National Education Survey: జాతీయ విద్య సర్వేలో.. మెరుగుపడ్డ తెలంగాణ
ABN , Publish Date - Jul 09 , 2025 | 05:07 AM
దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యపై కేంద్ర విద్యాశాఖ చేపట్టిన సర్వేలో తెలంగాణ స్థానం మెరుగుపడింది...
36 నుంచి 26వ స్థానానికి
రాష్ట్రంలో జనగామ జిల్లా ముందంజ
హైదరాబాద్, జూలై 8 (ఆంధ్రజ్యోతి) : దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యపై కేంద్ర విద్యాశాఖ చేపట్టిన సర్వేలో తెలంగాణ స్థానం మెరుగుపడింది. 3, 6, 9 తరగతుల్లో మాతృభాష, గణితం, సైన్స్ భాషల్లో విద్య నాణ్యతపై ఈ సర్వేను కేంద్రప్రభుత్వం గతేడాది చివర్లో నిర్వహించింది. తెలంగాణలో మొత్తం 33 జిల్లాల్లోని 3,342 పాఠశాలల్లో ఈ సర్వేని నిర్వహించారు. ఇందులో అనేక అంశాల్లో తెలంగాణ స్థానం మెరుగుపడింది. 2021లో చివరిసారిగా నిర్వహించిన సర్వేలో 36వ స్థానంలో ఉండగా, ఇప్పుడు 26వ స్థానానికి మెరుగుపడింది. మూడవ తరగతిలో దేశవ్యాప్తంగా అత్యుత్తమ 50 జిల్లాల్లో పంజాబ్‌లోని బర్నాలా జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా రాష్ట్రం నుంచి జనగామ జిల్లా 16వ స్థానంలో నిలిచింది. అలాగే 6వ తరగతిలో జనగామ జాతీయస్థాయిలో 35వ స్థానం, 9వ తరగతిలో 33వ స్థానం సాధించింది. తక్కువ నాణ్యత కలిగిన 50 జిల్లాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 37వ స్థానంలో ఉంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గత రెండేళ్లలో చేపట్టిన సంస్కరణల ఫలితంగానే జాతీయస్థాయిలో తెలంగాణ ర్యాంకు గణనీయంగా మెరుగుపడిందని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ తెలిపారు.