Share News

Telangana Govt to Convert Industrial Estates: వాణిజ్య వీధులు

ABN , Publish Date - Nov 24 , 2025 | 04:41 AM

రోజు రోజుకూ విస్తరిస్తున్న రాజధాని నగరాన్ని భవిష్యత్తు అవసరాలకు తగినట్లు తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఔటర్‌ రింగ్‌రోడ్డు లోపల, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో 50, 60 ఏళ్ల క్రితం నెలకొల్పిన పారిశ్రామిక ఎస్టేట్లు...

Telangana Govt to Convert Industrial Estates: వాణిజ్య వీధులు

  • మల్టీ యూజ్‌ జోన్లుగా మార్చనున్న సర్కారు.. హెచ్‌ఐఎల్‌టీపీ పేరిట కొత్త పాలసీ

  • అపార్టుమెంట్లు, ఆఫీసులు, స్కూళ్లు, హోటళ్లు, హాస్పిటళ్లు, టెక్‌ పార్కుల నిర్మాణానికి అవకాశం

  • ఇంపాక్ట్‌ ఫీజు వసూలుతో అనుమతులు

  • రోడ్ల వెడల్పు 80 అడుగుల లోపు ఉంటే 30ు, 80 అడుగులకు ఎక్కువ ఉంటే 50ు ఫీజు

  • ల్యాండ్‌ కన్వర్షన్‌ ఫీజులు కూడా అందులోనే

  • హైదరాబాద్‌లోని 22 పారిశ్రామిక పార్కులు, స్టాండ్‌ అలోన్‌ యూనిట్లకు పాలసీ వర్తింపు

  • మొత్తం 9,292 ఎకరాల భూముల్లో 4,740 ఎకరాల ప్లాటెడ్‌ భూములు

  • టీజీఐపాస్‌ ద్వారా దరఖాస్తుల స్వీకరణ

  • నోడల్‌ ఎజెన్సీగా వ్యవహరించనున్న టీజీఐఐసీ

  • 45 రోజుల్లో పూర్తికానున్న మొత్తం ప్రక్రియ

  • 2013లోనే ఈ పాలసీకి నాటి సర్కారు శ్రీకారం

హైదరాబాద్‌, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): రోజు రోజుకూ విస్తరిస్తున్న రాజధాని నగరాన్ని భవిష్యత్తు అవసరాలకు తగినట్లు తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఔటర్‌ రింగ్‌రోడ్డు లోపల, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో 50, 60 ఏళ్ల క్రితం నెలకొల్పిన పారిశ్రామిక ఎస్టేట్లు, పార్కుల భూములను ‘మల్టీ యూజ్‌ జోన్‌లు’గా మార్చాలని నిర్ణయించింది. ఇందుకోసం ‘హైదరాబాద్‌ ఇండస్ర్టియల్‌ ల్యాండ్స్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ పాలసీ (హెచ్‌ఐఎల్‌టీపీ)-2025 ’ పేరిట ప్రభుత్వం కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. నగర అభివృద్ధి, భూముల సక్రమ వినియోగం కోసం ఈ పాలసీని తీసుకొస్తున్నట్లు పేర్కొంటూ ఈ నెల 22న ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం.. ఇప్పటిదాకా పారిశ్రామిక ఎస్టేట్‌లుగా ఉన్న ప్రాంతాల్లో ఇకపై అపార్టుమెంట్లు, టౌన్‌షి్‌పలు, ఆఫీసులు, స్కూళ్లు, హాస్పిటళ్లు, హోటళ్లు, టెక్‌ పార్కులు, రీసెర్చ్‌ సెంటర్లు నిర్మించేందుకు అనుమతులు ఇస్తామని పేర్కొంది. ఈ అనుమతులు పొందేందుకుగాను ఆయా ప్రాంతాల ప్రభుత్వ రిజిస్ట్రేషన్‌ (ఎస్‌ఆర్‌వో) విలువలో డెవల్‌పమెంట్‌ ఇంపాక్ట్‌ ఫీజు కింద.. రోడ్ల వెడల్పు 80 అడుగుల లోపు ఉంటే ఆ ప్రాంతానికి 30 శాతం, 80 అడుగులకు ఎక్కువ వెడల్పు రోడ్లు ఉంటే 50 శాతంగా ఫీజు చెల్లించి ఫ్రీ హోల్డ్‌గా మార్చుకోవచ్చునని తెలిపింది. ఫ్రీ హోల్డ్‌గా మారితే.. ఆ భూమిపై పూర్తి యాజమాన్య హక్కులు లభించనున్నాయి. దీంతో ఆ భూమిని వారు తమకు నచ్చిన విధంగా వినియోగించుకునేందుకు, విక్రయించుకునేందుకు కూడా హక్కు పొందుతారు. కాగా, ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో మొత్తం 22 పారిశ్రామిక పార్కులు, స్టాండ్‌ అలోన్‌ భూముల యూనిట్లు ఉన్నాయి. ఈ భూములు మొత్తం 9,292 ఎకరాలు కొత్త పాలసీ కిందకు వస్తున్నాయి. అయితే ఇందులో 4,740 ఎకరాలను ప్లాటెడ్‌ ఏరియాగా నిర్ణయించారు.


మల్టీ యూజ్‌గా మార్పు అందుకే..

