High Court: గ్రూప్-1 నియామకాలకు పచ్చజెండా
ABN , Publish Date - Sep 25 , 2025 | 04:22 AM
గ్రూప్-1 నియామకాలకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల ఫలితాలను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును నిలిపివేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తదుపరి నియామకాలు చేపట్టుకోవచ్చని.. నియామకపత్రాలు ఇవ్వవచ్చని తెలిపింది...
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
ఫలితాలను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు నిలిపివేత
తుది తీర్పునకు లోబడి నియామకాలు
పేపర్ లీకేజీ, విధానపరమైన లోపాలు ఉంటేనే కోర్టులు జోక్యం చేసుకోవాలి
హైదరాబాద్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): గ్రూప్-1 నియామకాలకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల ఫలితాలను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును నిలిపివేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తదుపరి నియామకాలు చేపట్టుకోవచ్చని.. నియామకపత్రాలు ఇవ్వవచ్చని తెలిపింది. అయితే ఆ నియామకాలన్నీ తాము ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటాయని పేర్కొంది. ‘‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఇది మొదటి గ్రూప్-1 నోటిఫికేషనా? ఇప్పటి వరకూ ఎందుకీ పరీక్ష నిర్వహించలేదు.. 2014 నుంచి రాష్ట్రంలో కమిషన్ లేదా?’’ అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కాగా.. ద్విసభ్య ధర్మాసనం జారీ చేసిన ఈ మధ్యంతర ఉత్తర్వులతో టీజీపీఎస్సీకి భారీ ఊరట లభించినట్లయింది. గ్రూప్-1 ప్రధాన పరీక్షల సమాధాన పత్రాల మూల్యాంకనంలో లోపాలు, డబుల్ హాల్‌టికెట్లు, పరీక్షా కేంద్రాల కేటాయింపు, కొన్ని సెంటర్లలో ఎక్కువమంది ఎంపిక కావడం, ఎంపిక చేసిన అభ్యర్థులను కొన్ని సెంటర్లకు కేటాయించడం, తెలుగు మాధ్యమ అభ్యర్థులపై వివక్ష, ఎవాల్యుయేటర్ల ఎంపికలో లోపాలు వంటి కారణాలను చూపుతూ.. ఆ పరీక్ష ఫలితాలను రద్దుచేయాలంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి.. తుది మార్కుల జాబితా, జనరల్ ర్యాంకుల జాబితాను కొట్టేస్తూ ఈ నెల 9న 222 పేజీల తీర్పు వెలువరించింది. అయితే.. ఆ తీర్పు తప్పులతడకగా ఉందని, అది చెల్లదని పేర్కొంటూ టీజీపీఎస్సీతో పాటు ఎంపికైన అభ్యర్థులు హైకోర్టు డివిజన్ బెంచ్‌లో మొత్తం 15 రిట్ అప్పీళ్లు దాఖలు చేశారు.
ఈ అప్పీళ్లపై చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. టీజీపీఎస్సీ తరఫున అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి, సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి, కమిషన్ స్టాండిం గ్ కౌన్సిల్ పీఎస్ రాజశేఖర్ వాదనలు వినిపించారు. ‘గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల్లో భారీగా తప్పులు జరిగాయనడానికి ఎలాంటి ఆధారాలూ లేవు. చిన్న చిన్న కారణాలను సాకుగా చూపుతూ పిటిషన్లు దాఖలయ్యాయి. వాటన్నింటికీ శాస్త్రీయంగా పూర్తి వివరాలతో టీజీపీఎస్సీ సమాధానం చెప్పింది. సింగిల్ జడ్జి ఆ విషయాలను పట్టించుకోకుండా ఫలితాలను రద్దు చేశారు. పునర్ మూల్యాంకనం అనేది కమిషన్ రూల్స్‌లో లేనే లేదు. సుప్రీంకోర్టు ఇచ్చిన ‘సంజయ్‌సింగ్ వర్సెస్ యూపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్’ తీర్పు ప్రకారం మోడరేషన్ పద్ధతి అమలు చేయలేదని సింగిల్ జడ్జి రూలింగ్ ఇవ్వడం సరి కాదు. ఒక్కో సమాధాన పత్రాన్నీ ఇద్దరు ఎవాల్యుయేటర్లు దిద్దుతారు. వారు ఇచ్చిన మార్కుల మధ్య 15 శాతం కంటే ఎక్కువ వ్యత్యాసం ఉంటే సదరు సమాధాన పత్రం మూడో ఎవాల్యుయేటర్ వద్దకు వెళ్తుంది. మొత్తం సెంటర్లు 45 అని ముందు ప్రకటించి 46కు పెంచడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఒక సెంటర్ ఏర్పాటు చేయాల్సి రావడం వల్ల అలా జరిగింది. అలాగే కోఠిఉమెన్స్ కాలేజీలో 18, 19 సెంటర్లలో కేవలం మహిళలే ఉండటానికి కారణం.. అక్కడ పురుషలకు టాయిలెట్ సౌకర్యాలు లేవు. కేవలం మహిళలను మాత్రమే కేటాయించాలని సదరు కాలేజీ చేసిన విజ్ఞప్తి మేరకు అక్కడ మహిళలను మాత్రమే కేటాయించారు. ఇవన్నీ కమిషన్ అధికార పరిధిలోని అంశాలు. వీటి వల్ల పిటిషనర్లకు కలిగిన నష్టం ఏంటో నిరూపించలేదు’ అని పేర్కొన్నారు.
