Telangana government Issued GO: జీవో 42 శాతం
ABN , Publish Date - Sep 27 , 2025 | 04:29 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. అందుకు సంబంధించి జీవో జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ కార్యదర్శి జ్యోతి బుద్దప్రకాశ్ శుక్రవారం ఉత్తర్వులు (జీవో నంబర్ 09) జారీ చేశారు...
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపు
42 శాతం అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
సీట్లు, పదవుల్లో వర్తింపజేస్తున్నట్లు వెల్లడి
ఎన్నికలకు లైన్‌క్లియర్.. సోమవారం షెడ్యూల్!
తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు..
తరువాత 2 దశల్లో గ్రామపంచాయతీలకు
నేడు తేలనున్న స్థానాల వారీ రిజర్వేషన్లు
ఎన్నికలకు సిద్ధమంటూ ఎలక్షన్ కమిషన్‌కు లేఖ రాయనున్న పంచాయతీరాజ్ శాఖ
సీఎస్, డీజీపీ సహా ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో నేడు ఎన్నికల సంఘం భేటీ
హైదరాబాద్, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. అందుకు సంబంధించి జీవో జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ కార్యదర్శి జ్యోతి బుద్దప్రకాశ్ శుక్రవారం ఉత్తర్వులు (జీవో నంబర్ 09) జారీ చేశారు. దీని ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లు, పదవుల కేటాయింపుల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి. దీంతో స్థానిక ఎన్నికలకు మార్గం సుగమం అయింది. సోమవారమే షెడ్యూలు, నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, సామాజిక, రాజకీయ సూచికల ప్రకారం రాష్ట్రంలోని బీసీల బహువిధ వెనుకబాటుతనం, రాజ్యాంగం కల్పించిన అధికారాలు, ఎంపిరికల్ డేటా, న్యాయ వ్యవస్థ ఆమోదం మేరకు రాష్ట్రంలోని బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. బీసీలకు సంక్షేమాన్ని, సాధికారతను కల్పించడం, వారి పూర్తి భాగస్వామ్యాన్ని కాంక్షించడం, సమానత్వం, సామాజిక న్యాయం, సమ్మిళిత అభివృద్ధిని సాధించాలన్న రాజ్యాంగ దృక్పథం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పంచాయతీల సీట్లు, చైర్‌పర్సన్‌ల విషయంలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందంటూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 డి(6) పేర్కొంటుందని పేర్కొంది. మునిసిపాలిటీలు, వాటి చైర్‌పర్సన్‌ల విషయంలో రిజర్వేషన్లు కల్పించే అధికారాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 టి(6) రాష్ట్ర ప్రభుత్వానికి దఖలు పరిచిందని వివరించింది. ఈ మేరకు డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేయడంతోపాటు రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కులగణన సర్వే నిర్వహించినట్లు గుర్తు చేసింది. అనంతరం ఏకసభ్య కమిషన్, డెడికేటెడ్ కమిషన్‌ల సిఫారసులు, రాజ్యాంగం కల్పించిన అధికారాల ఆధారంగా స్థానిక సంస్థల సీట్లు, పదవుల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను వర్తింపజేస్తున్నట్లు వివరించింది. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలను ఆదేశించింది.
రేపు సాయంత్రానికే షెడ్యూల్!
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లపై ప్రభుత్వం జీవో జారీ చేయడంతో.. ఎన్నికల నిర్వహణకు లైన్‌క్లియర్ అయింది. సోమవారం షెడ్యూల్, నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అన్ని వ్యవహారాలు పూర్తయితే ఆదివారం సాయంత్రానికే షెడ్యూల్ వచ్చే అవకాశం కూడా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఆ తరువాత రెండు దశల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్నట్టు తెలిసింది. ఎన్నికల నిర్వహణ, అందుకు అవసరమైన సిబ్బంది, సహా తదితర అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, పంచాయతీరాజ్ శాఖతో పాటు ఇతర అన్ని ప్రభుత్వ శాఖల ముఖ్య, ఉన్నతాధికారులతో ఎన్నికల సంఘం శనివారం కీలక సమావేశం నిర్వహించనున్నట్టు సమాచారం. వార్డు సభ్యులు, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ, జడ్పీ చైర్‌పర్సన్‌ల వారీగా ఏయే సామాజికవర్గానికి ఎంత మేర రిజర్వేషన్లు రానున్నాయనే అంశంతోపాటు జనరల్ స్థానాలు, మహిళలకు రాబోయే స్థానాలకు లాటరీ ద్వారా రిజర్వేషన్లను శనివారం ఖరారు చేయనున్నారు. కాగా, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ ప్రభుత్వ జారీ చేసిన జీవో నంబరు 9ను అన్వయించుకొని పంచాయతీరాజ్ శాఖ రెండు ఉత్తర్వులు జారీ చేసింది. సామాజిక వర్గాల వారీగా స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లను ఖరారు చేయాలంటూ ఎంపీపీ, జిల్లా పరిషత్‌ల కోసం జీవో నంబరు 41, వార్డు సభ్యులు, సర్పంచ్‌ల రిజర్వేషన్ల కోసం జీవో నంబరు 42ను విడుదల చేసింది. ఆయా జీవోలను ప్రభుత్వం జిల్లాల కలె క్టర్లకు పంపింది. ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్న సూచనల ప్రకారం శనివారం రాష్ట్ర వ్యాప్తంగా రిజర్వేషన్ల వ్యవహారం తేలిపోనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని తెలుపుతూ.. ఎన్నికల నిర్వహణ కు షెడ్యూల్, నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ.. ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను కలిపి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు పంచాయతీరాజ్ శాఖ శనివారం లేఖ రాయనున్నట్టు తెలిసింది.
