Employee Transfers: పీఏసీఎస్ ఉద్యోగుల బదిలీలపై యథాతథస్థితి: హైకోర్టు
ABN , Publish Date - Sep 06 , 2025 | 04:09 AM
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఉద్యోగుల బదిలీలు, సంబంధిత విధానం అమలుపై హైకోర్టు యథాతథ స్థితిని విధించింది.
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఉద్యోగుల బదిలీలు, సంబంధిత విధానం అమలుపై హైకోర్టు యథాతథ స్థితిని విధించింది. బదిలీలపై ఉద్యోగుల అభ్యంతరాలు స్వీకరించాలనే హైకోర్టు గత ఉత్తర్వులను పట్టించుకోకుండా రాష్ట్ర స్థాయి కన్వీనర్ ఆగస్టు 22న ‘పీఏసీఎస్ ఉద్యోగుల యూనిఫాం హెచ్‌ఆర్ పాలసీ- ట్రాన్స్‌ఫర్ పాలసీ ఇంప్లిమెంటేషన్’కు సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారని.. వాటిని కొట్టేయాలని పేర్కొంటూ రాష్ట్ర వ్యవసాయ సహకార సొసైటీ ఉద్యోగుల సంఘం సహా పలువురు ఉద్యోగులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ పుల్ల కార్తీక్ ధర్మాసనం విచారణ చేపట్టింది.
పిటిషనర్ల తరఫున న్యాయవాది బీఎస్ ప్రసాద్ వాదిస్తూ.. గతంలో ఇదే హైకోర్టు బదిలీల పాలసీని కొట్టేసిందని, ఉద్యోగుల అభ్యంతరాలు స్వీకరించాలని ఆదేశించిందని పేర్కొన్నారు. ఆ ఆదేశాలను పట్టించుకోకుండా బదిలీలు చేపట్టాలని ఆదేశిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీచేశారన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. వివరణ ఇవ్వాలని స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంకు చైర్మన్, చీఫ్ జనరల్ మేనేజర్, ఎండీ, పీఏసీఎస్ సెల్ కన్వీనర్, సీఈవో తదితరులకు నోటీసులు జారీచేసింది. బదిలీలపై యథాతథ స్థితి (స్టేటస్ కో) కొనసాగించాలని పేర్కొంటూ విచారణను అక్టోబరు 7కు వాయిదా వేసింది.