ఆధారాలెక్కడ?
విచారణ సందర్భంగా ధర్మాసనం పలు కీలక ప్రశ్నలు సంధించింది. మాస్ కాపీయింగ్, పేపర్ లీకేజీ, భారీ లోపాలపై ప్రశ్నించింది. ‘‘డబుల్ హాల్‌టికెట్లు, సెంటర్ల పెంపు, ప్రత్యేకంగా మహిళల కేటాయింపు వంటివి కమిషన్ పరిధిలోని అంశాలు.. వాటి ఆధారంగా ఫలితాలను ఎలా కొట్టేయగలం? ఫలితాలను కొట్టేయడానికి ఈ చిన్న విషయాలు కారణాలా? సింగిల్ జడ్జి తీర్పులో పేర్కొన్న విధంగా సమగ్రత లేదనడానికి, వివక్ష, విధానపరమైన లోపాలు వంటి అంశాలకు ఆధారాలు ఎక్కడ ఉన్నాయి?’’ అని ప్రశ్నించింది. అలాంటివేవీ లేకుండానే ఫలితాలను కొట్టేశారని ఏజీ సమాధానం ఇచ్చారు. ఒకే సబ్జెక్టును తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో రాసే అభ్యర్థుల పేపర్లను ఎలా దిద్దుతారని ధర్మాసనం ప్రశ్నించగా.. ఏ మాధ్యమంలో రాసినా అభ్యర్థుల ప్రతిభను బట్టి కచ్చితమైన మార్కులు ఇవ్వడానికి ఎవాల్యుయేటర్లు, చీఫ్ ఎగ్జామినర్లు సరైన మార్గదర్శకత్వం, శిక్షణ ఇచ్చారని.. ఏజీ బదులిచ్చారు. టీజీపీఎస్సీ తరఫున మరో సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్‌రెడ్డి వాదిస్తూ.. అన్ని చిన్న చిన్న విషయాలే తప్ప మాల్ ప్రాక్టీస్, మాస్ కాపీయింగ్, పేపర్ లీకేజీ వంటి భారీ ఆరోపణలు లేనేలేవని పేర్కొన్నారు. ఏపీలో తెలుగు మాధ్యమ అభ్యర్థులు తెలంగాణ కంటే ఇంకా తక్కువ శాతం ఎంపికయ్యారని గుర్తుచేశారు.
తప్పుగా అర్థం చేసుకున్నారు..
ఎంపికైన అభ్యర్థుల తరఫున సీనియర్ న్యాయవాదులు ఎస్ మురళీధర్, దేశాయి ప్రకాశ్‌రెడ్డి, న్యాయవాదులు విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు వాదించారు. టీజీపీఎస్సీ పరీక్షల నిర్వహణలో పాటించిన విధానమే తప్పు అనుకున్నప్పుడు.. రీఎవాల్యుయేషన్ చేయడం వల్ల ఆ తప్పులన్నీ ఒప్పు అవుతాయా? అని వారు ప్రశ్నించారు. పేర్కొన్నారు. సింగిల్ జడ్జి కమిషన్ అధికార పరిధిలోకి చొచ్చుకుపోయారని.. ఆయన తీర్పును అమలు చేస్తే భవిష్యత్తులో పరీక్షలపై విపరీతమైన కేసులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. తెలిపారు. రెండు హాల్‌టికెట్లు ఇవ్వడం అనేది కమిషన్ విచక్షణపై ఆధారపడి ఉంటుందని తెలిపారు.
