Share News

Supreme Court: మెడికల్‌ సీట్లలో ‘స్థానికత’ కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయండి

ABN , Publish Date - Feb 12 , 2025 | 04:44 AM

తెలంగాణలో పీజీ మెడికల్‌ సీట్లలో స్థానికత అంశానికి సంబంధించిన కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని మంగళవారం తెలంగాణ ప్రభుత్వం కోరింది.

Supreme Court: మెడికల్‌ సీట్లలో ‘స్థానికత’ కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయండి

  • సుప్రీంకోర్టును కోరిన తెలంగాణ ప్రభుత్వం

  • పరిశీలిస్తామన్న ద్విసభ్య ధర్మాసనం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో పీజీ మెడికల్‌ సీట్లలో స్థానికత అంశానికి సంబంధించిన కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని మంగళవారం తెలంగాణ ప్రభుత్వం కోరింది. పీజీ సీట్లకు స్థానికత వర్తించదని ఓ కేసులో ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టం చేయడం, ఏపీ అభ్యర్థులకూ తెలంగాణ స్థానికత వర్తిస్తుందని తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ వినతికి ప్రాధాన్యం ఏర్పడింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో అప్పీలు చేసిన తెలంగాణ ప్రభుత్వం.. సుప్రీంకోర్టు తీర్పు దృష్ట్యా ఆ కేసును విస్తృత ధర్మాసనానికి పంపాలని కోరింది. గతంలో సుమారు వంద మంది ఏపీ విద్యార్థులు హైకోర్టులో పిటిషన్‌ వేసి... ఆంధ్రప్రదేశ్‌లో ఎంబీబీఎస్‌ పూర్తిచేసిన తమకు కూడా ఆర్టికల్‌ 371(డి) ప్రకారం తెలంగాణలోని పీజీ మెడికల్‌ సీట్లలో స్థానికతను వర్తింపజేయాలని కోరారు. దీనిని అప్పుడే తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజనలో భాగంగా ఆర్టికల్‌ 371(డి) ప్రకారం పదేళ్లపాటు మాత్రమే ఏపీ విద్యార్థులకు తెలంగాణలో స్థానికతను వర్తింపజేయాలని స్పష్టంగా ఉందని తెలిపింది.


ఈ నిబంధన ప్రకారం.. 9వ తరగతి నుంచి 12వరకు తెలంగాణలో చదివిన విద్యార్థులకు మాత్రమే స్థానిక కోటా వర్తిస్తుంది అంటూ వాదనలు వినిపించింది. ఈ వాదనతో ఏకీభవించని హైకోర్డు... ఆర్టికల్‌ 371(డి) ప్రకారం రాయలసీమ, ఆంధ్ర రీజియన్‌లలో ఎంబీబీఎస్‌ పూర్తిచేసిన విద్యార్థులకు తెలంగాణలో పీజీ మెడిటల్‌ సీట్ల కేటాయింపులో స్థానికతను వర్తింపజేయాలని తీర్పునిచ్చింది. ఆర్టికల్‌ 371(డి)..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు వర్తిస్తున్నదని, అందులో సవరణలు చేసే వరకు ఏపీ, రాయలసీమ విద్యార్థులు తెలంగాణలో స్థానిక కోటాకు అర్హులేనని తెలిపింది. ఈ తీర్పును గతేడాది డిసెంబర్‌ 18న తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. దీనిపై మరికొందరు కూడా పిటిషన్లు వేశారు. ఇవి మంగళవారం జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ కే వినోద్‌ చంద్రన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చాయి.


తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ పీజీ మెడికల్‌ సీట్లలో ప్రవేశాలకు స్థానికతను వర్తింపజేయవద్దని గత నెలలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తు చేశారు. పీజీ వైద్యవిద్యలో రాష్ట్ర కోటా కింద 50 శాతం సీట్లను నివాస ఆధారంగా భర్తీ చేయడం రాజ్యాంగ విరుద్థమని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసిన విషయాన్ని వివరించారు. ఈ నేపథ్యంలో తమ అప్పీలుపై విచారణను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని ధర్మాసనాన్ని కోరారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయి స్పందిస్తూ విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలంటే తొలుత తాము వాదనలు వినాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఆ తర్వాతే తెలంగాణ పిటిషన్‌పై ఏం చేయాలన్నది నిర్ణయిస్తామని తెలిపారు. తదుపరి విచారణను ఏప్రిల్‌కు వాయిదా వేశారు.

Updated Date - Feb 12 , 2025 | 04:44 AM