రిజర్వేషన్లు ఖరారు చేసేది వీరే..
వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఎంపీడీవోలు ఖరారు చేయనుండగా.. సర్పంచ్, ఎంపీటీసీల రిజర్వేషన్లను ఆర్డీవో, ఎంపీపీ, జడ్పీటీసీల రిజర్వేషన్లను జిల్లా కలెక్టర్లు ఖరారు చేయనున్నారు. ఇక జడ్పీ చైర్‌పర్సన్‌ల రిజర్వేషన్లను పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఖరారు చేస్తారు. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను 2011 నాటి జనాభా ప్రకారం ఖరారు చేయనుండగా.. బీసీ రిజర్వేషన్లను 2024లో నిర్వహించిన కులగణన వివరాల ఆధారంగా ఖరారు చేయనున్నారు. సర్పంచ్, వార్డు మెంబర్, ఎంపీటీసీ, జడ్పీటీసీల్లో 50 శాతం స్థానాలు మహిళలకు లాటరీ పద్ధతిలో కేటాయిస్తారు. వంద శాతం ఎస్సీ, ఎస్టీ గ్రామాలున్న చోట ఆ సామాజికవర్గానికే రిజర్వేషన్ కల్పిస్తారు. అందలోనూ మహిళలకు 50 శాతం కేటాయిస్తారు. 2018లో తీసుకొచ్చిన తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలోని పలు సెక్షన్లలో సవరణలు చేయడంతో (వార్డు సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్‌పర్సన్ల) రిజర్వేషన్ల విధానంలో మార్పులు జరిగాయి. దాని ప్రకారం రిజర్వేషన్లు రొటేషన్ పద్ధతిలో ఉండాలని చట్టంలో స్పష్టం చేశారు. ఆ మేరకే ఇప్పుడు రిజర్వేషన్లను మార్చనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటాయింపులు పూర్తయిన తర్వాత మిగిలిన స్థానాలను అన్‌రిజర్వ్‌డ్‌గా ఉంచుతారు. రిజర్వేషన్లన్నీ తేలిన తరువాత గెజిట్ ప్రచురిస్తారు.
మారనున్న గ్రామాల రిజర్వేషన్లు..
ఈసారి జరగబోయే స్థానిక ఎన్నికల్లో గ్రామాలవారీ రిజర్వేషన్లు మారనున్నాయి. రాష్ట్రంలో మొత్తం 12,760 గ్రామపంచాయతీలు, 565 మండలాలు, 31 జిల్లాలు, 1,12,534 వార్డులు, 5,763 ఎంపీటీసీలు, 565 మండల పరిషత్‌లు, 31 జిల్లా పరిషత్‌లు ఉన్నాయి. వీటి ప్రకారం రిజర్వేషన్లను ఖరారు చేస్తారు. ఉదాహరణకు.. గత ఎన్నికల సమయంలో అన్ని సామాజికవర్గాలు కలిసి ఉన్న ఓ గ్రామంలో అక్కడి జనాభా ప్రకారం బీసీ/ఎస్సీ/ఎస్టీ/జనరల్‌కు కేటాయించి ఉంటే అందులో మార్పులుంటాయి. అంటే గతంలో రిజర్వేషన్ కల్పించిన వర్గానికి కాకుండా ఈసారి మరో వర్గానికి అవకాశం కల్పిస్తారు.
న్యాయపరంగా జీవో నిలబడుతుందా..?
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జీవో చేసి.. ఎన్నికలకు సన్నాహాలు చేస్తున్నా ఈ జీవో న్యాయసమీక్షకు నిలబడుతుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి బీసీలకు స్థానిక సంస్థలు, విద్య, ఉపాధి రంగాల్లో 42శాతం రిజర్వేషన్లను కేటాయిస్తూ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లులు ఆమోదించింది. వాటిని షెడ్యూల్ 9లో చేర్చాలని కేంద్రాన్ని కోరుతోంది. కానీ, కేంద్రం ఎటూ తేల్చడం లేదు. పైగా స్థానిక సంస్థలలో అన్ని సామాజికవర్గాలకు కలిపి రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఉంది. ఒకవేళ ఆ పరిధి దాటాలంటే అందుకు ప్రత్యేక కారణాలు ఉండాలని, వాటిని తేల్చేందుకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటుచేయాలని మరో కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దాని ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో కులసర్వే నిర్వహించింది. అనంతరం ప్రత్యేక కమిషన్‌ను నియమించింది. ఆ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారమే ఇప్పుడు రిజర్వేషన్లను ఖరారు చేస్తోంది. బీసీలకు పెంచిన రిజర్వేషన్ల అమలుకోసం ప్రత్యేక జీవోను కూడా విడుదల చేసింది. అయితే ఈ జీవోను సవాల్ చేస్తూ ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.