Extramarital Affair: వివాహేతర సంబంధం.. కుమారుడి ఎదుటే మహిళ దారుణ హత్య
ABN , Publish Date - Nov 09 , 2025 | 02:24 PM
భర్తను విడిచి దూరంగా ఉంటున్న భార్య దారుణ హత్యకు గురైంది. వేరే వ్యక్తితో కొనసాగించిన వివాహేతర సంబంధం.. చివరికి చావుకు దారి తీసింది. కుమారుడి కళ్లెదుటే ఆమె ప్రాణాలు పోయేలా చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఇంటర్నెట్ డెస్క్, నవంబర్ 9: తెలంగాణలో మరో దారుణం తీవ్ర కలకలం రేపుతోంది. కన్న కొడుకు కళ్లెదుటే ఓ తల్లిని గొంతుకోసి హత్య చేసిన ఘటన మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివాహేతర సంబంధమే మహిళా హత్యకు దారి తీసిందని పోలీసులు వెల్లడించారు. మహిళా హత్య అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, విస్తుపోయే విషయాలు వెల్లడించారు.
పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా..
హైదరాబాద్ ఉంటున్న కిషన్‌కు బహదూర్‌పల్లి గ్రీన్‌హిల్స్‌కాలనీలో ఒక బిల్డింగ్ ఉంది. మెదక్ జిల్లా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన 28 ఏళ్ల స్వాతి తన భర్తతో విభేదాలు రావడంతో కొంతకాలం నుంచి దూరంగా ఉంటుంది. ఈ క్రమంలోనే కిషన్‌కు చెందిన బిల్డింగ్‌లో ఒక గదిలో అద్దెకు ఉంటోంది. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒంటరిగా ఉంటున్న మహిళతో ఇంటి ఓనర్ కిషన్ కు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. అంతేకాదు బిల్డింగ్ లోని ఇతర ఇళ్లలోని అద్దెలను సైతం స్వాతి వసూలు చేస్తుండేది. ఈ బాగోతం అంతా జీర్ణించుకోలేకపోయిన కిషన్ భార్య, ఆమె కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. స్వాతిని దూరం పెట్టాలని, ఆమెతో గడపవద్దని కుటుంబసభ్యులు కిషన్‌ను హెచ్చరించారు. క్రమక్రమంగా పెరిగిన గొడవలు.. తీవ్ర ఘర్షణకు దారితీసింది.
ఈ క్రమంలోనే శనివారం ఉదయం 6.30 గంటలకు ఇద్దరు వ్యక్తులు స్వాతి ఇంట్లోకి ప్రవేశించి, ఆమె కుమారుడు చూస్తుండగానే గొంతు కోసి హత్య చేశారు. ఈ దారుణానికి సంబంధించి సమాచారం అందుకున్న మేడ్చల్ ఏసీపీ శంకర్‌రెడ్డి, సీఐ సతీష్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలుడిని పోలీసులు ప్రశ్నించగా.. తన తల్లిని ఒక వ్యక్తి వెనుక నుంచి పట్టుకోగా, మరో వ్యక్తి కత్తితో గొంతు కోశాడని వివరించారు. వివాహేతర సంబంధమే స్వాతి హత్యకు కారణమని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ క్రమంలోనే భయబ్రాంతులకు గురైన నిందితుల్లో ఒకరైన ఇంటి యజమాని అల్లుడు రాజేష్ పోలీసులకు లొంగిపోయాడు. వివాహేతర సంబంధం కారణంగా తన కుటుంబంలో జరుగుతున్న గొడవలకు కారణం స్వాతియేనని చెప్పుకొచ్చాడు. అందుకే కిషన్ తనతో ఈ హత్య చేయించినట్లు పోలీసులకు వివరించాడు.
ఇవి కూడా చదవండి:
Crime: తీవ్ర విషాదం.. గడ్డిమందు తాగి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
CP Sajjanar: ఆన్‌లైన్ స్కాంలపై జాగ్రత్తగా ఉండాలి.. సీపీ సజ్జనార్ కీలక సూచనలు