Share News

Telangana Government: జూబ్లీహిల్స్‌ తరువాతే.. స్థానికం

ABN , Publish Date - Oct 23 , 2025 | 06:17 AM

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు.. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ముగిసిన తరువాతే జరిగే అవకాశం కనిపిస్తోంది. బీసీలకు 42 శాతం...

Telangana Government: జూబ్లీహిల్స్‌ తరువాతే.. స్థానికం

  • నేడు మంత్రివర్గ సమావేశంలో స్పష్టత

  • ముందస్తుగా మంత్రులతో సీఎం జూమ్‌ కాన్ఫరెన్స్‌

  • 42 శాతం కోసం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశామనే భావనలో పలువురు మంత్రులు

  • రిజర్వేషన్లు 50% మించొద్దన్న సుప్రీంకోర్టు

  • పార్టీ పరంగా ఇవ్వాలనుకుంటే బీసీలకు 42 శాతం కేటాయించాలని యోచన

  • ఎన్నికలు జరపలేదనే అపవాదు రావొద్దనే..

  • ఎన్నికలకు వెళ్లాలన్నది మెజారిటీ అభిప్రాయం

  • చట్టపరంగా 42%.. సీఎంకు ఆర్‌.కృష్ణయ్య లేఖ

హైదరాబాద్‌, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు.. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ముగిసిన తరువాతే జరిగే అవకాశం కనిపిస్తోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంలో డైలమా నెలకొనడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. అధికారికంగా 42 శాతం కల్పించే వీలు కనిపించడం లేదని, దీంతో కాంగ్రెస్‌ పార్టీ పరంగా కల్పించాలని ప్రభుత్వ పెద్దలు యోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ అంశంపై హైకోర్టు నాలుగు వారాలు గడువు ఇచ్చినందున అప్పటివరకు వేచి చూద్దామా? అనే కోణంలోనూ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. గురువారం జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ విషయంలో స్పష్టత రానుంది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలోని ఆరో అంతస్తులో మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం మంత్రులతో జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై చర్చ జరిగింది. ఈ కాన్ఫరెన్స్‌లో కూడా హైకోర్టు గడువు వరకు వేచి చూద్దామని, ఆలోపు జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక కూడా ముగుస్తుందనే అభిప్రాయం వ్యక్తమైందని సమాచారం. దీనిపై మంత్రివర్గ సమావేశంలో లోతుగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఓవైపు అన్ని సామాజికవర్గాలకు కలిపి రిజర్వేషన్లు 50 శాతం మించకూడదనే సుప్రీంకోర్టు తీర్పు ఉండగా, మరోవైపు 50 శాతం సీట్లను ఓపెన్‌ క్యాటగిరీగా నోటిఫై చేసి ఎన్నికలు నిర్వహించుకోవచ్చునంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఎన్నికలకు ఎలా వెళ్లాలనే దానిపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. అయితే సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు 42 శాతం చొప్పున రిజర్వేషన్లు కేటాయిస్తూనే ఎన్నికలకు వెళ్తామని కాంగ్రెస్‌ చెప్పింది. గురువారం క్యాబినెట్‌ భేటీలో ఈ అంశం కొలిక్కివచ్చే అవకాశం ఉందంటున్నారు.


ఆ అపవాదు ఎందుకు అని..

రాష్ట్రంలో 2023 డిసెంబరులో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైంది. ఆ తరువాత 2024 ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీలకు గడువు ముగిసింది. అప్పటినుంచి బీసీల రిజర్వేషన్ల వ్యవహారం నడుస్తుండడంతో దాదాపు 20 నెలలుగా తెలంగాణలో గ్రామ పంచాయతీల్లో పాలకమండళ్లు లేవు. ఫలితంగా కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థిక సంఘం నిధులు సహా పలు గ్రాంట్లు కూడా నిలిచిపోయాయి. దీంతో ‘‘అసలు ఎన్నికలు నిర్వహించలేదనే అపవాదు మనకెందుకు? బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కోసం చేయాల్సిన మేరకు అన్ని ప్రయత్నాలు చేశాం కదా! రిజర్వేషన్ల పెంపునకు ఉన్న ఇబ్బందులు, ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను ప్రజలకు వివరించి., ఎన్నికలకు వెళ్లడమే మేలు’’ అని పలువురు మంత్రులు అభిప్రాయపడుతున్నారు. అయితే అధికారికంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలుతోనే ఎన్నికలకు వెళ్లాలన్న అభిప్రాయంతో మరికొంత మంది మంత్రులు ఉన్నట్టు తెలిసింది. ఈ విషయంపై గురువారం మంత్రివర్గంలో కీలకంగా చర్చించనున్నారు. 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం జారీ చేసిన ప్రత్యేక జీవోపై హైకోర్టు స్టే విధించడం, ఆపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడం, స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించడం తెలిసిందే. ఆ సందర్భంగా సుప్రీం సూచించిన పలు అంశాలపై అధ్యయనం చేసి, దాని ప్రకారం ముందుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు, న్యాయనిపుణుల అధ్యయనం చేసిన నివేదిక గురువారం క్యాబినెట్‌ భేటీలో చర్చకు రానుంది.

ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేతకు ఆమోదం..

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలన్న నిబంధనను ప్రభుత్వం ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందుకోసం 2018 పంచాయతీరాజ్‌ చట్టంలోని సెక్షన్‌ 213 (3)లో సవరణ చేయనున్నారు. అనంతరం ఆర్డినెన్స్‌ను జారీ చేయనుంది. ఈ మేరకు సంబంధిత ఫైలు గురువారం క్యాబినెట్‌కు రానుంది. అక్కడ ఆమోదం పొందగానే దానిని గవర్నర్‌ ఆమోదం కోసం పంపనున్నారు. గవర్నర్‌ ఆమోదం తరువాత ఆర్డినెన్స్‌ జారీ చేయనున్నట్టు అధికారికవర్గాల ద్వారా సమాచారం. అలాగే క్యాబినెట్‌ సమావేశంలో పలు సాగునీటి ప్రాజెక్టుల డిజైన్లలో మార్పులు, అంచనాల్లో మార్పులకు సంబంఽధించి కూడా చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలిసింది.


పార్టీ పరంగా వద్దు.. చట్టపరంగానే కల్పించాలి: ఆర్‌.కృష్ణయ్య

రాంనగర్‌: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లను కాంగ్రెస్‌ పార్టీ పరంగా కాకుండా చట్టపరంగా ఇచ్చేలా మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య కోరారు. లేదంటే బీసీల తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాసినట్లు తెలిపారు.

పార్లమెంటులో 50 శాతం పరిమితిని ఎత్తివేసే బిల్లు పెట్టాలి: బీవీ రాఘవులు

బీసీల పట్ల కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేసేందుకు రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్లు పెట్టాలని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు డిమాండ్‌ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు అసెంబ్లీలో మద్దతు ఇచ్చిన బీజేపీ.. కేంద్రంలో అడ్డుకుంటూ మోసపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

కాంగ్రె్‌సకు చిత్తశుద్ధి లేదు: మధుసూదనాచారి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించడంపై కాంగ్రెస్‌ సర్కారుకు చిత్తశుద్ధి లేదని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, శాసనమండలి ప్రతిపక్షనేత మధుసూదనాచారి ఆరోపించారు. ఢిల్లీ స్థాయిలో ఒత్తిడి తెచ్చి.. రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప 42 శాతం సాధ్యం కాదన్నారు.

Updated Date - Oct 23 , 2025 | 06:42 AM