పేపర్లు దిద్దకుండానే..
సింగిల్ జడ్జి వద్ద కేసు గెలిచిన రిట్ పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు జి.విద్యాసాగర్, రచనారెడ్డి, సురేందర్‌రావు వాదనలు కొనసాగించారు. రూల్స్‌లో లేనివిధంగా మూడో ఎవాల్యుయేటర్ ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించారు. మూడో ఎవాల్యుయేటర్ ఉన్నట్లు కమిషన్ ఎక్కడా చెప్పలేదని.. ఇదంతా ఫ్రాడ్ చేయడానికి డిజైన్ చేశారని ఆరోపించారు. ఈ దశలో జోక్యం చేసుకున్న ధర్మాసనం.. ‘‘మొత్తం ప్రొసీజర్ తప్పు అన్నప్పుడు పునర్ ముల్యాంకనం వల్ల లాభం ఏంటి?’’ అని ప్రశ్నించింది. దీనికి సీనియర్ న్యాయవాది సురేందర్‌రావు సమాధానం ఇస్తూ.. అసలు మూల్యాంకనమే జరగలేదని.. ఒక్కో సమాధానానికి కాకుండా ఒక్కో అభ్యర్థికి మార్కులు కేటాయించారని పేర్కొన్నారు. అభ్యర్థులు రాసిన సమాధానాలు తప్పా లేదా ఒప్పా చెప్పకుండా అభ్యర్థులవారీగా మార్కులు కేటాయించారని తెలిపారు. పేపర్లు దిద్దకుండా మార్కులు కేటాయించారని ఆరోపించారు. కాబట్టి మళ్లీ పేపర్లు దిద్దితే అది పునర్ మూల్యాంకనం కాదని.. అది తాజా మూల్యాంకనమే అవుతుందని పేర్కొన్నారు. అయితే.. అసలు మూల్యాంకనమే జరగలేదన్న వాదనను అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. భౌతికంగా సమాధాన పత్రాల్లోని ఒక్కో పేజీపై రెడ్ పెన్‌తో గీత గీసి మార్కులు అక్కడ రాస్తారా? ఇదేమి వాదన అని ఆగ్రహం వ్యక్తంచేశారు. మళ్లీ రెండో ఎవాల్యూయేటర్ పేపర్ దిద్దేటప్పుడు ఎలా? ఆయన కూడా మళ్లీ గీతలు గీయాలా? అడ్డంగా నిలువుగా గీతలు గీసి మార్కులు రాస్తారా? చిన్న పిల్లల పేపర్లు దిద్దినట్లు గీతలు గేస్తేనే సమాధాన పత్రాల మూల్యాంకనం చేసినట్లు భావించాలనే వాదన ఏంటని అని ఏజీ ప్రశ్నించారు. సీనియర్ న్యాయవాది రచనారెడ్డి తన వాదనను కొనసాగిస్తూ.. కమిషన్ తన నోటిఫికేషన్‌లోని రూల్స్‌ను తానే ఉల్లంఘించిందని పేర్కొన్నారు. ఈ దశలో జోక్యం చేసుకున్న ధర్మాసనం.. సమగ్రత లేకపోవడం అనేది తీవ్రమైన, గంభీరమైన ఆరోపణ అని దానికి ఎక్కడ ఆధారాలు ఉన్నాయో చూపాలని రచనారెడ్డిని ప్రశ్నించింది. నిపుణులు మాత్రమే చేయాల్సిన పనుల్లోకి కోర్టులు ఎలా దూరగలవని ప్రశ్నించింది. అందరి వాదనలు విన్న అనంతరం.. కీలకమైన విషయాలతో లఘు నోట్ ఇవ్వాలని ఇరు పక్షాలనూ ఆదేశించింది. ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చుకోవచ్చని.. అయితే ఆ నియామకాలు తమ తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టంచేస్తూ.. తదుపరి విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేసింది.