Life Sciences: 20 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు
ABN , Publish Date - Aug 21 , 2025 | 04:03 AM
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ రంగం అద్భుత ప్రగతి సాధించిందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
లైఫ్ సైన్సెస్ రంగంలో 54 వేల కోట్ల పెట్టుబడులు సాధించాం: దుద్దిళ్ల
హైదరాబాద్, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ రంగం అద్భుత ప్రగతి సాధించిందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్రం గత 20 నెలల్లో ఈ రంగంలో రూ.54 వేల కోట్ల పెట్టుబడులు సాధించి ‘గ్లోబల్ లీడర్’గా ఎదిగిందని చెప్పారు. హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్ బోర్డు సమావేశానికి ఛైర్మన్ హోదాలో ఆయన అధ్యక్షత వహించారు.
లైఫ్ సెన్సె్‌సలో భాగమైన ఔషధ తయారీ, టీకాల ఉత్పత్తి, మెడికల్ టెక్నాలజీ రంగాల్లో కొత్తగా 2 లక్షల పైచిలుకు ఉద్యోగాలు సృష్టించగలిగామని తెలిపారు. ప్రపంచంలోని అతిపెద్ద 7 లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో హైదరాబాద్ ఒకటిగా నిలిచిందన్నారు. దేశంలో ఈ ఘనత సాధించించిన ఏకైక నగరం హైదరాబాద్ కావడం గర్వకారణమన్నారు. లిల్లీ, యామ్‌జెన్, ఎంఎ్‌సడీ, జోయెటిస్, ఎవర్ నార్త్, ఒలింపస్ లాంటి దిగ్గజ సంస్థలు హైదరాబాద్‌ను ఎంపిక చేసుకున్నాయని చెప్పారు. త్వరలో తెలంగాణ నెక్ట్స్ జెన్ లైఫ్ సైన్సెస్ విధానం ప్రకటిస్తామని తెలిపారు.