గత ప్రభుత్వాలు పారిశ్రామికవేత్తలకు భూములను కేటాయించినప్పుడు.. వారు ఇక్కడ పెట్టుబడులు పెట్టి, యువతకు, నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తారనే ఉద్దేశంతో నామమాత్రపు ఫీజుకు భూములను లీజుకు ఇచ్చాయి. వారికి విద్యుత్‌, నీరు, ఇతర మౌలిక సదుపాయాలను కూడా కల్పించి ప్రోత్సహిస్తూ వచ్చాయి. ఇలా కేటాయించిన వాటిలో కొన్ని పరిశ్రమలు ఇప్పటికీ కొనసాగుతూ నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తుండగా, మరికొన్ని పరిశ్రమలు మూత పడ్డాయి. అయితే బాలానగర్‌, కాటేదాన్‌, కూకట్‌పల్లి, జీడి మెట్ల, చర్లపల్లి, మౌలాలి, నాచారం, ఉప్పల్‌ వంటి పారిశ్రామిక ప్రాంతాలు పరిశ్రమలు స్థాపించిన సమయంలో నగర శివారులో ఉండేవి. కానీ, ఆ పరిశ్రమలు ఉన్న ప్రాంతాలు నేడు నగరం నడిబొడ్డుగా మారాయి. రోజు రోజుకూ నగరంలో జనాభా పెరుగుతున్న నేపథ్యంలో ఆ పరిశ్రమలు నగర పౌరులకు అసౌకర్యంగా, కాలుష్య కారకాలుగా మారుతున్నాయి. ఈ కారణంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందే కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రభుత్వం 2013లో ఈ పరిశ్రమలన్నిటినీ నగరానికి అవతల ఏర్పాటు చేసుకోవాలంటూ ఒక విధానాన్ని తీసుకొచ్చింది. అయితే దానిని అమలు చేసే క్రమంలో ఆ సమయానికే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఆ తర్వాత కేసీఆర్‌ ప్రభుత్వం కూడా ఈ ప్రతిపాదనను సూత్రపాయంగా లేవనెత్తినప్పటికీ.. అమలులోకి మాత్రం తీసుకురాలేకపోయింది. ఇప్పుడు రేవంత్‌రెడ్డి సర్కారు ఈ నిర్ణయాన్ని సీరియ్‌సగా తీసుకుని అమలు దిశగా కొత్త పాలసీని తీసుకొచ్చింది.


టీజీ-ఐపాస్‌ ద్వారా దరఖాస్తులు..

పారిశ్రామిక ఎస్టేట్‌లను మల్టీ యూజ్‌ జోన్‌లుగా మార్చి ఇంపాక్ట్‌ ఫీజు వసూలు ద్వారా ఇతర అవసరాలకు వినియోగించేందుకు అనుమతులు ఇవ్వనుంది. ఇంపాక్ట్‌ ఫీజులోనే చేంజ్‌ ఆఫ్‌ ల్యాండ్‌ యూజ్‌(సీఎల్‌యూ) ఫీజులు కూడా కలిపారు. దీంతో పారిశ్రామికవేత్తలు అప్రూవల్స్‌ కోసం వేర్వేరు శాఖల వద్దకు తిరగాల్సిన అవసరం లేకుండా పోతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికోసం టీజీ-ఐపాస్‌ పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ మొత్తం ప్రక్రియకు టీజీఐఐసీ నోడల్‌ ఏజెన్సీగా పని చేస్తుందని పేర్కొంది. మల్టీ యూజ్‌ కింద అనుమతులు పొందేందుకుగాను పారిశ్రామికవేత్తలు తమకు కేటాయించిన భూమి విలువ ప్రకారం.. మొత్తం విలువలో 20 శాతాన్ని ప్రారంభ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. మిగతా 80 శాతం ఫీజులను రెండు విడతల్లో చెల్లించవచ్చని జీవోలో వివరించింది. కాగా, దరఖాస్తులను 7 రోజుల్లోగా టీజీఐఐసీ ప్రారంభ స్ర్కూటినీ చేస్తుంది. మరో 7 రోజుల్లో ఆ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ నేతృత్వంలోని కమిటీ తుది ఆమోదం తెలుపుతుందని, మరో 7 రోజుల్లో డిమాండ్‌ నోటీసును యూనిట్‌దారులకు ఆన్‌లైన్‌లో జారీ చేస్తామని వెల్లడించింది. ఈ ప్రక్రియ అంతా 45 రోజుల్లో పూర్తవుతుందని పేర్కొంది. అయితే ప్రతి దశలోనూ గ్రేస్‌ పీరియడ్‌ను నెల రోజులుగా నిర్ణయించింది. గ్రేస్‌ పీరియడ్‌ దాటితే మొత్తం రుసుము ప్రభుత్వ ఖజానాకే వెళుతుందని స్పష్టం చేసింది. ఈ పాలసీ జారీ అయిన తేదీ నుంచి 6 నెలల్లోపు దరఖాస్తులను సమర్పించాలని ఆదేశించింది. ఈఆదాయాన్ని భూ మార్పిడి ఫీజులకు, 25 శాతం టీజీ-ఐఐసీ వద్దే ఉంచి రాష్ట్ర నలుమూలల పారిశ్రామిక అభివృద్ధికి వినియోగించనుంది. మిగతా మొత్తాన్ని రాష్ట్ర ఆర్థికస్థితిని బలోపేతం చేసేందుకు ప్రభుత్వ ట్రెజరీకి జమ చేయనుంది.

Updated Date - Nov 24 , 2025 | 04:41 AM