్తామని డిమాండ్ చేశారు.
రేపు భారత్‌కు రానున్న రజనీకాంత్
దుబ్బాక, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఏజెంట్ మోసం చేయడంతో సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం బల్వంతపుర్ గ్రామానికి చెందిన రజనీకాంత్‌ను కిర్గిజిస్థాన్‌లో ఓ కంపెనీ అధికారులు బంధించారు. రూ.లక్ష చెల్లిస్తేనే విడుదల చేస్తామని డిమాండ్ చేశారు. దీంతో తన కుమారుడిని విడిపించేందుకు రజనీకాంత్ తల్లి వరవ్వ తన పుస్తెల తాడును తాకట్టు పెట్టి ఆ మొత్తాన్ని చెల్లించింది. దీంతో బందీగా ఉన్న రజనీకాంత్‌ను అక్కడివారు శుక్రవారం విడిచిపెట్టి అతడి పాస్‌పోర్టును తిరిగి ఇచ్చేశారు. భారత్‌లో ఉన్న ఏజెంట్ మహబూబ్, అతని కుమారుడు అన్వర్ తమను మోసం చేయడం వల్లే తమ డబ్బులు రాబట్టుకోవడానికి రజనీకాంత్‌ను బంధించినట్లు కంపెనీ ఏజెంట్ చెప్పారు.
పాస్‌పోర్టు తిరిగి ఇచ్చేసినట్లు తెలియడంతో తల్లి.. కుమారుడు తిరిగి వచ్చేందుకు మరో రూ.22 వేలతో విమాన టికెట్ బుక్ చేసింది. ఖర్చుల కోసం రూ.10 వేలను కూడా పంపించింది. రజనీకాంత్ శనివారం సాయంత్రం బయలుదేరి ఆదివారం భారత్‌కు చేరుకోనున్నాడు. ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, మోసం చేసిన ఏజెంట్లపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.